logo

గనుల వ్యర్థాలు.. ఆదాయ నిక్షేపాలు

జిల్లాలోని నాపరాళ్ల వ్యర్థాలను సిమెంటు కర్మాగారాలకు విక్రయిస్తే గనుల శాఖకు రూ.కోట్ల కొద్ది ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా కుప్పలు పేరుకుపోయాయి.

Updated : 17 Apr 2024 05:15 IST

విక్రయిస్తే రూ.కోట్ల రాయల్టీ  
దృష్టి సారించని అధికారులు

 

న్యూస్‌టుడే, తాండూరు: జిల్లాలోని నాపరాళ్ల వ్యర్థాలను సిమెంటు కర్మాగారాలకు విక్రయిస్తే గనుల శాఖకు రూ.కోట్ల కొద్ది ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా కుప్పలు పేరుకుపోయాయి.

దశాబ్దం క్రితమే ప్రతిపాదన

నాపరాళ్ల వ్యర్థాలను సమీపంలోని సిమెంటు కర్మాగారాలకు విక్రయించి ఆదాయం పొందాలనే ప్రతిపాదన దశాబ్దం క్రితమే వచ్చింది. ఆ మేరకు గనుల శాఖ నాపరాళ్ల వ్యర్థాల విక్రయ విషయాన్ని ఉన్నతాధికారులకు పంపించారు. వీరు దస్త్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. అయితే ఇప్పటికీ సదరు దస్త్రానికి మోక్షం లభించలేదు.

సిమెంటు కర్మాగారాల యజమానుల మెలిక: దశాబ్దం కిందట గనుల శాఖ అధికారులు సీసీఐ, ఇండియా సిమెంట్స్‌, పెన్నా కర్మాగారాల యజమానులతో గనుల శాఖలోని ఉన్నతాధికారులు వ్యర్థాల కొనుగోలు విషయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యర్థాలను వినియోగించి సిమెంటును ఉత్పత్తి చేయొచ్చని వివరించారు. వ్యర్థాలను సిమెంటు ఉత్పత్తికి వినియోగించడానికి తాము సిద్ధమే అని ఇండియా సిమెంట్స్‌ అంగీకారం తెలిపింది. అయితే తమకు వ్యర్థాలను ఉచితంగా ఇవ్వాలని పేర్కొంది. మిగిలిన కర్మాగారాలు కూడా అదే విషయాన్ని వెల్లడించాయి. దీనికి అధికారులు ససేమిరా అన్నారు. టన్ను నాపరాయికి చెల్లించే రాయల్టీలో నాణ్యతను బట్టి 30 నుంచి 50 శాతం చెల్లించాలని అధికారులు సూచించారు. పరిశీలిస్తామని కర్మాగారాల యజమానులన్నారు. వ్యర్థాలకు రాయల్టీని చెల్లించే ధరావత్తు నిర్ణయించాలని కోరుతూ ఉన్నతాధికారులకు దస్త్రాన్ని పంపించారు. అక్కడి నుంచి నిర్ణయం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లింది. తరువాత కదలిక లేదు.

వచ్చే ఆదాయం రూ.19.50కోట్ల నుంచి రూ.32.50కోట్లు: రాయల్టీలో 30 నుంచి 50 శాతం వసూలయ్యే విధంగా వ్యర్థాలను విక్రయించినా గనుల  శాఖకు రూ.19.50 కోట్ల నుంచి రూ.32.50 కోట్లు సమకూరే అవకాశం ఉంది. ప్రస్తుతం టన్ను నాపరాయికి రాయల్టీ ఫీజు రూ.130గా ఉంది. అయితే పెండింగులో ఉన్న దస్త్రానికి మోక్షం లభిస్తేనే ఇది జరుగుతుంది. ఆ మేరకు గనుల శాఖ కృషి చేయాల్సిన అవసరం ఉంది.

50 లక్షల మెట్రిక్‌ టన్నుల పైమాటే..

తాండూరు మండలం మల్కాపూరు, కరణ్‌కోట, ఓగిపూరు, సంగెం కలాన్‌, బషీరాబాద్‌ మండలం నవల్గా, క్యాద్గిర, ఎక్మాయి గ్రామాల్లో వందల ఎకరాల్లో నాపరాయి గనులు ఉన్నాయి. ఇవే భూముల్లో 150కి పైబడి గనులు కొనసాగుతున్నాయి. యజమానులు కార్మికులతో నాపరాళ్లను పలకలుగా పైకి తీయించే సమయంలో, లోడింగ్‌ సమయంలో,  యంత్రాలతో ప్రమాణాల మేరకు కత్తిరించినపుడు ముక్కలుగా మారుతున్నాయి. ట్రాక్టర్లు, టిప్పర్లలో నింపించిన వ్యర్థాలను గనుల గట్లు, ఖాళీ ప్రదేశాల్లో పోస్తూ వస్తున్నారు. ఇలా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి కుప్పలుగా పోసుకుంటూ వచ్చినవి 50 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగానే పేరుకు పోయాయి.

  • వీటిని తొలగిస్తే భూమి చదునుగా మారుతుంది. మళ్లీ నాపరాళ్లను వెలికి తీసే గనులుగా మార్చవచ్చు. రాయల్టీల రూపంలో అదనంగా ఆదాయం పొందొచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని