logo

మత్తు తలకెక్కి.. చదువు అటకెక్కించి..

వీసా గడువు ముగిసినా నగరంలో అక్రమంగా నివసిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న మొరాకో దేశస్థుడు హెచ్‌న్యూ పోలీసులకు చిక్కాడు. గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడ్డ నిందితుడు.. డ్రగ్స్‌ పెడ్లర్లతో స్నేహం చేస్తున్నాడు.

Published : 17 Apr 2024 02:24 IST

ఉన్నత విద్య కోసం వచ్చి డ్రగ్స్‌ బాట
వీసా ముగిసినా నగరంలోనే.. మొరాకో దేశస్థుడి అరెస్టు

ఈనాడు- హైదరాబాద్‌: వీసా గడువు ముగిసినా నగరంలో అక్రమంగా నివసిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న మొరాకో దేశస్థుడు హెచ్‌న్యూ పోలీసులకు చిక్కాడు. గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడ్డ నిందితుడు.. డ్రగ్స్‌ పెడ్లర్లతో స్నేహం చేస్తున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దిల్లీలోని మొరాకో రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి బుధవారం స్వదేశానికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్‌ మంగళవారం విలేకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

చదువు కోసం వచ్చి డ్రగ్స్‌ బాట.. మొరాకోకు చెందిన అచ్‌బిల్‌ అమీన్‌(27) కుటుంబం ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లింది. అమీన్‌ సౌదీలోనే ప్రాథమిక విద్య పూర్తిచేశాడు. హైదరాబాద్‌లో ఉన్నత విద్య కోసం 2017లో పాస్‌పోర్టు తీసుకున్నాడు. సికింద్రాబాద్‌ పీజీ కళాశాలలో బీసీఏ కోర్సులో చేరినా తరగతులకు పూర్తిస్థాయిలో హాజరవ్వలేదు. పబ్బులు, మందు పార్టీలకు హాజరయ్యే అమీన్‌ గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలోనే నగరంలోనే నివాసముండే పాలస్తీనాకు చెందిన డ్రగ్స్‌ సరఫరాదారు సయీద్‌ అలీ మహ్మద్‌ అల్‌ కాఫ్రీ, హైదరాబాద్‌కు చెందిన మరో యువతితో పరిచయం ఏర్పడింది. సయీద్‌ నగరంలో ఉంటూ డ్రగ్స్‌ విక్రయిస్తుంటాడు. ఇటీవల పంజాగుట్ట పోలీసులకు చిక్కాడు. సయీద్‌పై గతంలో ఆరు కేసులున్నట్లు తేలింది. అతని పరిచయస్థుల గురించి ఆరా తీయగా అమీన్‌ పేరు వెలుగులోకి వచ్చింది. 2021లోనే వీసా గడువు ముగిసినా స్వదేశానికి వెళ్లకుండా అక్రమంగా నగరంలో ఉంటున్నట్లు నిర్ధారించుకున్న హెచ్‌న్యూ పోలీసులు అమీన్‌ను ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలోని మొరాకో రాయబార కార్యాలయానికి సమాచారం ఇవ్వగా.. 17వ తేదీన తమ దేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని