logo

రైల్వేస్టేషన్లలో మురుగు నీటి రీసైక్లింగ్‌..

ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. నగరంలో నీటి కటకట ఏర్పడడంతో ఉద్యానాలు ఎండిపోతున్నాయి. దీనికంతటికీ కారణం నీరు తగినంత లేకపోవడమేనని సమాధానం వస్తుంది.

Updated : 17 Apr 2024 05:13 IST

ప్రతి నెలా రూ.10 లక్షలకుపైగా విలువైన జలనిధి

ఈనాడు, హైదరాబాద్‌: ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. నగరంలో నీటి కటకట ఏర్పడడంతో ఉద్యానాలు ఎండిపోతున్నాయి. దీనికంతటికీ కారణం నీరు తగినంత లేకపోవడమేనని సమాధానం వస్తుంది. కానీ దక్షిణమధ్య రైల్వే అలాంటి మాటకు తావులేదంటోంది. రైళ్లను కడిగిన నీటితో పాటు.. సాధారణ అవసరాలకు వినియోగించే నీటిని వృథా చేయకుండా.. శుద్ధిచేసి మళ్లీ వాడుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌ స్టేషన్లలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయగా.. తాజాగా చర్లపల్లి రైల్వే స్టేషన్లోనూ సిద్ధం చేస్తోంది.

సికింద్రాబాద్‌లో ప్రప్రథమం..

భారతీయ రైల్వేలోనే మొట్టమొదటి మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేశారు. ఇక్కడి ప్రయోగాలు, తద్వారా ఒనగూరిన ప్రయోజనాలు.. దేశంలోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో కేంద్రాల ఏర్పాటుకు ఊతమిచ్చింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో రోజుకు 1.50 లక్షల లీటర్ల నీటిని ఇలా ఉత్పత్తి చేస్తున్నారు. కాచిగూడలో 1.50లక్షల లీటర్లు.. హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లో 2 లక్షల లీటర్ల నీటిని ఈ మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు.  ఇప్పుడు చర్లపల్లి రైల్వేస్టేషన్లో కూడా రోజుకు 2 లక్షల లీటర్లను ఉత్పత్తి చేసేలా మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

శుద్ధి చేసిన జలాలతో..

రైల్వేస్టేషన్లలో శుద్ధి చేసిన నీటితో ఉద్యానాల నిర్వహణ, మొక్కలకు నీళ్లు అందిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను కడగడానికి, ప్లాట్‌ఫాంలు, రైల్వే ట్రాక్‌లను కడిగేందుకు వినియోగిస్తున్నారు. మళ్లీ అదే నీటిని ఒడిసి పట్టి మురుగునీటి శుద్ధి ప్లాంట్‌కు చేరేలా ఏర్పాట్లు చేశారు. మూడు రైల్వేస్టేషన్లలో  నీటిశుద్ధి కేంద్రాల ద్వారా 5 లక్షల లీటర్ల నీటిని అందుబాటులోకి తెచ్చి.. వృథాకు అడ్డుకట్ట వేయడమే కాకుండా.. లక్షల లీటర్లను పొదుపు చేస్తున్నారు.  ఇలా రోజుకు 5 లక్షల లీటర్లను నీటిని పొదుపు చేయడమంటే.. నెలకు కనీసం రూ.10 లక్షలకు పైగా పొదుపు చేసినట్టవుతుందని అక్కడి ప్లాంట్ల నిర్వాహకులు చెప్పారు.


సిటీ డిపోల్లో నీటి కటకట

బస్సులు కడిగేందుకు నీళ్ల కరవు
తుడుస్తూ సరిపెడుతున్న వైనం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో నీటి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండిపోయాయి. దీంతో నీటితో కడిగే దగ్గర తడి వస్త్రంతో తుడుస్తున్నారు. ఇందుకు నగరంలో తిరిగే బస్సులు సైతం అతీతం కాదు. ప్రతి డిపోలో బస్సులను నీటితో శుభ్రం చేసే వ్యవస్థలున్నాయి. కానీ నీటికొరత వల్ల అవి పని చేయడంలేదు. దీంతో బస్సులు దుమ్ముకొట్టుకు పోవడంతో సిటీ బస్సుల్లో ప్రయాణించే మొదటి ప్రయాణికుడు సీటును తుడుచుకుని కూర్చోవాల్సి వస్తోంది.
తుడుస్తున్నా తొలగని దుమ్ము.. డిపోలకు చేరిన బస్సులను మరుసటి రోజు  శుభ్రంగా కడిగేవారు. వారానికి ఒకసారి బస్సును మొత్తం కడిగి తుడుస్తారు. నీరు పుష్కలంగా ఉన్నప్పుడే బస్సుల శుభ్రత అంతంత మాత్రంగా ఉండేది. ప్రస్తుతం నీరు లేకపోవడంతో బస్సు లోపలి భాగంలో తుడుస్తున్నారు. ఇది సైతం వారం పది రోజులకోసారి చేస్తుండడంతో సీట్లన్నీ దుమ్ముకొట్టుకుపోతున్నాయి. నగర శివారు డిపోల్లో బోర్లు పని చేస్తుండడంతో షెడ్యూల్‌ ప్రకారం తుడుస్తున్నామని చెబుతున్నారు.  కొన్ని డిపోల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెస్తున్నప్పటికీ వారానికోసారి బస్సు బయట శుభ్రం చేసి వదిలేస్తున్నారు. లోపల వైపు తుడవడంతో ఆ దుమ్ము బస్సు సీట్లపై పడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని