logo

నేటి నుంచే నామినేషన్ల పర్వం

నాలుగు లోక్‌సభ, కంటోన్మెంట్‌ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది.

Updated : 18 Apr 2024 04:38 IST

పకడ్బందీ ఏర్పాట్లతో అధికారులు సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: నాలుగు లోక్‌సభ, కంటోన్మెంట్‌ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సెలవు రోజులు మినహా ఈనెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి సంబంధించి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)గా వ్యవహరిస్తుండగా హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో నామినేషన్లు స్వీకరించనున్నారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయంలో స్వీకరించనుండగా అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ ఆర్వోగా ఉన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి కలెక్టర్‌ గౌతమ్‌ ఆర్వోగా వ్యవహరించనుండగా మేడ్చల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి ఆర్వోగా కలెక్టర్‌ శశాంక కాగా.. రాజేంద్రనగర్‌ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి సీఈవో మధుకర్‌నాయక్‌ ఆర్వోగా ఉన్నారు. అభ్యర్థి వెంట నలుగురిని మాత్రమే అనుమతిస్తారు.

 ఏయే నేతలు ఎక్కడి నుంచి.. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి సంబంధించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ బరిలో ఉండగా శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసే అవకాశముంది. సికింద్రాబాద్‌ భాజపా అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. తొలుత ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి గుడిలో పూజల అనంతరం అక్కడి నుంచి శ్రేణులతో ర్యాలీగా మహబూబ్‌ కాలేజీలో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. అనంతరం అక్కడినుంచి జోనల్‌ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఆయనతో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఇందులో పాల్గొననున్నారు. సికింద్రాబాద్‌ భారాస అభ్యర్థి టి.పద్మారావు శుక్రవారం మొదటి సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రెండో సెట్‌ మరో తేదీన ముఖ్య నాయకులతో ర్యాలీగా వెళ్లి దాఖలు చేసే అవకాశముందని ఆ పార్టీ నేతలు తెలిపారు. మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ గురువారం సమర్పించనున్నారు. శామీర్‌పేటలోని తన నివాసం నుంచి శ్రేణులతో ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారాస అభ్యర్థి నివేదిత శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని