logo

పటిష్ఠ యంత్రాంగం.. పక్కా వ్యూహం

పార్లమెంట్‌ ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టింది.

Updated : 22 Apr 2024 05:30 IST

ఎన్నికల నియమావళి అమలుకు నిఘా

ఫిర్యాదులను నమోదు చేసుకుంటున్న కాల్‌ సెంటర్‌ సిబ్బంది

వికారాబాద్‌, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టింది. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించేలా నిఘా ఏర్పాటు చేసింది. నిబంధనల ఉల్లంఘనలపై ఎవరికి ఫిర్యాదు చేయాలి తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

మద్యం పంపిణీ చేసినా..

ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు మద్యం పంపిణీకి యత్నిస్తారు. అనుమతి లేకుండా, పరిమితికి మించి మద్యం నిల్వ చేసినా, విక్రయించినా ఓటర్లకు పంపిణీ చేసినా శిక్షార్హులవుతారు. ఇందులో పట్టుబడితే ఎక్సైజ్‌ చట్టం-1968 ప్రకారం ఆరుమాసాల నుంచి ఏడాది జైలు, రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మద్యం పంపిణీపై జిల్లా ఆబ్కారీ అధికారి ఫోన్‌ నం. 8712658729కు చేసి ఫిర్యాదు చేయవచ్చు.

గెలవాలని కానుకలిస్తారు

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తపనతో అభ్యర్థులు తమ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో ఓటర్లకు కానుకలు పంపిస్తుంటారు. చీరలు, కుక్కర్లు, క్రికెట్‌ కిట్లు, ఫోన్లు ఇలా ఏదీ ఇచ్చినా ఐపీసీ సెక్షన్‌ 171(ఈ) ప్రకారం ఏడాది జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తారు. కానుకలపై ఆయా మండలాల సహాయ ఎన్నికల అధికారులుగా విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ, తహసీల్దార్లకు లేదా ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నం.08416-357507కు ఫిర్యాదు చేయవచ్చు.

ఓటర్లను బెదిరిస్తే.. కంట్రోల్‌ రూమ్‌కు..

అభ్యర్థులు కొన్నిసార్లు ఓటర్లను బెదిరిస్తారు. ఇలా చేస్తే ఐపీసీ సెక్షన్‌ 171 (సి) ప్రకారం ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఆయా పోలీస్‌ఠాణాల నిలయాధికారులకు, ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే స్పందిస్తారు. చర్యలు తీసుకుంటారు.  

సందేహాల నివృత్తికి..

సందేహాల నివృత్తి కోసం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1950 టోల్‌ఫ్రీ సంఖ్యకు ఫోన్‌ చేయాలి. ఓటర్ల జాబితాలో పేర్లు, పోలింగ్‌ కేంద్రాల వివరాలతో పాటు ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు. అనుమతి లేకుండా గోడ పత్రికలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం, ప్రచారం చేయడం తదితరాలపై ఫిర్యాదులు చేయాలి. ఇప్పటివరకు 115 అందగా, స్పందించి పరిష్కరించారు.

100 నిమిషాల్లోపే పరిష్కారం

ప్రచార సమయం, కోడ్‌ ఉల్లంఘన, నియమావళి అమలుపై సి- విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లోపు సమస్యను పరిష్కరించే బాధ్యతను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తీసుకుంటాయి. కేంద్ర ఎన్నికల సంఘం నేషనల్‌ గ్రీవెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌కు రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులను సైతం పరిష్కరిస్తారు. ఇప్పటి వరకు 18 ఫిర్యాదులు అందగా, అన్నీ పరిష్కరించారు. ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికారులకు ఫిర్యాదుచేసే అవకాశాన్ని కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని