logo

కాంగ్రెస్‌తోనే ముదిరాజ్‌లకు గుర్తింపు: రంజిత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీతోనే ముదిరాజ్‌లకు సరైన గుర్తింపు లభిస్తుందని చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి తెలిపారు.

Published : 03 May 2024 03:27 IST

తాండూరులో వృద్ధుడిని ఓటేయాలని కోరుతున్న రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని

తాండూరు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీతోనే ముదిరాజ్‌లకు సరైన గుర్తింపు లభిస్తుందని చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి తెలిపారు. గురువారం తాండూరులో నిర్వహించిన ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముదిరాజ్‌ల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కన్వీనర్‌ సునీత, పీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌, ముదిరాజ్‌ నాయకులు ఉత్తమ్‌చంద్‌, బంటు వేణుగోపాల్‌, హన్మంతు, నర్సింహులు పాల్గొన్నారు.

తాండూరు పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని కోరుతూ రంజిత్‌ రెడ్డి,  ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు. వృద్ధులను, మహిళలను పలకరించి కాంగ్రెస్‌కు ఓటేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

పెద్దేముల్‌, న్యూస్‌టుడే: పదేళ్ల భాజపా శకం ముగిసిందని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయమని చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పెద్దేముల్‌, కందనెల్లి, మంబాపూర్‌ గ్రామాల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టి సభలను నిర్వహించారు. కార్యక్రమంలో  డీసీసీబీ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభారాణి, వైస్‌ ఎంపీపీ మధులత తదితరులు పాల్గొన్నారు.

కోట్‌పల్లి, న్యూస్‌టుడే: మరోసారి ఆదరించి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బుగ్గపూర్‌లో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు.

గ్యారంటీలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు

మాట్లాడుతున్న రామ్మోహన్‌రెడ్డి

పరిగి, న్యూస్‌టుడే: తాండూరులో ఈనెల 6న జరిగే ప్రియాంక గాంధీ భారీ బహిరంగ సభను లక్ష మందితో నిర్వహిస్తామని జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం తమ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారంటీలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన వారు స్వచ్ఛందంగా తమ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న భాజపా, భారాసలు ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని అన్నారు.  కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పరశుôరాంరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.


సీఎం రేవంత్‌ ప్రజలకు చేసింది శూన్యం: భారాస

మాట్లాడుతున్న సబితారెడ్డి, వేదికపై మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్‌, రోహిత్‌ రెడ్డి, చేవెళ్ల అభ్యర్థి కాసాని..

న్యూస్‌టుడే, తాండూరు, పూడూరు, ధారూర్‌: మాజీ మంత్రి, మహేశ్వర్‌ ఎమ్మెల్యే  సబితారెడ్డి గురువారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ‘రైతుల రుణమాఫీపై దేవుళ్లపై ఒట్లు పెట్టడం కేసీఆర్‌ను తిట్టుడు తప్పిస్తే ఐదు నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు చేసింది ఏమీలేదని సబితారెడ్డి విమర్శించారు. గురువారం రాత్రి యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌లో నిర్వహించిన బషీరాబాద్‌, యాలాల మండలాల భారాస ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం సక్రమంగా పనిచేయాలంటే చేవెళ్ల లోక్‌సభలో భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలన్నారు. కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ చేవెళ్లలో భారాసను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రజలను నిలువునా మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌ బైండ్ల విజయ్‌కుమార్‌, వికారాబాద్‌ జడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, రాష్ట్ర భారాస నాయకుడు శ్రీశైల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ రాజుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ః తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఐదు నెలల్లోనే విఫలమైందని, ప్రజలు కేసీఆర్‌ను కోరుకుంటున్నారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. భారాస ఎంపీ అభ్యార్థి కాసాని జ్ఞానేశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిలతో కలిసి మన్నెగూడలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ః  సిరుగాయపల్లికి చెందిన భారాస జిల్లానాయకుడు రాంగోపాల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, మరికొందరు భారాసలో చేరారు.ః కాంగ్రెస్‌ పార్టీ హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని సబితా రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఓ వేడుక వేదికలో కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, పాల్గొన్నారు.


రిజర్వేషన్ల రద్దంటూ కాంగ్రెస్‌ నాటకాలు: భాజపా

మాట్లాడుతున్న నారాయణలాల్‌ పంచారియా

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: రిజర్వేషన్ల రద్దు పేరిట భాజపాపై కాంగ్రెస్‌ దొంగనాటకాలకు తెరతీసిందని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు నారాయణలాల్‌ పంచారియా అన్నారు. కాంగ్రెస్‌ ఎన్ని కుయుక్త రాజకీయాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. భాజపాకు 400 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం మొయినాబాద్‌లోని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ భాజపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికీ భాజపాకు మిత్రపక్షాలతో కలిసి 400 స్థానాలు ఉన్నప్పటికీ.. ఏ రోజూ రిజర్వేషన్ల జోలికి వెళ్లలేదని, ఇకముందూ వెళ్లదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను కాపాడేది కేవలం భాజపా, ఎన్డీఏ ప్రభుత్వమేనన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ మచ్చలేకుండా పాలన సాగిస్తున్నారని, కచ్చితంగా ఈసారి భాజపాకు 400 సీట్లను కైవసం చేసుకుని మూడోసారి ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టనున్నారని చెప్పారు. చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారని తెలిపారు. సమావేశంలో నాయకులు మధుసూదన్‌రెడ్డి, రాజమల్లేష్‌, రాజుగౌడ్‌, రవి, ప్రభాకర్‌రెడ్డి, యాదయ్య, మాధవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని