logo

ఉత్కంఠ పోరులో ఆధిక్యాలు స్వల్పమే

రాజధాని పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీ నమోదైంది హైదరాబాద్‌లోనే.

Updated : 03 May 2024 06:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీ నమోదైంది హైదరాబాద్‌లోనే.1984 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి  సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ 3,481 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 7.7లక్షల మంది ఓటర్లుండగా.. సుమారు 6లక్షల మంది ఓటేశారు.  సలావుద్దీన్‌కు 2,22,187 ఓట్లు,  సమీప తెదేపా అభ్యర్థి కె.ప్రభాకర్‌రెడ్డికి 2,18,706  ఓట్లు వచ్చాయి.

సికింద్రాబాద్‌లో.. సికింద్రాబాద్‌లో 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంఎం హషీమ్‌ 3,847 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 6,15,045 మంది ఓటర్లు ఉండగా 3,37,559 (54.9 శాతం) మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.ఎం.హషీమ్‌కు 1,60,230 ( 47.5 శాతం) ఓట్లు రాగా.. సమీప భారతీయ లోక్‌దళ్‌ అభ్యర్థి టి.లక్ష్మీకాంతమ్మకు 1,56,383 (46.3 శాతం) ఓట్లు వచ్చాయి.

2009లో మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాలు ఏర్పడగా..ఇప్పటి వరకు  మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. మల్కాజిగిరిలో 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి 0.70 శాతం (10,919 ఓట్ల) తేడాతో విజయం సాధించారు. చేవెళ్లలో 2019లో జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థి జి.రంజిత్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో రంజిత్‌రెడ్డి 1.12 శాతం (14,317) ఓట్లతో గెలుపొందారు.


అప్రమత్తతతోనే నకిలీ ఓట్లకు అడ్డుకట్ట

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో అధికారులు పోలింగ్‌ సజావుగా పూర్తిచేసే చర్యలపై దృష్టిపెట్టారు. గతంలో నాంపల్లిలో ఓ ఓటరు తన చేతి వేలిపై వేసిన సిరా గుర్తును రసాయనంతో చెరిపేసుకుని, ఇంకోసారి ఓటు వేసేందుకు యత్నిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. నగరంలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయనే ఫిర్యాదులొచ్చాయి. రాబోయే ఎన్నికల్లో అలాంటివాటికి తావు ఇవ్వొద్దని అధికారులు సంకల్పించారు. పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించే ఓటర్ల ముఖాన్ని, ఓటరు కార్డులోని ఫొటోలను జాగ్రత్తగా పరిశీలించాలని, అలాగే మహిళా ఓటర్ల ముఖాలను సరిచూసేందుకు  తప్పనిసరిగా కనీసం ఓ మహిళా అధికారికి విధులు కేటాయించినట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం స్పష్టం చేసింది.

6గంటల వరకు పోలింగ్‌తో లాభమే

ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం, వేడి గాలుల ధాటికి జనం భయపడుతున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్‌ సమయాన్ని సాయంత్రం 5గంటల నుంచి 6గంటల వరకు పొడిగించడంపై జీహెచ్‌ఎంసీ సంతోషం వ్యక్తం చేస్తోంది.  పోలింగ్‌ పెరిగేందుకు ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. వాతావరణం నాలుగు గంటల నుంచి చల్లబడుతున్నందున, ఉదయం ఓటు హక్కు ఉపయోగించుకోని వృద్ధులు, దివ్యాంగులు, ఇతర ఓటర్లు సాయంత్రం వేళ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లొచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని