logo

ఓటర్లు భిన్నం.. ఓటింగ్‌ విభిన్నం

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనది. కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటు కూడా కీలకంగా మారుతుంది.

Updated : 03 May 2024 04:21 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనది. కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటు కూడా కీలకంగా మారుతుంది. ప్రతి ఒక్కరూ పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి తమ ఓటును ఉపయోగించుకోలేరు. దీంతో భారత ఎన్నికల సంఘం పలు రకాల పద్ధతులను అవలంబిస్తోంది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సైనికులు, ఎన్నారైలు, గూఢచారి వ్యవస్థలో పనిచేస్తున్నవారు, వయోవృద్ధులు ఓటు ఉపయోగించుకునేందుకు వివిధ మార్గాలను కల్పించింది. వాటి గురించి తెలుసుకుందాం..

ప్రాక్సీ ఓటు: సాయుధ దళాలు, గూఢచారి, ఇంటిలిజెన్స్‌, బోర్డర్‌ రోడ్స్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు కింద పనిచేస్తున్నవారు ప్రాక్సీ ఓటును వినియోగించుకుంటారు. ఈ పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకునే సేవా ఓటరును ‘క్లాసిఫైడ్‌ సర్వీస్‌ ఓటర్‌’ (సీఎస్‌వీ)గా పేర్కొంటారు. సేవా ఓటరు తన నియోజకవర్గంలో ఓటరుగా నమోదైన వ్యక్తిని ప్రాక్సీ (ప్రతినిధి)గా నియమించుకోవచ్చు. సేవా ఓటరుకు బదులు తమ ప్రతినిధి నేరుగా ఓటు వేస్తారు. ప్రాక్సీ ఓటింగ్‌ తమకు సైతం వర్తింపజేయాలని ఎన్నారైలు డిమాండ్‌ చేస్తున్నారు.


ఈడీసీ ద్వారా

తమ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు అదే కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. అలాంటి వారు ఈడీసీ (ఎలక్షన్‌ డ్యూటీ సర్టిఫికెట్‌) తీసుకొని తాము విధులు నిర్వర్తిస్తున్న పోలింగ్‌ కేంద్రంలోనే ఓటు వేయవచ్చు.


సర్వీసు ఓటు

ఆర్మీ, నౌకా దళం, ఎయిర్‌ ఫోర్స్‌, అసోం రైఫిల్స్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ మొదలైన సాయుధ బలగాల్లో పనిచేసేవారు, రాష్ట్రం వెలుపల విధులు నిర్వర్తిస్తున్న రాష్ట్ర సాయుధ పోలీసు దళ సభ్యులను, వారితోపాటు నివసించే తమ భార్య లేదా భర్తను సర్వీసు ఓటర్లుగా గుర్తిస్తారు. వీరు ముందుగా తమ స్వస్థలంలోని ఓటరు జాబితాలో సర్వీసు ఓటర్లుగా నమోదు చేయించుకోవాలి. అనంతరం సంబంధిత రిటర్నింగ్‌ అధికారి పంపించిన పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఓటును వినియోగించుకుంటారు.


ఎన్నారైలు ఇలా

భారతీయ పౌరసత్వం ఉండి విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం ఇతర దేశాలకు వెళ్లి అక్కడే ఉంటున్నవారు ఉన్నారు. అలాంటి వారు ఫారం- 6ఏ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పాస్‌పోర్టు సైజు ఫొటో, వీసా, పాస్‌పోర్టు నకలు తదితర ధ్రువపత్రాలను సమర్పించి ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. అనంతరం పోలింగ్‌ రోజు వచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది.


పోస్టల్‌ బ్యాలెట్‌

ఎన్నికల విధుల్లో భాగంగా ఉద్యోగులు తమ నియోజకవర్గంలో కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసం ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది.


టెండర్‌ ఓటు: ఎన్నికల రోజు వరకు ఓటరు జాబితాలో పేరు ఉండి, పోలింగ్‌ కేంద్రం వద్ద గల్లంతు కావడం, తమ ఓటును వేరే వారు వేయడం లాంటి పరిస్థితుల్లో వారికి టెండర్‌ ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పిస్తారు. ఓటరు అంతకు ముందు ఓటేయలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది.


సాధారణ ఓటు

భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీన్ని సాధారణ ఓటు అంటారు. ఇలా నమోదు చేసుకున్నవారు పోలింగ్‌ రోజు సంబంధిత బూత్‌లో ఓటు వేస్తారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి వద్దే ఓటేసేందుకు ఎన్నికల సంఘం అనుమతిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని