logo

ప్రజలను మోసం చేస్తున్న బడేభాయ్‌, చోటాభాయ్‌: కేటీఆర్‌

అమలు కాని హామీలతో బడే భాయ్‌ మోదీ, చోటాభాయ్‌ రేవంత్‌ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీ రామారావు విమర్శించారు.

Published : 03 May 2024 03:45 IST

బోరబండ శ్రీరామ్‌నగర్‌కాలనీలో ప్రసంగిస్తున్న కేటీఆర్‌

బోరబండ, న్యూస్‌టుడే: అమలు కాని హామీలతో బడే భాయ్‌ మోదీ, చోటాభాయ్‌ రేవంత్‌ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీ రామారావు విమర్శించారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి టి.పద్మారావు తరఫున రహ్మత్‌నగర్‌ డివిజన్‌ శ్రీరామ్‌నగర్‌ కూడలిలో గురువారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్కసీటు రాలేదని, లోక్‌సభ ఎన్నికల్లోనూ అలాగే చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల ప్రజలు కాంగ్రెస్‌ మాయమాటలు నమ్మి మోసపోయారని, ఈసారి అలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు.  ప్రధాని మోదీ చెప్పినట్లు అచ్ఛేదిన్‌ రాలేదని, సచ్చేదిన్‌ మాత్రం వచ్చాయని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు పది నుంచి 12 సీట్లు ఇస్తే ఒక సంవత్సరం లోపు కేసీఆర్‌ శకం మరోసారి ప్రారంభమవుతుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి రాహుల్‌ బాటలో నడుస్తున్నారా లేక మోదీ బాటలో నడుస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అని రాహుల్‌ అంటే ‘నహీ నహీ బడే భాయ్‌ హై’ అంటూ రేవంత్‌ అంటున్నారని తెలిపారు.  ఖైరతాబాద్‌ నుంచి భారాస ఎమ్మెల్యేగా గెలిచిన నాగేందర్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత దానం భాజపాలో చేరరని నమ్మకం ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావడం మాట అటుంచి, వచ్చినవి  వెళ్లిపోతున్నాయన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని తాము ప్రయత్నిస్తే, విషనగరంగా మార్చేందుకు భాజపా నాయకులు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నగరానికి ఒక్క నయాపైసా పని చేయలేదని దుయ్యబట్టారు. ‘భాజపా అక్కరకు రాని చుట్టం’ అని ఆయన అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లే లోక్‌సభ ఎన్నికల్లో పద్మారావునూ ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌ ప్రసంగిస్తున్న సమయంలో సమీపంలో ఉన్న మసీదు నుంచి అజాన్‌ వినపడటంతో అది ముగిసే వరకు ఆయన తన ప్రసంగాన్ని నిలిపివేశారు. భారాస సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి టి.పద్మారావు, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే గోపీనాథ్‌, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి మోదీ కుట్ర

మూసాపేట, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలు ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మూసాపేటలో గురువారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జూన్‌ 2 తర్వాత హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం తనకు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్‌రెడ్డి ‘చిల్లర మాటలు.. ఉద్దెర పనులు’ అన్నట్లుగా పాలన ఉందన్నారు. కొత్త పరిశ్రమలను తెచ్చి ఉపాధి అవకాశాలను కల్పించాల్సింది పోయి ఉన్న పరిశ్రమలు తరలిపోయే దుస్థితికి కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగజారిందన్నారు. ఎన్నికలకు ముందు తాము మైసూర్‌ నుంచి తీసుకొచ్చిన పరిశ్రమ సీఎం అసమర్థతతో గుజరాత్‌కు తరలిపోయిందన్నారు. రోజుకు నాలుగైదు సార్లు కరెంట్‌ కోతలు అమలవుతున్నాయని, ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకునే వారు కరవయ్యారని, తమ హయాంలో పేదలకు 25 వేల లీటర్ల ఉచితంగా తాగునీటిని ఇస్తే, ఇప్పుడు రూ.2 వేలు చెల్లిస్తే 24 గంటలలోపు ట్యాంకర్‌ ద్వారా నీటిని సరఫరా చేస్తానని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పడం సిగ్గు చేటని అన్నారు. రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం చేసిన సాయం ఏమి లేదన్నారు. ఆయనకు తెలిసిందల్లా హిందూ ముస్లిం మధ్య తగదాలు పెట్టి ఓట్లు దండుకుంటారన్నారు. యాదాద్రిలో కేసీఆర్‌ అఖండమైన తరహాలో నర్సింహస్వామి ఆలయం కట్టినా ఏనాడు రాజకీయ ప్రయోజనాలకు వాడలేదన్నారు. మోదీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు కె.నవీన్‌కుమార్‌, శంభీపూర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని