logo

అత్యధిక ఓటింగ్‌ నమోదైంది అప్పుడే!

రాజధాని పరిధిలో ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదైంది 1991లోనే.

Updated : 03 May 2024 05:26 IST

ఈనాడు, హైదరాబాద్‌

రాజధాని పరిధిలో ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదైంది 1991లోనే. అంతకుముందు 9 ఎన్నికలు, తర్వాత జరిగిన 7 ఎన్నికల్లో ఆ స్థాయిలో ఓటింగ్‌ సాధ్యం కాలేదు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి 1991లో జరిగిన ఎన్నికల్లో 77.1శాతం ఓటింగ్‌ నమోదైంది. అప్పట్లో ఇక్కడ 12,96,145 మంది ఓటర్లు ఉండగా 9,99,602 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మజ్లిస్‌ అభ్యర్థి సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ, భాజపా అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డికి మధ్య హోరాహోరీ పోరు సాగింది. సలావుద్దీన్‌ ఒవైసీకి 4,54,823 ఓట్లు, బద్దం బాల్‌రెడ్డికి 4,15,299 ఓట్లు వచ్చాయి. ఉత్కంఠ పోరులో 39,524 ఓట్ల మెజార్టీతో సలావుద్దీన్‌ విజయం సాధించారు. 1984లో 76.8 శాతం, 1989లో 71.3శాతం, 1998లో 73.2శాతం ఓటింగ్‌ నమోదుకాగా  2004 నుంచి ఓటింగ్‌ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక సికింద్రాబాద్‌ నియోజకవర్గ పరిధిలో అత్యధిక ఓటింగ్‌ నమోదైంది 1984లోనే. ఈ ఎన్నికల్లో 59.9శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2009లో చేవెళ్ల నియోజకవర్గం ఏర్పడగా ఇప్పటి వరకు మూడు ఎన్నికలు జరగ్గా 2009లో అత్యధికంగా 64.5శాతం పోలింగ్‌ నమోదైంది. మల్కాజిగిరి నియోజకవర్గం సైతం 2009లోనే ఏర్పడగా ఇక్కడ 2019లో అత్యధికంగా 53.4శాతం ఓటింగ్‌ నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని