logo

కొత్త వారికి కలిసొస్తుందా..!

చేవెళ్ల లోక్‌సభ నియోజక వర్గానికి ఇప్పటి వరకు జరిగిన రెండు ఎన్నికల్లోనూ భారాస నుంచి కొత్తగా పోటీచేసిన అభ్యర్థులే విజయం సాధించారు.

Updated : 10 May 2024 05:40 IST

న్యూస్‌టుడే, తాండూరు: చేవెళ్ల లోక్‌సభ నియోజక వర్గానికి ఇప్పటి వరకు జరిగిన రెండు ఎన్నికల్లోనూ భారాస నుంచి కొత్తగా పోటీచేసిన అభ్యర్థులే విజయం సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లోనూ కొత్త అభ్యర్థే (కాసాని జ్ఞానేశ్వర్‌) పోటీ చేస్తున్నారు. కాబట్టి మూడోసారి కూడా సెంటిమెంటు కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.  

2014లో కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

చేవెళ్ల లోక్‌సభకు 2014లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా భారాస అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి (అప్పటి తెరాస) బరిలో నిలిచారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి పట్లోళ్ల కార్తీక్‌ రెడ్డిపై 73,023 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2019 ఎన్నికలకు వచ్చే సరికి కొండా భారాసను వదిలి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

2019లో గడ్డం రంజిత్‌రెడ్డి

ఇదే లోక్‌సభకు 2019లో జరిగిన ఎన్నికల్లో భారాస నుంచి కొత్తగా గడ్డం రంజిత్‌రెడ్డి పోటీ చేశారు. ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఎదురు నిలిచారు. గడ్డం రంజిత్‌రెడ్డి 14,317 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2024 ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందు ఆయన భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఈ పార్టీ నుంచే ఇప్పుడు అభ్యర్థిగా నిలబడ్డారు.  

ప్రస్తుతం.. కాసాని జ్ఞానేశ్వర్‌

ప్రస్తుత 2024లో జరుగుతున్న చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో భారాస నుంచి కొత్త అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ పోటీ చేస్తున్నారు. ఇదివరకు జరిగిన రెండు ఎన్నికల్లో ఈ పార్టీ నుంచి పోటీ చేసిన కొత్తవారే విజయం సాధించారు.  

మూడోసారి పోటీ.. రెండో విజయంపై గురి  

చేవెళ్ల లోక్‌ సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి రెండో విజయంపై గురి పెట్టారు. 2014లో తెరాస నుంచి గెలిచారు. 2019లో కాంగ్రెస్‌ నుంచి  ఓడిపోయారు. ఇప్పుడు మూడో సారి  భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు సాధించి రెండో విజయం సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని