logo

ఓటేద్దాం.. ఛాలెంజ్‌ చేద్దాం

ఓటింగ్‌శాతం పెంచేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు ఛాలెంజ్‌ విసురుతున్నాయి. ‘మీరు ఓటేయండి...మీకు తెలిసిన పది మందికి ఓటేయాలని ఛాలెంజ్‌ విసరండి’ అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి.

Updated : 10 May 2024 05:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఓటింగ్‌శాతం పెంచేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు ఛాలెంజ్‌ విసురుతున్నాయి. ‘మీరు ఓటేయండి...మీకు తెలిసిన పది మందికి ఓటేయాలని ఛాలెంజ్‌ విసరండి’ అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. కాలనీ సంక్షేమ సంఘాల వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ నినాదాన్ని విస్తృతం చేయాలని కోరుతున్నారు. నగరంలోని కొందరు సామాజిక కార్యకర్తలు ఈ నినాదాన్ని మరో కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ‘మీరు ఓటేయండి.. కొత్త ఓటర్లు ఓటేసేలా ఛాలెంజ్‌ ఇవ్వండి’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు.  వాట్సాప్‌ గ్రూపుల్లో ఇంకు సిరాతో ఫొటోను పంచుకుంటూ..మిగిలినవారు ఓటేసి ఆ ఫొటోలను పంచుకోవాలనే నిబంధన పెడుతున్నారు.


దుర్వినియోగం చేస్తే వేతనంలో కోత విధించండి..

ప్రభుత్వం ప్రకటించిన షరతులతో కూడిన సెలవును దుర్వినియోగం చేస్తే వేతనంలో కోత విధించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రతిపాదించింది. వేలిపై సిరా గుర్తును చూసిన తర్వాతే సెలవుగా పరిగణించాలని ఐటీ, ఫార్మా తదితర రంగాల యాజమాన్యాలను కోరింది. అంతేకాదు.. పోలింగ్‌ రోజున ఓటేసిన వాహనదారులకు లీటరు పెట్రోల్‌పై రూపాయి రాయితీ ఇచ్చేలా, షాపింగ్‌మాల్స్‌లో రిబేటు ఇచ్చేలా మార్గదర్శకాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. గతంలో దిల్లీ వంటి నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల్లో రూపాయి రాయితీకి ప్రాచుర్యం లభించిందని, మహారాష్ట్రలోని మాల్స్‌ అసోసియేషన్లు రిబేటు ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నాయని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి తెలిపారు.


గత రికార్డులు తిరగరాయాలి..

రాజధాని పరిధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌శాతం నమోదైంది 1991లోనే. ఆ ఎన్నికల్లో 77శాతం మంది ఓటేశారు.  హైదరాబాద్‌ నియోజకవర్గంలో 1984లో 76.8శాతం, 1989లో 71.3శాతం, 1998లో 73.2శాతం ఓటింగ్‌ నమోదు కాగా.. 2004 నుంచి ఓటింగ్‌ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక సికింద్రాబాద్‌ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌ నమోదైంది 2004లోనే. ఆ ఎన్నికల్లో 59.9శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకు మించి పోలింగ్‌ నమోదైన దాఖలాలు లేవు. చేవెళ్ల నియోజకవర్గంలో అత్యధికంగా 64.5శాతం, మల్కాజిగిరి నియోజకవర్గంలో 53.4శాతం పోలింగ్‌ నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని