logo

4 సార్లు.. 4 నియోజకవర్గాలు

శాసనసభకు వరుసగా ఎన్నికయ్యే నాయకులు కొందరే ఉంటారు. వారు కూడా ఏదో ఒకటి, రెండు నియోజకవర్గాలకే పరిమితమవుతారు.

Updated : 21 Nov 2023 06:13 IST

శాసనసభకు వరుసగా ఎన్నికయ్యే నాయకులు కొందరే ఉంటారు. వారు కూడా ఏదో ఒకటి, రెండు నియోజకవర్గాలకే పరిమితమవుతారు. అయితే రాష్ట్రంలో 1952 నుంచి 1967 వరకు వరుసగా నాలుగు సార్లు వేర్వేరు స్థానాల నుంచి ఎన్నికైన నేత ఒకరే ఉన్నారు. ఆయనే బుట్టి రాజారాం. నల్గొండ జిల్లాకు చెందిన రాజారాం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే రాజకీయ జీవితం ప్రారంభించారు. కరీంనగర్‌లో ఆయన పేరిట ఓ కాలనీయే ఉండటం విశేషం. కొన్నాళ్లు కరీంనగర్‌లో నివసించిన రాజారాం అనంతరం బెల్లంపల్లిలో స్థిరపడ్డారు. 1952లో జగిత్యాల ద్విసభ నుంచి ఎస్‌సీఎఫ్‌ అభ్యర్థిగా 30 శాతం ఓట్లు సాధించి మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 1957 ఎన్నికల్లో సుల్తానాబాద్‌ ద్విసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 31 శాతం ఓట్లతో గెలిచారు. 1962 ఎన్నికల్లో పెద్దపల్లి(ఎస్సీ) నుంచి కాంగ్రెస్‌ తరఫున 75.66 శాతం ఓట్లు పొందారు. 1967లో నుస్తులాపూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 46.92 శాతం ఓట్లతో విజయం సాధించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందడంతో రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.

న్యూస్‌టుడే, పెద్దపల్లి


నిలువెత్తు అభిమానం

మెట్‌పల్లి పట్టణంలో సోమవారం భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరు యువకులు ప్రధాని మోదీ, అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కటౌట్లు పట్టుకొని సభా ప్రాంగణానికి రావడం ఆకట్టుకుంది.

చిత్రం: న్యూస్‌టుడే, జగిత్యాల


మీ భుజాలపైనే.. నా గెలుపు బాధ్యత

ధర్మపురి భారాస అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సోమవారం వెల్గటూరు మండలం కప్పారావుపేట, శాఖాపూర్‌, వెంకటాపూర్‌, స్తంభంపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఆయన నృత్యం చేశారు. అనంతరం వారు మంత్రిని ఎత్తుకొని సందడి చేశారు.

న్యూస్‌టుడే, వెల్గటూరు


పార్టీ ఏదైనా ఆ శాఖ..ఉమ్మడి జిల్లాకే..

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ శాఖల్లో కీలకమైన పౌరసరఫరాల శాఖ మంత్రి పదవి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా శాసనసభ్యులనే వరించడం ఆనవాయితీగా వస్తోంది. 2014కు పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుత మంథని శాసనసభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2014 నుంచి 2020 వరకు మంత్రివర్గంలో ఈటల రాజేందర్‌ (ప్రస్తుత హుజూరాబాద్‌ ఎమ్మెల్యే) ఆ శాఖను పర్యవేక్షించారు. 2020 నుంచి ఇప్పటివరకు కరీంనగర్‌ శాసనసభ్యుడు గంగుల కమలాకర్‌ పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గానూ కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ ఉన్నారు. రాష్ట్రంలో వ్యవసాయపరంగా కీలకమైన జిల్లాలో లక్షలాది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో సూర్యాపేట తర్వాత ఇక్కడే ఎక్కువగా బియ్యం మిల్లులుండటం విశేషం.       

ఈనాడు, పెద్దపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని