logo

కంటి సమస్యల పరిష్కారమే లక్ష్యం

విద్యార్థుల్లో కంటి సమస్యలు గుర్తించి చికిత్స అందించేందుకు ప్రభుత్వం వసతి గృహాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తోంది.

Published : 16 Apr 2024 03:27 IST

రాయికల్‌ మండలం ఒడ్డెలింగాపూర్‌ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

న్యూస్‌టుడే, ధర్మపురి గ్రామీణం: విద్యార్థుల్లో కంటి సమస్యలు గుర్తించి చికిత్స అందించేందుకు ప్రభుత్వం వసతి గృహాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. ఆయా వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఆరు నుంచి పద్దెనమిది సంవత్సరాలు కలిగిన విద్యార్థులందరికీ కంటి పరీక్షలు చేయనున్నారు. రాష్ట్రీయ బాల స్వస్థ్య , వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మొదటి దశలో ఉమ్మడి జిల్లాలో ఈనెల 22 వరకు కంటి పరీక్షలను నిర్వహిస్తారు. చిన్న సమస్యలకు అప్పటికప్పుడే చికిత్స, మందులను అందిస్తారు. శస్త్ర చికిత్స అవసరమైతే జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందజేయనున్నారు. ఈ నెల 22వరకు ఉమ్మడి జిల్లాలో 40 గురుకులాలు, ఇతర వసతి గృహాల్లో మొత్తం 19,517 మంది  విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టనున్నారు. ప్రతీ జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 3 నుంచి 8 బృందాల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

గుర్తించి చికిత్స...

ప్రధానంగా విద్యార్థులు తమలో ఉన్న దృష్టి లోపాన్ని త్వరగా గుర్తించక పోవడంతో చిన్న సమస్య సైతం జఠిలంగా మారుతోంది. కొందరికి దగ్గరి చూపు స్పష్టంగా ఉన్నా దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు. మరి కొందరిలో దూరపు వస్తువులు స్పష్టంగా కనిపించినా దగ్గరి చూపు అంతగా ఉండటం లేదు. వీటితోపాటు అనేక సమస్యలు చిన్నారుల్లో అధికంగా తలెత్తుతున్నాయి. పరీక్షల ద్వారా సమస్యను గుర్తించి చికిత్స అందించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

దృష్టి లోపాలు తగ్గించేందుకు

విద్యార్థుల్లో దృష్టి లోపాలను గుర్తించేందుకు అన్ని వసతి గృహాల విద్యార్థులకు వైద్య సిబ్బంది బృందాల వారిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దశల వారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. పలువురు చిన్నారులు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరికి మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నాం.

డాక్టర్‌ శ్రీనివాస్‌, ఉప అధికారి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని