logo

రెండేళ్లయినా.. అసంపూర్తిగానే!

సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించి, విద్యా రంగాన్ని పటిష్ఠం చేయాలని గత ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Updated : 16 Apr 2024 05:37 IST

నత్తనడకన ‘మన ఊరు-మన బడి’ పనులు

న్యూస్‌టుడే, ఇబ్రహీంపట్నం: సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించి, విద్యా రంగాన్ని పటిష్ఠం చేయాలని గత ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 274 పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రారంభించగా రెండేళ్లు గడిచినప్పటికీ సగానికి పైగా పాఠశాలల్లో నిర్మాణాలు నేటికీ పూర్తికాలేదు. పలు పాఠశాలల్లో పాత తరగతి గదులను తొలగించగా నూతన గదుల కోసం, ఇతర నిర్మాణాల కోసం పనులు ప్రారంభించగా అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో ఇబ్బందులు తొలగుతాయని భావించిన విద్యార్థులకు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. ఈ విద్యా సంవత్సరం ముగియనుండడంతో వేసవి సెలవుల్లో పనులు పూర్తి చేస్తేనే వచ్చే విద్యా సంవత్సరంలోనైనా విద్యార్థులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలపై ‘న్యూస్‌టుడే’ కథనం..


పునాదుల దశలోనే..  

ఇబ్రహీంపట్నంలో నిలిచిన పనులు

ఇబ్రహీంపట్నం: మండలంలో ‘మన ఊరు మనబడి’ కార్యక్రమంలో మొదటి విడతలో ఇబ్రహీంపట్నం, గోధూర్‌, వర్షకొండ జిల్లా పరిషత్‌, కోజన్‌ కొత్తూర్‌ మండల పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, కోమటి కొండాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాల, మూలరాంపూర్‌, వర్షకొండ, గోధూర్‌, ఇబ్రహీంపట్నంలోని రెండు ప్రాథమిక పాఠశాలలున్నాయి. కోమటి కొండాపూర్‌ ప్రాథమికోన్నత, ఇబ్రహీంపట్నంలోని ఒడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగిలిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభించినప్పటికీ మధ్యలోనే నిలిచిపోయాయి. ఇబ్రహీంపట్నం, గోధూర్‌ గ్రామాల్లోని ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం పనులను ప్రారంభించగా పిల్లర్ల దశలోనే నిలిచి పోయింది.


రెండు పాఠశాలల్లోనే..  

తాటిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మరుగుదొడ్లు  

మల్యాల: మండలంలో రామన్నపేట, మల్యాల బాలుర, బాలికల, బల్వంతాపూర్‌, తక్కళ్లపల్లి, తాటిపల్లి, రాంపూర్‌, మద్దుట్ల గ్రామాల్లోని జడ్పీ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు(మొత్తం 13) ‘మన ఊరు-మన బడి’ పథకం కింద ఎంపికయ్యాయి. రామన్నపేట గ్రామంలోని జడ్పీ, ప్రాథమికోన్నత పాఠశాలలో మాత్రమే వంద శాతం పనులు పూర్తికాగా మిగిలిన పాఠశాలల్లో 30 నుంచి 40 శాతం వరకు పనులు జరిగాయని మండల విద్యాధికారి శ్రీనివాస్‌ తెలిపారు. కొన్ని పాఠశాలల్లో మేజర్‌ పనులతోపాటు మరమ్మతు పనులు, విద్యుత్‌, కలరింగ్‌ పనులు చేపట్టలేదని వివరించారు. చేసిన పనులకు బిల్లుల మంజూరు నిలిచిపోవడంతో గుత్తేదార్లు ఆసక్తి చూపడంలేదని అధికారులు పేర్కొంటున్నారు. 


చెల్లింపుల్లేక..

గణేశ్‌పల్లెలో అసంపూర్తిగా కిచెన్‌ షెడ్డు

సారంగాపూర్‌: మండలంలో 33 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 12 పాఠశాలలను మన ఊరు-మన బడి కింద ఎంపిక చేశారు. సారంగాపూర్‌ ప్రాథమిక, ఉన్నత, పెంబట్ల ప్రాథమిక, ఎస్‌జే కాలనీ పాఠశాలల్లో పనులు పూర్తి చేసుకుని ప్రారంభం కాగా మిగతా ఎనిమిది పాఠశాలల్లో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రంగపేట, ప్రాథమిక, ఉన్నత, పోచంపేట, కోనాపూర్‌ ఉన్నత పాఠశాల, రేచపల్లి ఉన్నత, ప్రాథమిక, గణేష్‌పల్లె పాఠశాలల్లో పనులు నిలిచిపోయాయి. కొన్ని నెలలుగా చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో మధ్యలోనే నిలిపివేశారు.  


60 శాతం మాత్రమే..

ధర్మపురి ఉన్నత పాఠశాలలో డైనింగు హాలు నిర్మాణం

ధర్మపురి: మండలంలో మొత్తం 18 పాఠశాలల్లో ‘మన ఊరు మనబడి’ కార్యక్రమం కింద పనులు చేపట్టారు. దోనూర్‌, తిమ్మాపూర్‌, జైన, నేరెళ్ల, ధర్మపురిలో రెండు పాఠశాలల్లో పనులు పూర్తి చేశారు. ధర్మపురిలోని బాలుర ఉన్నత పాఠశాలలో డైనింగు హాలు నిర్మాణం ఇంకా పూర్తవలేదు. మిగిలిన 13 పాఠశాలల్లో 50 నుంచి 60 శాతం పనులు పూర్తయ్యాయి. గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారుల చొరవ చూపనికారణంగా పరిస్థితి అధ్వానంగా మారింది. గుత్తేదారులు మొదట్లో ఆసక్తి కనబరచినా ఎన్నికలు రావడంతో పనులు నిలిచి పోయాయి. క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయలోపంతో పనుల్లో జాప్యం నెలకొంది.


9 బడుల్లో పూర్తి..

వెల్లుల్లలో అసంపూర్తిగా వంటగది

మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణంతో పాటు మండలంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి 57 ఉండగా, 4,175 మంది విద్యార్థులు చదువుతున్నారు. ‘మన ఊరు మనబడి’ కింద 20 పాఠశాలలను ఎంపిక చేశారు. 9 పాఠశాలల్లో పనులు పూర్తికాగా, అయిదు పాఠశాలల్లో చివరి దశలో ఉన్నాయి. మరో ఆరు పాఠశాలల్లో పనులు ప్రగతిలో ఉన్నాయి. కోనరావుపేటలో ప్రాథమిక పాఠశాల గదులు శిథిలావస్థకు చేరుకోగా, నాలుగు గదులు మంజూరయ్యాయి. ఉపాధి హామీ కింద వంటగది, మూత్రశాలలు ఇంకా ప్రారంభం కాలేదు. వెల్లుల్లలో వంటగది అసంపూర్తిగా ఉంది. బిల్లులు రాక పనుల్లో జాప్యం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


గుత్తేదారుల అనాసక్తి

కోరుట్ల జడ్పీహెచ్‌ఎస్‌(బాలికల) పాఠశాలలో..

కోరుట్ల: కోరుట్ల పట్టణం, మండలంలో మొత్తం 54 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో ‘మన ఊరు మన బడి’ కింద మొదటి విడతలో భాగంగా 9 ఉన్నత, 11 ప్రాథమిక పాఠశాలలు కలిపి మొత్తం 20 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటి నిర్మాణం కోసం రూ.7.49 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గతేడాది కేవలం 3 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తి చేశారు. మిగతా 16 పాఠశాలల్లో పనులను ప్రారంభించినా బిల్లులు రావడం లేదని మధ్యలోనే వదిలేశారు. ఒక పాఠశాలలో ఇప్పటి వరకు ఎలాంటి పనులను ప్రారంభించకుండా వదిలేశారు.


రేకుల షెడ్ల కిందనే..

మల్లాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో గదుల నిర్మాణం

మల్లాపూర్‌, న్యూస్‌టుడే: మండలంలో మల్లాపూర్‌, ఒబులాపూర్‌, మొగిలిపేట, గుండంపల్లి, సాతారం, చిట్టాపూర్‌, రేగుంట, వెంపల్లి, వెంకట్రావుపేట, సాతారం గ్రామాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి నిధులు మంజూరు చేశారు. రేగుంట ఉన్నత పాఠశాల మినహా ఎక్కడా భవన నిర్మాణాలు పూర్తికాలేదు. కొన్ని చోట్ల ఉన్న గదులను తొలగించి కొత్త వాటిని నిర్మించకపోవడంతో రేకుల షెడ్లు, ఫ్లెక్సీల కింద తరగతి గదులను నిర్వహించాల్సి వస్తుంది. మల్లాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో కేవలం మూడు గదులు మాత్రమే ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని