logo

అడుగడుగునా తనిఖీలతో ప్రలోభాలకు అడ్డుకట్ట

ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్‌సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

Published : 20 Apr 2024 04:47 IST

లోక్‌సభ స్థానం పరిధిలో 2 అంతర్రాష్ట్ర, జిల్లాల సరిహద్దులో 15 చెక్‌పోస్టులు

సుల్తానాబాద్‌ మండలం దుబ్బపల్లి చెక్‌పోస్టులో తనిఖీ చేస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్‌సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా చెక్‌ పోస్టుల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారా? లేదా పరిశీలించేందుకు కలెక్టరేట్‌లో మానిటరింగ్‌ వ్యవస్థకు సీసీ కెమెరాలు అనుసంధానించారు. రిటర్నింగ్‌ అధికారులు తమ చరవాణుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలను పరిశీలిస్తున్నారు. నామినేషన్లు స్వీకరిస్తుండటంతో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.

తనిఖీ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే..

లోక్‌సభ పరిధిలోని పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ నియోజకవర్గంలో అర్జునగుట్టలో అంతర్రాష్ట్ర, చెన్నూర్‌లో అన్నారం బ్యారేజీ, సుందిళ్ల బ్యారేజీ, బెల్లంపల్లిలో రేపల్లివాడ, సోమగూడెం, పోచమ్మ గుడి, మంచిర్యాల నియోజకవర్గంలో గూడెం, తాళ్లపేట, ఇందారం, ధర్మపురి నియోజకవర్గంలో రాయపట్నం గోదావరి వంతెన, మంథని నియోజకవర్గంలో వెక్లాస్‌పూర్‌, మేడిపల్లి, పెద్దపల్లిలో గుంపుల వంతెన, దుబ్బపల్లి, రామగుండం నియోజకవర్గంలో గోదావరి వంతెన, బసంత్‌నగర్‌, ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాంతాల్లో జిల్లా సరిహద్దు తనిఖీ కేంద్రాలు నెలకొల్పారు. పోలీసులు, ఆబ్కారీ, ఇతర శాఖల సిబ్బంది వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు.

నిరంతర పర్యవేక్షణ

ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, మద్యం, డబ్బు పంపకాలు, తాయిలాలు నియంత్రించి ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందుబాటులోని సాంకేతికత అందిపుచ్చుకుని నిఘా పెంచుతున్నారు. పోలీసుల పహారాలో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. జిల్లా, అంతర్రాష్ట్ర సరిహద్దులోని చెక్‌పోస్టుల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గతంలో చెక్‌పోస్టుల వద్ద వీడియో చిత్రీకరణలో వాహనాల తనిఖీలు చేసేది. అప్పుడప్పుడు జిల్లా ఉన్నతాధికారులు వీడియో చిత్రీకరణ దృశ్యాలను తనిఖీ చేసేవారు. ప్రస్తుతం వాహనాల తనిఖీల్లో పారదర్శకత కోసం మానిటరింగ్‌ వ్యవస్థ అమలు చేస్తున్నారు. చెక్‌ పోస్టుల్లోని ఇరువైపులా బిగించిన సీసీ కెమెరాలు మానిటరింగ్‌ వ్యవస్థకు అనుసంధానం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని