logo

శ్రమజీవి గుండె సడి వినండి

ఎండనక వాననక కష్టాన్నే నమ్ముకొని జీవించే కార్మికులు.. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దాటినా హక్కుల కోసం పోరాటాలు చేయాల్సి వస్తోంది. కష్టజీవులు, కర్మ వీరులకు కనీస వసతుల కల్పనలో పాలకులు విఫలమవుతున్నారు.

Updated : 01 May 2024 05:23 IST

నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం
న్యూస్‌టుడే, గోదావరిఖని

ఎండనక వాననక కష్టాన్నే నమ్ముకొని జీవించే కార్మికులు.. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దాటినా హక్కుల కోసం పోరాటాలు చేయాల్సి వస్తోంది. కష్టజీవులు, కర్మ వీరులకు కనీస వసతుల కల్పనలో పాలకులు విఫలమవుతున్నారు. శ్రమకు తగిన ఫలితం ఉండటం లేదు. ఎనిమిది గంటల పని వేళల కోసం చేసిన పోరాటానికి గుర్తుగా ఏటా మే 1న కార్మిక దినోత్సవం జరుపుకొంటున్నాం. మే డే సందర్భంగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వివిధ రంగాల కార్మికుల ఆకాంక్షలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.


బండబారుతున్న బతుకులు

ఉమ్మడి జిల్లాలో 369 గ్రానైట్‌, కంకర క్వారీలున్నాయి. ఇందులో సుమారు 25 వేల మంది పని చేస్తున్నారు. నిత్యం గుట్టలు, బండల పేలుళ్ల మధ్య పని చేసే వీరి జీవితాలకు భరోసా ఉండటం లేదు. భారీ బండరాళ్లను లోడింగ్‌ చేసే సమయంలో ప్రమాదానికి గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కనీస వేతనాలు అందించడంతో పాటు బీమా సౌకర్యం కల్పించాలని క్వారీ కార్మికులు కోరుతున్నారు.


మిల్లు కార్మికులకు గిట్టుబాటు కరవు

ఉమ్మడి జిల్లాలో 294 పారాబాయిల్డ్‌, మరో 900 వరకు రారైసు మిల్లులున్నాయి. అన్ని చోట్లా కలిపి దాదాపు 20 వేల మంది కూలీలు పని చేస్తున్నారు. వీరికి కనీస వేతనాలు అమలు కావడం లేదు. పని చేసే చోట భద్రత కరవైంది. రారైసు మిల్లుల కార్మికులకు ఆరు నెలలే పని ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో గిట్టుబాటు వేతనాలు చెల్లిస్తే మేలు చేకూరుతుంది.


చేతి నిండా పనేదీ!

ఉమ్మడి జిల్లాలో 1.70 లక్షల మంది బీడీ కార్మికులు పని చేస్తున్నారు. వారి చిరు సంపాదనపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) భారంగా మారింది. ఈ భారం తగ్గించాలని వారు కోరుతున్నారు. బీడీ కార్మికుల్లో ఎక్కువ మంది మహిళలే. నెలలో కేవలం 10-14 రోజుల పని మాత్రమే దొరుకుతోంది. జీవో నంబరు 41 ప్రకారం కనీస వేతన చెల్లింపుతో పాటు నెలలో 26 రోజులు పని కల్పించాలని బీడీ కార్మికులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ప్రధాని ఆవాస్‌ యోజన లేదంటే రాష్ట్ర పభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షల చొప్పున తమకు వర్తింపజేయాలని వీరు ఆశిస్తున్నారు.


అభద్రతలో అసంఘటిత రంగం

ఉమ్మడి జిల్లాలో అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు భద్రత కరవైంది. ఇటుక బట్టీల్లో, గృహ నిర్మాణ రంగంలో పని చేసే కూలీల జీవితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇటుక బట్టీ కార్మికుల జీవితాలు గుత్తేదార్ల చేతుల్లోనే మగ్గిపోతున్నాయి. బట్టీల్లో కనీస వసతులు కూడా లేకపోగా అరకొర వేతనాలతో బతుకీడుస్తున్నారు. అయినా వారిని బాండెడ్‌ లేబర్‌గానే వినియోగించుకుంటున్నారు. ఇక గృహ నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులకు రోజువారీ కూలీతోనే సరిపెట్టుకుంటున్నారు. వారి జీవితాలకు గ్యారంటీ లేకుండా పోయింది.


నల్ల సూరీళ్లపై ఆదాయ పన్ను భారం

భూగర్భంలో దాగిన నల్లబంగారాన్ని వెలికితీస్తున్న గని కార్మికుల స్వేదంలో ఎక్కువ మొత్తం పన్ను రూపంలో ఆవిరవుతోంది. సింగరేణిలో మొత్తం 28,829 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్కో ఉద్యోగి ఏటా రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పన్ను రూపంలో చెల్లిస్తున్నారు. అంటే సంపాదనలో ఏటా 30 శాతాన్ని ఆదాయ పన్ను కింద చెల్లించాల్సి వస్తోంది. బొగ్గు ఉత్పత్తి విధుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో వీరు పని చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న కార్మికులు, హక్కుల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. విశ్రాంత కార్మికుల పింఛనును సవరించాలని పాతికేళ్లుగా కోరుతున్నారు. ఇక సంస్థలో పని చేసే కాంట్రాక్టు కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు అందడం లేదు. హైపవర్‌ కమిటీ వేతనాలు చెల్లించాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు.


ఆధారం లేక ఆర్థిక ఇబ్బందులు

మగ్గాలను నమ్ముకొని జీవిస్తున్న నేత కార్మికుల బతుకులకు ఆ‘ధారం’ కరవైంది. చేతివృత్తిని నమ్ముకొని జీవిస్తున్న బడుగుజీవులు ఆర్థికంగా చితికిపోయి మగ్గాలపైనే తనువు చాలించిన సందర్భాలున్నాయి. ఎంతో నైపుణ్యం కలిగినా ఉపాధి లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 15 వేల మంది నేత కార్మికులు పని లేక ఆర్థికంగా చితికిపోతున్నారు. పరిశ్రమలు తెరవకపోవడంతో చేతి నిండా పని లేకుండా పోతోంది. ఏడాది పొడవునా ఉపాధి కల్పించాలని నేతకార్మికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని