logo

పంట రుణాలపై వడ్డీ వసూలు

జిల్లాలో వానాకాలం, యాసంగి పంట ఉత్పత్తుల అమ్మకం జోరందుకోగా ప్రభుత్వం, ప్రైవేటు వ్యాపారులు డబ్బులను రైతుల బ్యాంకుఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు బ్యాంకుల్లోని తమ పంట రుణాలను పెద్దఎత్తున రెన్యూవల్స్‌ చేస్తుండగా వడ్డీభారం వేధిస్తోంది.

Published : 04 May 2024 04:41 IST

జిల్లా రైతులపై రూ.100 కోట్ల భారం
న్యూస్‌టుడే, జగిత్యాల వాణిజ్యం

జిల్లాలో వానాకాలం, యాసంగి పంట ఉత్పత్తుల అమ్మకం జోరందుకోగా ప్రభుత్వం, ప్రైవేటు వ్యాపారులు డబ్బులను రైతుల బ్యాంకుఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు బ్యాంకుల్లోని తమ పంట రుణాలను పెద్దఎత్తున రెన్యూవల్స్‌ చేస్తుండగా వడ్డీభారం వేధిస్తోంది. పంటరుణాల వడ్డీ రాయితీ ఉత్తర్వులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో బ్యాంకులు వసూలు చేస్తున్నందున జిల్లా రైతులపై సాలీనా రూ.100 కోట్ల భారం పడుతోంది.

సాగుదారులు వ్యవసాయ రుణాలు బ్యాంకుల నుంచి తీసుకున్న తేదీ నుంచి సంవత్సరంలోపు వడ్డీతోసహా అసలు చెల్లిస్తే రూ.లక్ష వరకు సున్నావడ్డీ, రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పావలావడ్డీ వర్తింపచేస్తారు. వ్యవసాయ రుణాలకు 7 శాతం వడ్డీ ఉండగా 3 శాతం కేంద్ర ప్రభుత్వం, 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. కేంద్రం 3 శాతం వడ్డీరాయితీని సక్రమంగా ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు. దీంతో బ్యాంకులు, సహకార సంఘాలు ప్రస్తుతం రైతుల నుంచి తప్పనిసరిగా వడ్డీ వసూలు చేస్తున్నాయి. రైతులు అడిగితే ప్రభుత్వం సకాలంలో వడ్డీమాఫీ జీవో జారీ చేయటంతో పాటు నిధులను విడుదల చేస్తేనే వడ్డీ తీసుకోమని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు.


రెండు విధాలా నష్టం

గిత్యాల జిల్లాలో 1.89 లక్షల మంది రైతులు వానాకాలం, యాసంగి పంటకాలాల్లో రూ.2,292 కోట్ల వరకు పంటరుణాలను తీసుకుంటున్నారు. రూ.900 కోట్ల వరకు సాగు అనుబంధంగా రుణాలను మంజూరిస్తారు. పంటరుణాలకు రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వడ్డీని ముందుగా ఇవ్వకున్నా బ్యాంకులకు రీయింబర్స్‌మెంటుగానైనా ఇవ్వాలి. కానీ రీయింబర్స్‌మెంటుగా కూడా ఇవ్వటంలేదు. రైతుల నుంచి వడ్డీ తీసుకోని పక్షంలో ఈ మొత్తాన్ని ప్రభుత్వం తమకు వెనక్కి ఇవ్వనందున తామే రైతుల నుంచి నేరుగా వసూలు చేయాల్సి వస్తోందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. వడ్డీ వసూలుతో జిల్లా రైతులపై సాలీనా రూ.100 కోట్ల వరకు అదనపు వడ్డీభారం పడుతోంది. మరోవైపు జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.153 కోట్లవరకు రిబేటు రావాల్సి ఉంది. రిబేటు సంఘాలకు రానందున లాభాలను బదలాయించక రైతులు రెండురకాలుగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వానాకాలం పంటరుణాల రెన్యూవల్స్‌ను పెద్దఎత్తున చేపడుతుండగా వడ్డీవసూలు చేయకుండా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుని తమకు ఆర్థిక ఆసరా కలిగించాలని రైతులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని