logo

భానుడి భగభగ.. కావొద్దు ఓటుకు సెగ

ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. రోజురోజుకూ ఎండలు భగభగమంటున్నాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు.

Published : 09 May 2024 05:09 IST

నాలుగు చోట్ల 2 గంటల ముందే పోలింగ్‌ ముగింపు
పూర్తి స్థాయి వసతుల ఏర్పాటుతో ఓటింగ్‌ శాతం పెంపు
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

దయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. రోజురోజుకూ ఎండలు భగభగమంటున్నాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. నడి వేసవిలో ఎన్నికల నిర్వహణ అభ్యర్థులతో పాటు అధికారులకు సవాల్‌గా మారింది. తీవ్రవాద ప్రాబల్య ప్రాంతమైన పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలుండగా నాలుగు చోట్ల సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగియనుంది. దీంతో ఓటింగ్‌ శాతం తగ్గే ప్రమాదం ఉంది. ఎండల తీవ్రత నేపథ్యంలో అధికారులు టెంట్లు, తాగునీటి వసతి కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్లకు మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. 

ఆ సెగ్మెంట్లలో  4 గం.ల వరకే..

పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వీటిలో మంథని, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలో 4 గంటలకే పోలింగ్‌ ముగియనుంది. గత ఎన్నికల్లో చెన్నూరులో 70.23 శాతం, బెల్లంపల్లిలో 69.81, మంచిర్యాలలో 59.39, ధర్మపురిలో 69.11, రామగుండంలో 55.31, మంథనిలో 69.02, పెద్దపల్లిలో 69.73 శాతం చొప్పున లోక్‌సభ పరిధిలో మొత్తం 65.43 శాతం పోలింగ్‌ నమోదైంది. 2014లో ఇది 71.70 శాతంగా ఉంది. అయిదేళ్లలో 6.27 శాతం పోలింగ్‌ తగ్గింది. 2019 ఏప్రిల్‌ 11న పోలింగ్‌ నిర్వహించారు. ప్రస్తుతం ఎండలు పెరగడంతో పాటు సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ సమయం ఉండటంతో ఓటింగ్‌ శాతంపై ప్రభావం చూపుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

వసతులు సమకూరిస్తే మేలు

  • ఎండల ప్రభావం పోలింగ్‌పై పడనుంది. ఓటింగ్‌ శాతం పెంపునకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
  • పోలింగ్‌ కేంద్రాల ముందు నామమాత్రంగా టెంట్ వేస్తున్నారు. చెట్లున్న ప్రాంతాల్లో అది కూడా కనిపించడం లేదు. ఎక్కువ ప్రాంతం నీడ ఉండేలా ఏర్పాట్లు చేయాలి.
  • విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా జనరేటర్‌ అందుబాటులో ఉంచాలి. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా టెంట్లు, చలువ పందిళ్లు వేయాలి.
  • చేతిపంపుల నీరు కాకుండా ఓటర్లకు రక్షిత తాగునీటి సౌకర్యం కల్పించాలి. వడదెబ్బకు గురైతే ప్రథమ చికిత్స కోసం మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి.
  • 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద ఓటు వేసే అవకాశం కల్పించినా ఆశించిన స్థాయిలో స్పందన లేదు. వీరికి ప్రత్యేక వసతులు కావాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని