logo

స్వర సామ్రాజ్యంలో మురళీరవం!

సంగీత దర్శకులు శ్రావ్యమైన పాటలు పాడించాలంటే అందుకు కావలసిన ప్రధాన వాయిద్యం పిల్లనగ్రోవి. సంగీత వాయిదాల్లో దానికి ఉన్న ప్రాధాన్యతే వేరు. ఆనాడు ద్వాపరయుగంలో నల్లనయ్య పిల్లనగ్రోవి ఊదుతుంటే ఆవులూ, పాములూ నాట్యం చేశాయట.

Published : 23 May 2022 01:38 IST

ఒకరు రంధ్రాలు..ఇంకొకరు స్వరాలు రాబడుతున్న

అన్నదమ్ములు రాఘవేంద్ర, విజయ్‌

సింధనూరు, న్యూస్‌టుడే : సంగీత దర్శకులు శ్రావ్యమైన పాటలు పాడించాలంటే అందుకు కావలసిన ప్రధాన వాయిద్యం పిల్లనగ్రోవి. సంగీత వాయిదాల్లో దానికి ఉన్న ప్రాధాన్యతే వేరు. ఆనాడు ద్వాపరయుగంలో నల్లనయ్య పిల్లనగ్రోవి ఊదుతుంటే ఆవులూ, పాములూ నాట్యం చేశాయట. వేణువు మాధుర్యం అంతటిది. దానిని బాన్సురి, వేణువు, మురళి అనే వివిధ నామాలతో పిలుస్తారు. సంగీతంలో ఇంతటి ప్రాముఖ్యమైన పిల్లనగ్రోవులు ఎక్కడో విదేశాల్లోనో, మహానగరాల్లోనో కాదు.. కర్ణాటక రాయచూరు జిల్లా సింధనూరులో తయారవుతున్నాయి. ప్రసిద్ధి చెందిన సినీ సంగీత దర్శకులు, కళాకారులు, ఆర్కెస్ట్రా సంస్థలు వీటిని ఆన్‌లైన్‌లో సింధనూరు నుంచి పొందుతున్నారు. సింధనూరులోని బది అనే ఇంటి పేరుగల కుటుంబం వారసత్వంగా పిల్లనగ్రోవితో అనుబంధాన్ని పెంచుకుంది. సుమారు 50 ఏళ్లుగా తాతముత్తాతల నుంచీ వీరి కుటుంబంలో మురళీగానం చేసేవారున్నారు. ప్రస్తుతం రాఘవేంద్ర బది, విజయ్‌కుమార్‌ బది అనే అన్నదమ్ములు పిల్లనగ్రోవిలను వివిధ రకాలుగా తయారు చేసి దేశవిదేశాలకు విక్రయించే స్థాయికి ఎదిగారు. ఇంట్లోని సభ్యులంతా కలసి వీటిని తయారు చేస్తూ ఇంటిని ఓ చిన్న పరిశ్రమగా మార్చుకున్నారు.

వీరికి ఎలా అబ్బిందంటే..? : రాఘవేంద్ర తాత గారు ప్రేమనాథ్‌ సా బది, పెద్దనాన్న విఠల్‌ సా బది చక్కని వేణు గాయకులు. ఇందులో విఠల్‌ బది రాజ్యోత్సవ పురస్కారం కూడా అందుకున్నారు. వారి నుంచి కుమారుడు రాఘవేంద్రకు ఈ విద్య అబ్బింది. పదేళ్ల కిందట రాఘవేంద్రకు చిన్న ప్రమాదంలో వేలు తెగింది. దీంతో వేణుగానం చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే దానిపై మమకారం చంపుకోలేక గానానికి స్వస్తి చెప్పి మురళీలు తయారీలోకి దిగారు. గాన సాధనలో లభించిన అనుభవాన్ని తయారీలో చూపించారు. అనతికాలంలోనే ఆన్‌లైన్‌లో ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. దీంతో తమ్ముడు విజయ్‌, ఇంట్లోని ఇతర సభ్యులు చేదోడుగా నిలిచి దీనినే ఉపాధిగా మలచుకున్నారు.

వివిధ కొలతల్లో తయారీ ..: బాన్సురీలకు కావలసిన నాణ్యమైన వెదురు అసోం, ఉత్తరప్రదేశ్‌ల నుంచి తెచ్చుకుంటారు. పదింటిలో సగం పురుగుపట్టో, వంకరపోయో వృథా అవుతుంటాయి. బాగా పచ్చిగా ఉన్న వెదురు కర్రలను ఆవపు నూనెలో నానబెట్టి నెల రోజుల వరకూ ఎండబెడతారు. అనంతరం సైజుల ప్రకారం పిల్లనగ్రోవులను తయారు చేస్తారు. ఒక మురళి అర గంటలోనే తయారవుతోంది. అయితే మెరుగులు దిద్దడానికి నాలుగు గంటల వరకూ సమయం పడుతోంది.

పిల్లనగ్రోవులను మొత్తం 36 రకాల వాయిద్యాలకు అనువుగా వివిధ కొలతల్లో (సైజుల్లో) రూపొందిస్తారు. హిందుస్థానీ రాగానికి ఏడు రంధ్రాలు పెడతారు.. వీటినీ కళాకారులు ఆరు వేళ్లతో మోగిస్తారు. అదే కర్ణాటక సంగీతకారులు ఎనిమిది రంధ్రాలు గల సాధనాన్ని తీసుకుని ఏడు వేళ్లు ఉపయోగించి ఊదుతారు. ఎనిమిది నుంచి 40 అంగుళాల సైజుల వరకూ ఆర్డర్లపై వీటిని తయారు చేస్తారు. తొలుత రంధ్రాలు వేసి.. రాగాలు సరిగా పలుకుతున్నాయో లేదో చూస్తారు. ఆపై వెదురు పగిలిపోకుండా రేష్మీ దారంతో గట్టిగా చుట్టి మెరుగులు అద్ది శానిటైజ్‌ చేసి ఆర్డర్ల ప్రకారం ప్యాకింగ్‌ చేస్తారు. ఒక్కోటి సైజును బట్టి రూ.2000 నుంచి రూ.5000 వరకూ ధర నిర్ణయిస్తారు. వేణువుతో ముడిపడిన మా కుటుంబానికి అదే జీవనాధారం అయిందని రాఘవేంద్ర బది, విజయ్‌కుమార్‌ బది అన్నదమ్ములు ఆనందంగా చెబుతున్నారు.


పిల్లనగ్రోవి తయారీలో రాఘవేంద్ర బది


ఇలా పెట్టెల్లో పెట్టి విదేశాలకు ఎగుమతి చేస్తారు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని