ఫారెస్ట్‌ సర్వీస్‌లో తెలుగువారి సత్తా

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి సత్తా చాటారు.

Published : 09 May 2024 03:48 IST

పోతుపురెడ్డి భార్గవ్‌కు 22.. మన్నెం అజయ్‌కుమార్‌కు 44వ ర్యాంకు
దేశవ్యాప్తంగా 147 మంది ఎంపిక.. 
వీరిలో 20 మంది ఏపీ, తెలంగాణ అభ్యర్థులే 

ఈనాడు, హైదరాబాద్‌, వరంగల్‌; ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి; మిర్యాలగూడ, చిట్యాల, న్యూస్‌టుడే: ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి సత్తా చాటారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 50లోపు ర్యాంకుల్లో ముగ్గురు తెలుగు వారు ఉన్నారు. ఈసారి దేశవ్యాప్తంగా 147 మందిని ఫారెస్ట్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు యూపీఎస్సీ ఎంపిక చేసింది. అందులో సుమారు 20 మంది వరకు ఏపీ, తెలంగాణ అభ్యర్థులు ఉంటారని అంచనా. విజేతల్లో ఎక్కువ మంది సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న వారే. వీరిలో కొందరు ఏప్రిల్‌ 16న ప్రకటించిన సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో ర్యాంకులు సాధించారు. ఐఎఫ్‌ఎస్‌లో 22వ ర్యాంకు సాధించిన పోతుపురెడ్డి భార్గవ్‌ (విజయనగరం)కు సివిల్స్‌లో 590వ ర్యాంకు వచ్చింది. 52వ ర్యాంకర్‌ గొబ్బిళ్ల కృష్ణ శ్రీవాత్సవ్‌ (కడప జిల్లా) సివిల్స్‌లో 444వ ర్యాంకు సాధించారు. విజేతలు తొలి మూడు నెలలు ముస్సోరిలో, ఆ తర్వాత 15 నెలలు దేహ్రాదూన్‌లో శిక్షణ పొందనున్నారు.

మొదటి ప్రయత్నంలో..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన మన్నెం అజయ్‌కుమార్‌ తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్‌లో 44వ ర్యాంకు సాధించారు. ఐఐటీ ధన్‌బాద్‌లో ఎంటెక్‌ పూర్తిచేసిన అజయ్‌కుమార్‌.. సొంతంగా సివిల్స్‌కు సన్నద్ధం అవుతున్నారు. సివిల్స్‌ ప్రధాన పరీక్షలో రెండు మార్కులు తగ్గడంతో ముఖాముఖికి అర్హత సాధించలేకపోయారు. తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్‌లో మంచి ఫలితం రావడం సంతోషంగా ఉందని, ఐఏఎస్‌ సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. 

ఏపీ సచివాలయంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తుమ్మల కృష్ణ చైతన్య ఐఎఫ్‌ఎస్‌లో 74వ ర్యాంకు సాధించారు. కృష్ణా జిల్లా బాపులపాడుకు చెందిన ఆయన నాలుగో ప్రయత్నంలో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. చిన్న చిన్న తప్పులతో సివిల్స్‌ 4 మార్కులతో చేజారినట్లు చెప్పారు. తనకు ఫారెస్ట్‌ సర్వీస్‌పైనే మక్కువని వివరించారు.


‘ఈనాడు’ విజేత.. అనూష

106వ ర్యాంకు సాధించిన అనూష కొల్లి ఐఐటీ ముంబయిలో 2012లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. 2018 నుంచి సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికవడంపై సంతోషం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పదోతరగతి చదివిన అనూష 563 మార్కులు సాధించారు. వరంగల్‌లో ఇంటర్‌ చదివారు. జేఈఈలో ర్యాంకు సాధించి 2008లో ముంబయి ఐఐటీలో సీటు పొందారు. అనూష తండ్రి వెంకన్న ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఐఐటీ చదివేందుకు ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో.. ఆమెపై ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు.. ఆమె ఇంజినీరింగ్‌ పూర్తయ్యే వరకూ ఖర్చులు భరించి ప్రోత్సహించారు. జర్మనీలో ఇంటర్న్‌షిప్‌నకు అవకాశం రాగా.. మరోసారి ‘ఈనాడు’ కథనం ప్రచురించింది. మిర్యాలగూడ సహాయ రవాణా అధికారి సురేష్‌రెడ్డి, పలువురు దాతల స్పందించి, సహకారం అందించడంతో.. అనూష జర్మనీ వెళ్లి 3 నెలల ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేశారు. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక.. హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరారు. వివాహమై, ఇద్దరు సంతానం కలిగాక.. 2018 నుంచి సివిల్స్‌పై దృష్టిపెట్టారు. తల్లిదండ్రులు, భర్త వావిళ్లపల్లి రామకృష్ణ ప్రోత్సహించినట్లు చెప్పారు. ‘ఈనాడు’ సహకారంతోనే తన జీవితంలో మార్పు వచ్చిందంటూ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని