విష కౌగిలిలో విలవిల

తూర్పు తీరాన పొద్దుపొడుపు... ఆంధ్రావని ప్రగతికి దిక్సూచి... అందాల విశాఖ. వైకాపా అధికారంలోకి రాగానే జగన్‌ ప్రభుత్వంలోని ముఖ్యులు రాజధాని పేరుతో ఈ నగరంపై రాబందుల్లా వాలారు కనీవినీ ఎరుగనికబ్జాకాండకు తెరతీశారు.

Updated : 09 May 2024 08:26 IST

విశాఖను కబళించిన జగన్‌ అండ్‌ కో
పరిశ్రమలు,ప్రముఖ సంస్థలనూ తరిమేశారు

తూర్పు తీరాన పొద్దుపొడుపు... ఆంధ్రావని ప్రగతికి దిక్సూచి... అందాల విశాఖ. వైకాపా అధికారంలోకి రాగానే జగన్‌ ప్రభుత్వంలోని ముఖ్యులు రాజధాని పేరుతో ఈ నగరంపై రాబందుల్లా వాలారు కనీవినీ ఎరుగనికబ్జాకాండకు తెరతీశారు. గనులపై కన్నేశారు.. భూములు కొల్లగొట్టారు.. కొండలకు గుండుకొట్టారు.. ఐటీ రంగానికి సున్నా చుట్టారు.. పరిశ్రమలను తరిమేసి, ప్రగతికి పొగబెట్టారు.. మొత్తంగా విశాఖను చెరబట్టి...సర్వనాశనం చేశారు!

ఐదేళ్ల వైకాపా పాలనలో విశాఖపట్నం తీవ్రస్థాయిలో విధ్వంసానికి, దోపిడీకి గురైంది. ఈ అద్భుత నగరంపై ప్రభుత్వ పెద్దలు కపట ప్రేమ నటిస్తూ... అత్యంత విలువైన భూములను దోచేశారు. ప్రాజెక్టులను కబ్జా చేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మూడు రాజధానుల డ్రామాతో పాగా వేసి... విశాఖను వారి ధృతరాష్ట్ర కౌగిలిలో బంధించి పీల్చి పిప్పిచేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వివాదాలు సృష్టించి, ఆ తర్వాత ‘సెటిల్‌మెంట్‌’ పేరుతో పలు ప్రైవేటు భూములను కొట్టేశారు. వారి విలాసాల కోసం ప్రకృతి విధ్వంసానికి ఒడిగట్టారు. రుషికొండకు గుండు కొట్టి... దానిపై రూ.450 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ముఖ్యమంత్రి జగన్‌ కోసం అత్యంత విలాసవంతమైన భవనాలు కట్టేశారు. విలువైన కార్యాలయాల్ని, స్థలాల్ని అప్పుల కోసం అడ్డగోలుగా తాకట్టు పెట్టారు.  ఐటీ రంగాన్ని సర్వనాశనం చేశారు. విశాఖ పేరు చెబితే గుర్తొచ్చే పర్యాటకరంగాన్నీ పక్కనబెట్టారు. ఐదేళ్లలో విశాఖకు జగన్‌ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పరిశ్రమ, ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు సరికదా... గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడుల్నీ, పరిశ్రమలనూ తరిమేసింది. ఈ ఐదేళ్లలో వైకాపా నాయకులు, వారి బినామీల చేతుల్లోకి వెళ్లిపోయిన ప్రాజెక్టుల్లో బయటకు కనిపిస్తున్నవాటి విలువే సుమారు రూ.8,450 కోట్లు. వెలుగులోకి రానివి, ఆ పార్టీ స్థానిక నాయకుల దోపిడీ చాలా ఎక్కువే ఉంటుందని అంచనా. రేయింబవళ్లు కష్టపడి కూడగట్టుకున్న రూ.కోట్ల విలువైన ఆస్తులను వైకాపా నాయకులు బలవంతంగా లాక్కున్నారని, భయంతో బయటకు చెప్పుకోలేక గుడ్లనీరు కుక్కుకుంటున్నవారు విశాఖలో ఎందరో..!

కన్ను పడితే కొట్టేయాల్సిందే..!

విశాఖలోని అత్యంత విలువైన పలు ప్రాజెక్టులను వైకాపా నాయకులు భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి, వ్యవస్థల్ని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా కొట్టేశారు. రూ.వేల కోట్ల ప్రాజెక్టులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి..!

  • రుషికొండలో రేడియంట్‌ అనే సంస్థకు 2005లో అప్పటి వైఎస్సార్‌ ప్రభుత్వం కేటాయించిన రూ.వెయ్యి కోట్ల విలువైన 50 ఎకరాల భూములు వైకాపా నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సీఎం జగన్‌ సోదరుడు అనిల్‌రెడ్డి చేతిలోకి చేరినట్టు సమాచారం. అక్కడ విలాసవంతమైన విల్లాలు నిర్మిస్తున్నారు. డీల్‌కు ముందు రేడియెంట్‌ సంస్థ చెల్లించాల్సిన రూ.46 కోట్ల స్టాంప్‌ డ్యూటీ, రూ.6 కోట్ల ఖాళీ స్థలాల పన్ను మినహాయించారు.
  • మధురవాడలో ఎన్‌సీసీ సంస్థకు చెందిన సుమారు రూ.1,500 కోట్ల విలువైన 97.30 ఎకరాల భూమిని మంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడికి చెందిన జీఆర్‌పీఎల్‌ సంస్థ దక్కించుకుంది. ఆ కంపెనీ మాటున వైకాపా పెద్దలే వ్యవహారం నడిపించారన్న ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ బోర్డు (ఏపీహెచ్‌బీ)కు చెందిన ఆ భూమిని ఎన్‌సీసీ సంస్థ 2005లో బిడ్డింగ్‌లో దక్కించుకుంది.
  • విశాఖ తీరానికి సమీపంలో కొండపై బేపార్క్‌ పేరుతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను తలదన్నేలా నిర్మించిన వెల్‌నెస్‌ సెంటర్‌ ప్రాజెక్టు.. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీన్ని పెమా వెల్‌నెస్‌ సెంటర్‌ పేరిట హెటెరో నిర్వహిస్తోంది. ఆ ప్రాజెక్టు కోసం 2000వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఓ వ్యక్తికి కొండపై 28 ఎకరాలు, సముద్ర తీరాన్ని ఆనుకుని 5.75 ఎకరాలను 33 ఏళ్లపాటు లీజుకిచ్చింది. తీసుకున్న వ్యక్తి డిఫాల్టర్‌గా మారడంతో... అదే అదనుగా ప్రభుత్వం ఆ ఆస్తిని హెటెరో సంస్థకు బదలాయించింది. జగన్‌పై సీబీఐ దాఖలు చేసిన అవినీతి కేసుల ఛార్జిషీట్‌లో హెటెరో సంస్థ పేరు కూడా ఉంది.
  • విశాఖ-భీమిలి బీచ్‌ రోడ్డులో 2003లో అప్పటి ప్రభుత్వం ప్రముఖ నిర్మాత రామానాయుడికి స్టూడియో నిర్మాణం కోసం కొండపై 34.44 ఎకరాలు కేటాయించింది. అందులోని కొంత భాగంలో స్టూడియో నిర్మించగా.. ఇంకా చాలా స్థలం ఉంది. 15.18 ఎకరాల్లో లేఅవుట్‌ వేసి విక్రయించేందుకు, నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇటీవలే జీవీఎంసీ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చింది.  సముద్రానికి అభిముఖంగా ఉండే కొన్ని బ్లాక్‌లను ‘ముఖ్యనేత’కు కట్టబెట్టేందుకు అంగీకారం కుదరడంతోనే లేఅవుట్‌కి అనుమతిచ్చినట్టు సమాచారం.

వైకాపా అధికారంలోకి రాగానే జరిగిన రూ.3 వేల కోట్ల విలువైన భూ కుంభకోణానికి నిదర్శనం ఈ దసపల్లా భూములే. ఇవే భూముల్లో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు సులభతరం చేసుకోవడానికి, వాటి వాణిజ్య విలువ పెంచుకునేందుకు మాస్టర్‌ప్లాన్‌లో రోడ్డును వంద అడుగులుగా ప్రతిపాదించారు. విస్తరణ పేరుతో 11,697 చ.గజాల భూమి పోతుందటూ రూ.100 కోట్ల టీడీఆర్‌లు కొట్టేసేందుకు పావులు కదిలాయి.

హుద్‌హుద్‌ తుపాను తీవ్రత నుంచి విశాఖ నగరాన్ని కాపాడిన రుషి కొండను వైకాపా పాలకులు ధ్వంసం చేశారు. పచ్చదనంతో తొణికిసలాడిన కొండను బోడిగుండుగా మార్చారు. లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్రమట్టిని తవ్వి తరలించారు. పర్యాటకశాఖ కాటేజీలను పడగొట్టి రూ.450 కోట్ల ప్రజాధనం కుమ్మరించి విలాసవంతమైన భవనం నిర్మించారు. వీటి  వైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మున్ముందు రుషికొండ బీచ్‌కు కూడా సందర్శకులు రాలేని పరిస్థితులు సృష్టించారు.

ద కన్వెన్షన్‌ ఆఫ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ ది నార్తన్‌ సర్కార్స్‌ (సీబీసీఎన్‌సీ) భూముల్లో 18,390 గజాల స్థలంలో వైకాపా ఎంపీ చేపట్టిన ప్రాజెక్టు ఇది. దీనికి ఎదురుగా ఉన్న టైకూన్‌ కూడలిని వాస్తు పేరుతో డివైడర్లతో మూసేశారు. 18 క్రైస్తవ సంస్థల పేర్ల మీద ఉన్న ఈ భూమిపై వివాదం న్యాయస్థానంలో నలుగుతున్నా మాస్టర్‌ ప్లాన్‌ రహదారి విస్తరణలో స్థలం కోల్పోతుందంటూ రూ.60 కోట్ల టీడీఆర్‌లను జీవీఎంసీ కట్టబెట్టింది.

భీమిలి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బలు వైకాపా విధ్వంసాలకు సజీవ సాక్ష్యాలుగా మారాయి. పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ఎర్రమట్టి దిబ్బలు, సమీపంలోనే ప్రసిద్ధ బుద్ధిజం ఆనవాళ్లు సైతం వైకాపా నాయకుల తవ్వకాలకు బలయ్యాయి.

అన్నీ...నం.2 కనుసన్నల్లో..!

విశాఖలో వైకాపా నాయకులు స్వాధీనం చేసుకున్న ప్రతి ప్రాజెక్టు లావాదేవీ ఆ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత సమ్మతితోనే జరుగుతోందని, ప్రతి ప్రాజెక్టులో ఆయనకు 20 శాతం వాటా ముట్టజెప్పాల్సిందేనని సమాచారం. ‘విశాఖ కార్యనిర్వాహక రాజధాని’ ముసుగులో అక్కడి విలువైన భూములను వైకాపా నేతలు కొట్టేయడం వెనుక ఆ నేత మాస్టర్‌మైండ్‌ ఉందని తెలిసింది. వైకాపా అధికారంలోకి వచ్చిన కొత్తలో పార్టీలో నం.2గా ఉన్న ఈ నేత బంధువులు, బినామీలు విశాఖలో భారీగా ఆస్తులు, భూములు కూడగట్టారు. ఆయన కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాన్‌ రియల్టర్స్‌ సంస్థ కొన్ని వందల ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే వెలుగుచూశాయి. ప్రతిపాదిత భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని ఆనుకుని ఉన్న 25 సర్వే నంబర్లలోని 87,714 చ.గజాల స్థలాన్ని అవ్యాన్‌ రియల్టర్స్‌ సంస్థ కొనుగోలు చేసింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారమే అప్పట్లో ఆ భూముల విలువ రూ.53.03 కోట్లు. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ అంతకంటే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. నం.2 నేతకు సన్నిహితుడైన వస్త్రవ్యాపారి గోపీనాథరెడ్డి భాగస్వామిగా ఉన్న అష్యూర్‌ డెవలపర్స్‌ సంస్థ దసపల్లా భూములను దక్కించుకుంది.

మేనత్త సందేశాలకు... రూ.300 కోట్ల భూమి

వివేకా హత్యకేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిని పదే పదే వెనకేసుకు వస్తున్న జగన్‌ మేనత్త విమలారెడ్డి సందేశాలిచ్చే ‘సెయింట్‌ లూక్స్‌’ అనే మైనారిటీ ఎడ్యుకేషన్‌ సొసైటీ చేతుల్లో రుషికొండలోని రూ.300 కోట్ల విలువైన భూమి ఉంది. 2009లో వై.ఎస్‌. ప్రభుత్వం ఆ సంస్థకు 7.35 ఎకరాల భూముల్ని ఎకరం రూ.25 లక్షల చొప్పున కేటాయించింది. క్రిస్టియన్‌ కమ్యూనిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల సాధికారత కోసం నర్సింగ్‌ శిక్షణ ఇస్తామని, మిషనరీ ఆస్పత్రి ప్రారంభిస్తామని చెప్పి ఆ భూములు తీసుకుని ప్రార్థన మందిరం మాత్రమే కట్టారు. విమలారెడ్డి తరచూ అక్కడికి వస్తూ సందేశాలు ఇస్తున్నారు.

క్రికెట్‌పైనా వారి క్రీనీడలు!

వైకాపా నాయకులు విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ)నూ  కబ్జా చేసేశారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి, ఆయన బంధువులకు ఏసీఏ పాడి ఆవులా మారింది. వైకాపా అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న ఏసీఏ పాలక మండలి సభ్యులను బెదిరించి తరిమేసి... ఏసీఏని పార్టీ పునరావాస కేంద్రంగా మార్చేశారు. దిల్లీ మద్యం కేసులో నిందితుడు, సాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్‌చంద్రారెడ్డి వరుసగా రెండోసారి ఏసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. సాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి కార్యదర్శిగా, ఆయన అనుచరుడు, వస్త్రవ్యాపారి గోపీనాథ్‌రెడ్డి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఏసీఏకి చెందిన రూ.100 కోట్లకుపైగా డిపాజిట్‌లను వారు ఇష్టానుసారం ఖర్చు చేసినట్టు ఆరోపణలున్నాయి.

వర్సిటీని భ్రష్టు పట్టించారు..!

ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైకాపా కార్యకర్తలకు మించి పార్టీ కోసం పనిచేసే ప్రసాద్‌రెడ్డిని ఆంధ్రాయూనివర్సిటీ వీసీగా నియమించారు. ప్రసాద్‌రెడ్డి యూనివర్సిటీని వైకాపాకి అడ్డాగా, రాజకీయ కేంద్రంగా మార్చేశారు.

అప్పుల కోసం ప్రభుత్వ  ఆస్తుల తాకట్టు

వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి విశాఖ వారికో అక్షయపాత్ర. ఆయన హయాంలోనే ‘బడ్జెటరీ సపోర్టు’ పేరుతో విశాఖలోని విలువైన ప్రభుత్వ భూముల్ని అప్పటి వుడా (ప్రస్తుతం వీఎంఆర్డీఏ) అమ్మేసి రూ.వెయ్యి కోట్లకుపైగా ఖజానాకు జమచేసింది. అప్పట్లోనే ఆయన అస్మదీయులకు అత్యంత విలువైన భూములను నామమాత్రపు ధరలకు కట్టబెట్టేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆ దోపిడీ పర్వాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లారు. విశాఖలోని 13 ప్రభుత్వ ఆస్తుల్ని (128.70 ఎకరాలు) తనఖా పెట్టి రూ.23,200 కోట్ల రుణం తెచ్చారు. పోనీ ఆ డబ్బులో కొంత మొత్తమైనా విశాఖకు ప్రత్యేకంగా కేటాయించారా అంటే అదీ లేదు. ఇదీ విశాఖపై జగన్‌మార్కు దొంగ ప్రేమ...!

పరిశ్రమలు పరారు

మరోవైపు విశాఖ నుంచి పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని తరిమికొట్టడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పనిచేసింది.

  • రూ.1,500 కోట్ల పెట్టుబడితో 5 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా భారీ కన్వెన్షన్‌ సెంటర్‌, హోటల్‌ నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ సంస్థ ‘లులు’ ముందుకు వచ్చింది. అప్పటి ప్రభుత్వం ఆ సంస్థకు భూములూ కేటాయించింది. పనులు ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉన్న తరుణంలో అధికారంలోకి వచ్చిన జగన్‌ లులుని తరిమికొట్టారు.
  • జగన్‌ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల... విశాఖలో అప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌ఎస్‌బీసీ, ఐబీఎం వంటి ఐటీ సంస్థలు వెళ్లిపోయాయి. ఐటీ హిల్‌-3లో తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన స్టార్టప్‌ విలేజ్‌లోకి అప్పట్లోనే వంద వరకు కంపెనీలు వచ్చాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక అవన్నీ వెళ్లిపోయాయి.
  • విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటుకి వైకాపా ప్రభుత్వమే మోకాలడ్డింది. జగన్‌ ప్రభుత్వం భూమి అప్పగించకపోవడం వల్లే ప్రాజెక్టు ముందుకి కదలడం లేదని రైల్వేశాఖ మంత్రి పలు సందర్భాల్లో చెప్పారు.
  • గత ప్రభుత్వ హయాంలో డీపీఆర్‌ సహా అంతా సిద్ధమైన విశాఖ మెట్రో ప్రాజెక్టుని జగన్‌ ప్రభుత్వం అటకెక్కించింది.
  • వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నెలకొల్పడంతోపాటు వృద్ధులకు నివాస గృహాలు నిర్మించేందుకు విశాఖలోని ఎండాడలో 2008లో అప్పటి వైఎస్సార్‌ సర్కారు చిలుకూరి జగదీశ్వరుడికి చెందిన హయగ్రీవ సంస్థకు 12.44 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. ఎంతో విలువైన ఆ భూమి కూడా వైకాపా నేతల చేతుల్లోకి వెళ్లిపోయింది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, సీఎం జగన్‌కు సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) తదితరులు ఆ భూమిని దక్కించుకున్నారు. ప్రస్తుతం దాని విలువ రూ.250 కోట్లకు పైగానే ఉంటుంది. ఎంవీవీ, జీవీ తన నుంచి ఆ భూమిని బలవంతంగా చేజిక్కించుకున్నారంటూ 2021లో జగదీశ్వరుడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో సంచలనం సృష్టించింది.
  • విశాఖ నడిబొడ్డున ఉన్న రూ.2 వేల కోట్ల విలువైన 15 ఎకరాల దసపల్లా భూములను ప్రభుత్వ పెద్దల అండదండలతో వైకాపా నేతలు కొట్టేశారు. వాటి మధ్యలో ఉన్న రహదారిని అవసరం లేకున్నా విస్తరిస్తూ.. టీడీఆర్‌ బాండ్‌ల పేరుతో మరో రూ.వెయ్యి కోట్లకు టెండర్‌ పెట్టారు. గత ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాలుగా కాపాడుతూ వచ్చిన భూములను... జిల్లా కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి, ప్రభుత్వానికి లేఖ రాయించి నిషిద్ధ జాబితా నుంచి తొలగింపజేశారు. చివరికి ఆ భూములు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సన్నిహితుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
  • విశాఖ-భీమిలి బీచ్‌ రోడ్డులో కైలాసగిరి - రుషికొండకు మధ్యలో ఎండాడ గ్రామ సర్వే నం.106లో వుడా (ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ) రెండు దశాబ్దాల క్రితం ‘కార్తీకవనం’ పేరిట పర్యాటక ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. అటవీ శాఖ నుంచి 10 ఎకరాల భూమిని తీసుకుంది. దాన్ని కొందరు వుడా నుంచి లీజుకు తీసుకుని తాత్కాలిక నిర్మాణాలతో హోటల్‌ నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ ఎంఏజీ అనే సంస్థ విలాసవంతమైన హోటల్‌ నిర్మించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక  మేఘా కృష్ణారెడ్డి చేతుల్లోకి ఆ హోటల్‌ వెళ్లిపోయింది. ఇదంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
  • విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన ఎంవీవీ అండ్‌ ఎంకే హౌసింగ్‌ సంస్థ.. కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాల విస్తీర్ణంలో భారీ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టింది. ఐదు వేర్వేరు సర్వే నంబర్లలో ఉన్న ఆ భూములకు సంబంధించిన 11 మంది యజమానులతో 2018 జనవరిలో ఎంవీవీ... జనరల్‌ పవరాఫ్‌ అటార్నీతో కూడిన డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ రిజిస్టర్‌ చేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం ఆ స్థలం విలువ రూ.500 కోట్లు. అంత భారీ ప్రాజెక్టులో భూ యజమానులకు ఇస్తోంది కేవలం 0.96 శాతం. యాజమాన్య హక్కుల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని ఎంవీవీ.. వాటి యజమానులకు అతి తక్కువ వాటా ఇచ్చి మిగిలిన భూములు సొంతం చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి.
  • విశాఖ నడిబొడ్డున ఉన్న సీబీసీఎన్‌సీ చర్చికి చెందిన సుమారు రూ.500 కోట్ల విలువైన స్థలంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విలాసవంతమైన గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఆ భూముల్ని ఎంపీ బినామీ సంస్థ పేరుతో కొట్టేశారన్న ఆరోపణలున్నాయి.
  • ఆ స్థలంలో కొంత భాగం రహదారుల విస్తరణలో పోకముందే, పోయినట్టుగా యజమానులతో దరఖాస్తు చేయించి జీవీఎంసీ రూ.60 కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్‌లు విడుదల చేసింది. అది మరో కుంభకోణం.

ఈనాడు, అమరావతి, విశాఖపట్నం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని