logo

దారి తప్పిన పాలన

ఉద్యాననగరి రహదారుల నిర్వహణ గాడితప్పింది. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె అధికారులు, ఇంజినీర్లు విఫలమయ్యారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సకాలంలో మరమ్మతులు పూర్తి చేసి నివేదిక ఇవ్వకపోతే విధుల

Updated : 30 Jun 2022 01:16 IST

అధికారులపై హైకోర్టు ఆగ్రహం

నెలమంగల పరిధిలోని ఒక రహదారి దయనీయ స్థితి

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: ఉద్యాననగరి రహదారుల నిర్వహణ గాడితప్పింది. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె అధికారులు, ఇంజినీర్లు విఫలమయ్యారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సకాలంలో మరమ్మతులు పూర్తి చేసి నివేదిక ఇవ్వకపోతే విధుల నుంచి తప్పించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామంటూ హెచ్చరించింది. అవసరమైతే సైన్యాన్ని రప్పించి వారంలోనే రహదారుల మరమ్మతు పూర్తి చేసేందుకు ఆదేశాలు ఇస్తామని తేల్చిచెప్పింది. నగరంలో రహదారులన్నీ మరమ్మతులు చేయాలని విజయ్‌ మెనన్‌ ఏడేళ్ల కిందట ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మరమ్మతులు చేస్తున్నామని, ఈ ప్రక్రియ కొనసాగుతోందంటూ పాలికె తరఫు న్యాయవాదులు నివేదికలు ఇస్తూ వస్తున్నారు. ప్రధాని, రాష్ట్రపతి, విదేశీ ప్రముఖులు వస్తేనే రహదారులు బాగు చేస్తారా అంటూ ఇంజినీర్లను గత వారం న్యాయస్థానం తూర్పారబట్టింది. గుంతలు పూడ్చడంలో పాలికె నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి, జస్టిస్‌ శంకర్‌ మగదుమ్‌ నేతృత్వంలోని పీఠం ధ్వజమెత్తింది. రహదారుల మరమ్మతు, నిర్వహణకు ముందుకు వచ్చిన అమెరికన్‌ రోడ్‌ టెక్నాలజీస్‌ సొల్యూషన్స్‌కు పాలికె సరైన విధంగా సహకారాన్ని ఇవ్వడం లేదని న్యాయమూర్తులు ప్రస్తావించారు. గోతులు పూడ్చకపోతే పాలికెలో ప్రధాన కమిషనర్‌, ఇంజినీర్లు, సిబ్బందిని విధుల నుంచి తప్పించేలా ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుందని హెచ్చరించారు. కోర్టు సహనాన్ని పరీక్షించవద్దని హితవు పలికారు. రహదారుల మరమ్మతును త్వరగా పూర్తి చేసేలా ఇచ్చిన ఆదేశాలను తమకు దాఖలు చేయాలని ఆదేశించారు. నగరంలో 2,533 గుంతలను పూడ్చవలసి ఉందని అర్జీదారుని తరఫు న్యాయవాది ఎస్‌.ఆర్‌.అనూరాధ న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. పైథాన్‌ యంత్రాన్ని ఉపయోగించి గుంతలను పూడ్చేందుకు ప్రతి చ.మీ.కు రూ.598కు ఒప్పందం కుదిరిందని, దీనిపై అధికారిక ఆదేశాలు వెలువరించవలసి ఉందని పాలికె పక్ష న్యాయవాది శ్రీనిధి కోర్టుకు విన్నవించారు.

* ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరం బెంగళూరు. ఆసియా ఖండంలో ఎక్కువ వాహనాలు ఉన్న నగరమూ ఇదే. నగరంలో నిత్యం పది ప్రమాదాలు సంభవిస్తుండగా, అందులో సగటున ఇద్దరు మరణిస్తున్నారు. మరో నలుగురు గాయపడుతున్నారు. ఆయా శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతోనే కొత్తగా రహదారి వేసిన తర్వాత కొద్ది రోజులకే దాన్ని తవ్వుతున్నారు. గుంతలను సరిగా పూడ్చకపోవడంతో అవి మృత్యుకూపాలుగా మారిపోతున్నాయి. వాహన రద్దీతోనే పలు సంస్థలు వెనక్కు వెళుతున్నాయని ఐటీ, బీటీ సంస్థల యజమానులు పలుసార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారు. మెట్రోలు, ఉపరితల వంతెనల నిర్మాణాలను చేపడుతున్నా, సమస్య ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఉపరితల వంతెనల మార్గంలోని కూడళ్లలో బిలమార్గాలను ఏర్పాటు చేయాలని గతంలో పాలికెకు సలహాదారుగా వ్యవహరించిన రాజసింహ చేసిన సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని ఇంజినీరింగ్‌ నిపుణులు ఆరోపించారు. ప్రభుత్వం, పాలికె వైఫల్యాలను నిరసిస్తూ స్థానిక నివాసులు, కళాకారులు, వివిధ పార్టీల నేతలు క్రమం తప్పకుండా నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చినా, పాలకుల్లో స్పందన కరవైంది.

బ్యారికేడ్‌ చూసుకోకుండా వస్తే ప్రమాదమేనండోయ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని