logo

అష్టదిగ్గజాలే!

యశ్వంతపుర : నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య- ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు ఎనిమిది మంది మంత్రులు పాలన సౌధం మెట్లెక్కారు. వారంతా ఎదురులేని రాజకీయ ఉద్దండులే.

Published : 21 May 2023 04:25 IST

యశ్వంతపుర : నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య- ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు ఎనిమిది మంది మంత్రులు పాలన సౌధం మెట్లెక్కారు. వారంతా ఎదురులేని రాజకీయ ఉద్దండులే. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కీలక పదవులు అలంకరించిన వారికే సిద్ధు తొలి విడత చోటివ్వడం ప్రస్తావనార్హం. కొత్త పాలన బండిని వారు పరుగులు తీయిస్తారనే విశ్వాసం సామాన్య కన్నడిగుడిది. ఆ దిశగా అడుగులు వేయడం కొత్త పాలకుల కర్తవ్యం. కొత్త మంత్రుల జీవనగతులివీ..


రాజకీయ సేద్యం భళా

ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తరువాత మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పరమేశ్వర్‌ 1957 ఆగస్టు 6న తుమకూరు జిల్లా గొల్లహళ్లిలో జన్మించారు. తుమకూరు, బెంగళూరులో చదువు పూర్తిచేసి.. మాస్కో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధన పట్టా పొందారు. కొన్నాళ్లు బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సహాయక అధ్యాపకుడిగా పని చేశారు. ప్రస్తుతం వైద్య, ఇంజనిరింగ్‌ కళాశాలలు నిర్వహిస్తున్నారు. 1989లో మధుగిరిలో నెగ్గి విధానసభలో అడుగుపెట్టారు. 1993, 1998, 2023 ఎన్నికల్లోనూ నెగ్గారు. 2013 ఎన్నికల్లో ఓడినా.. ఎగువసభ సభ్యుడయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. వీరప్పమొయిలీ, బంగారప్ప, ఎస్‌ఎంకృష్ణ మంత్రివర్గాల్లో సభ్యుడు. తాజా ఎన్నికల్లో కొరటగెరె నుంచి విజయం సాధించారు.


కేంద్రం నుంచి.. రాష్ట్రానికి

కోలారు జిల్లా శిఢ్లఘట్ట తాలూకా కమ్మదల్లి గ్రామంలో 1948 మార్చి 7న  కేహెచ్‌ మునియప్ప జన్మించారు. 1978లో తాలూకా అభివృద్ధి మండలి ఉపాధ్యక్షుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1991 నుంచి వరుసగా ఏడు సార్లు కోలారు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. పీవీ, మన్మోహన్‌ మంత్రివర్గాల్లో రైల్వే, ఆర్థిక, చిన్నతరహా పరిశ్రమల శాఖల సహాయమంత్రిగా పని చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కోలారులో ఓటమి చవిచూసినా.. తాజా విధానసభకు దేవనహళ్లి నుంచి నెగ్గి.. అమాత్య పదవి దక్కించుకున్నారు.


విద్యార్థి దశ నుంచే..

కొడుగు జిల్లా వీరాజపేటలో 1946 ఆగస్టు 24న కేజే జార్జి పుట్టారు. 1968 నుంచి కాంగ్రెస్‌ విద్యార్థి, యువజన విభాగాల్లో సేవ చేశారు. 1982లో భారతినగర నుంచి విధానసభకు ఎన్నికయ్యారు. అక్కడ మూడు సార్లు, సర్వజ్ఞనగరలో నాలుగు దఫాలు విజయం సాధించారు. బంగారప్ప, ఎస్‌ఎంకృష్ణ, సిద్ధరామయ్య మంత్రివర్గాల్లో సభ్యుడు. ఈసారీ సర్వజ్ఞనగరలో గెలిచి.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


తండ్రి నుంచి వారసత్వం

విజయపురలో 1964 అక్టోబరు 7న ఎంబీ పాటిల్‌ జన్మించారు. బీఈ (సివిల్‌) వరకు చదివిన ఆయన యువజన కాంగ్రెస్‌లో వివిధ పదవులు నిర్వహించారు. తండ్రి బీఎం పాటిల్‌ శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేయడంతో ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బబలేశ్వర నుంచి ఐదు సార్లు గెలుపొందారు. ఇదివరకటి సిద్ధు మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ బాధ్యతలు చేపట్టారు. సంకీర్ణ ప్రభుత్వంలో హోం మంత్రి. ప్రస్తుతం బబలేశ్వర నుంచే నెగ్గి.. నూతన మంత్రిగా నిలిచారు.


పాలికె నుంచి సౌధ వరకు

బెంగళూరులో 1953 జున్‌ 19న రామలింగారెడ్డి జన్మించారు. విద్యార్ధి, యువజన కాంగ్రెస్‌లో వివిధ పదవులు చేపట్టారు. 1983లో బెంగళూరు పాలికె కార్పొరేటర్‌. 1989లో జయనగర నుంచి గెలిచి తొలిసారిగా విధానసభలో ప్రవేశించారు. నాటి నుంచి ఎనిమిదిసార్లు వరుస విజయాలు దక్కించుకున్న ఆయన పీసీసీ కార్యాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వీరప్పమొయిలీ, బంగారప్ప, ఎస్‌ఎంకృష్ణ, సిద్ధరామయ్య మంత్రివర్గాల్లో సభ్యుడు. ప్రస్తుతం బీటీఎం లేఔట్‌ ఎమ్మెల్యే.


దళంలో ఎదిగిన నేత

కోలారులో 1966 ఆగస్టు 1న  జమీర్‌ అహ్మద్‌ పుట్టారు. చామరాజపేటలో నాలుగు సార్లు నెగ్గారు. 2005లో ఎస్‌ఎంకృష్ణ రాజీనామా చేయడంతో చామరాజపేటకు ఉప ఎన్నికలు నిర్వహించగా.. జమీర్‌ జేడీఎస్‌ టికెట్‌పై విజయం సాధించారు. 2018లో కాంగ్రెస్‌లో చేరారు. కుమారస్వామి, సిద్ధరామయ్య మంత్రివర్గాల్లో వక్ఫ్‌, గ్రంథాలయాల శాఖలను నిర్వహించారు. ప్రస్తుతం చామరాజపేట ఎమ్మెల్యేగా నెగ్గి.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.


సతీశ్‌.. ఆదర్శవాది

బెళగావి జిల్లా గోకాక్‌లో 1962 జూన్‌ 1న సతీశ్‌ జార్ఖిహొళి జన్మించారు. జనతా పరివార్‌కు చెందిన ఆయన నాలుగుసార్లు విధానసభకు ఎన్నికయ్యారు. 2005 ఉప ఎన్నికల్లో జేడీఎస్‌ అభ్యర్థిగా గెలిచారు. 2013లో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఎక్సైజ్‌, చిన్నతరహా పరిశ్రమలు, ఆహార పౌరసరఫరాల శాఖల మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం యమకరమరిడి నుంచి దిగువసభ సభ్యుడి హోదాలో మంత్రిగా ఎదిగిన ఆయన ఆదర్శవాది.


నాన్న నడచిన బాటలో..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడే ప్రియాంక్‌ ఖర్గే. ఆయన  1978 నవంబరు 22న బెంగళూరు జన్మించారు. ఉన్నత విద్య పూర్తి చేశాక 1998లో రాజకీయాల్లో ప్రవేశించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో చిత్తాపుర నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. 2013, 2018, 2023 ఎన్నికల్లో అక్కడి నుంచే విజయం సాధించారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఐటీ, బీటీ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం నూతన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని