logo

Software Engineer: ఆమె సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. అలా ఎలా మోసపోతారు?

ఆ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు బెంగళూరులోని తన కార్యాలయంలో చకచకా పనిచేసుకుంటూ పోతుండగా.. సెల్‌ఫోన్‌ మోగింది. అటు వైపు నుంచి ఓ గొంతు కఠినంగా వినిపిస్తోంది.

Updated : 05 Dec 2023 09:33 IST

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : ఆ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు(Software Engineer) బెంగళూరులోని తన కార్యాలయంలో చకచకా పనిచేసుకుంటూ పోతుండగా.. సెల్‌ఫోన్‌ మోగింది. అటు వైపు నుంచి ఓ గొంతు కఠినంగా వినిపిస్తోంది. ‘మీరు.. మేఘనా దుబే కదూ’ అంటూ నిలదీసినట్లు ప్రశ్నించారు. ఆమె..‘ఆ.. అవును’ అంటుండగానే.. ‘నేను ముంబయి సైబర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ మాట్లాడుతున్నా. మీపై మేం నిఘా పెట్టాం. తైవాన్‌ నుంచి ఎండీఎంఏ మాదకద్రవ్యాలు కొరియర్‌లో తెప్పించున్నది మీరేనా?’ అంటూ గట్టిగా నిలదీయడంతో ఆమె అయోమయంలో పడిపోయింది. ‘మీరేం మాట్లాడుతున్నారు సర్‌. నేను అలాంటి పనిచేయలేద’ అంటూ బదులిచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఆమెను ఫోన్లో బెదరగొట్టారు.

‘ఆ కొరియర్‌ మీరే బుక్‌ చేశారనే ఆధారాలు మా వద్ద ఉన్నాయి. వైట్‌ఫీల్డ్‌లో ఉంటున్న మీ పేరుతోనే సరకు వచ్చింది. స్కైప్‌ యాప్‌ ద్వారా మీ బెంగళూరు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. వారొచ్చి మిమ్మల్ని కటకటాల వెనక్కి నెడుతారు. సిద్ధంగా ఉండండి..’ అంటూ హెచ్చరించడంతో.. ఏదో జరుగుతోందని ఆమె భయపడిపోయింది. బయటపడే మార్గం చెప్పండని వేడుకుంది. ‘మీరు చూస్తే అమాయకుల్లానే ఉన్నారు. ఓ పని చేయండి. రిజర్వుబ్యాంకులో రూ.3.46 లక్షలు డిపాజిట్‌ చేయండి. కేసును మేం విచారించి.. మీకు సంబంధంలేదని తేల్చుతాం. అప్పుడు ఆ మొత్తం మీకు వెనక్కి వస్తుంది’ అంటూ ఓ అకౌంట్‌ నెంబర్‌ ఆమెకు సూచించారు.

ఆగమేఘాలపై ఆమె అంత మొత్తాన్ని ఆ అకౌంట్లోకి డిపాజిట్‌ చేశాక.. వారి ఫోన్‌ ఆగిపోయింది. డబ్బు ఎంతకీ వెనక్కి తెచ్చుకునే మార్గమే కనిపించకుండా పోయింది. చివరికి ఆమె వైట్‌ఫీల్డ్‌ మెట్లెక్కి జరిగిందంతా విన్నవించింది. ‘మీరు మోసపోయారు.. అలా ఎలా చేస్తారు..’ అంటూ సైబర్‌పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో కాళ్లకింద భూమి కదిలినంత పనైంది మేఘనాకు. చదువుకున్న వారే ఇలా మోసాలబారిన పడితే ఎలా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని