logo

ఇరాన్‌ చెర నుంచి భారతీయులను రక్షిస్తాం

ఇరాన్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ఆ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను త్వరలో రప్పించే ఏర్పాటు చేసినట్లు కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్‌ తెలిపారు.

Published : 16 Apr 2024 01:10 IST

విదేశాంగ మంత్రి జైశంకర్‌ హామీ

ఈనాడు, బెంగళూరు : ఇరాన్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ఆ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను త్వరలో రప్పించే ఏర్పాటు చేసినట్లు కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్‌ తెలిపారు. ఆయన సోమవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ భారతీయులు ఇజ్రాయెల్‌లో నివసించే హడగు ప్రాంతం ప్రస్తుతం ఇరాన్‌ గుప్పిట్లో ఉందని వివరించారు. మనదేశ విదేశీ వ్యవహారాల సిబ్బంది సైతం ఇరాన్‌ ఆధీనంలోనే ఉన్నారని తెలిపారు. ఆ దేశ రాయబారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే చర్చించారని వివరించారు. గతంలో రష్యా, ఉక్రెయిన్‌, ఇండో పసిఫిక్‌ల మధ్య అంతర్జాతీయ సమస్యలు ఎదురైన సమయంలోనూ ప్రధానిమోదీ నెరపిన దౌత్యం సత్ఫలితాలిచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఇదే సందర్భంగా అమెరికాలో భారతీయ యువత మరణాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ నివసించే విద్యార్థుల మరణాలతో వారి కుటుంబాలు ఎంతలా తల్లిడిల్లాయో మేము అర్థం చేసుకోగలమన్నారు. ఇప్పటికే అక్కడి భారత రాయబారి బృందాలతో, అమెరికా దౌత్య కార్యాలయంలో మాట్లాడినట్లు చెప్పారు. ఇకపై కొత్తగా అమెరికాకు వెళ్లే భారతీయులకు రక్షణ కల్పించే వ్యవస్థ ఏర్పాటు చేయాలని భారత్‌ ప్రత్యేకంగా మనవి చేసిందన్నారు.

ఈ సందర్భంగా జైశంకర్‌ రాజకీయ అంశాలపై మాట్లాడుతూ పదేళ్ల ఎన్‌డీఏ సర్కారు కారణంగా దేశంలో జాతీయభావన పెరిగినట్లు వివరించారు. శాస్త్ర సాంకేతికత, సెమీకండక్టర్‌, కృత్రిమమేధ, టెలీకమ్యూనికేషన్‌, అంతరిక్షం, మౌలిక సదుపాయాల్లో భారత్‌ పదేళ్లుగా సాధించిన వేగవంతమైన ప్రగతి ఏ అభివృద్ధి చెందిన దేశంలోనూ సాధ్యం కాలేదన్నారు. 30 ఏళ్ల కిందటే విదేశీ విధానంలో సంస్కరణలు తెచ్చిన చైనాను సైతం భారత్‌ ఆర్థికత చేరుకునే స్థాయికి ఎదిగినట్లు జైశంకర్‌ విశ్లేషించారు. వికసిత్‌ భారత్‌, భారత్‌లో తయారీ, జల్‌జీవన్‌ మిషన్‌, చంద్రయాన్‌-3 వంటి ప్రయోగాలు, కరోనా టీకా వంటి సాధనలు భారత్‌కు మరో వందేళ్లకు సరిపడా పునాది వేసినట్లు మంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని