logo

ప్రేమ పేరుతో రక్తపుటేరులా?

కర్ణాటకలో లవ్‌ జిహాద్‌ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) ఆరోపించింది.

Updated : 20 Apr 2024 06:58 IST

నేహా హత్యపై నిరసన సెగలు

బెంగళూరు : నేహా’ హత్యకు నిరసనగా ఏబీవీపీ కార్యకర్తల నినాదాలు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : కర్ణాటకలో లవ్‌ జిహాద్‌ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) ఆరోపించింది. తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ్‌ను ధార్వాడలోని కేఎల్‌ఈ అనుబంధ కళాశాల ఆవరణలోనే గురువారం దారుణంగా హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్షను విధించాలంటూ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆందోళనకు దిగారు. బెంగళూరు ఎస్‌బీఎం కూడలిలో ధర్నా సందర్భంగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటనలు ఎక్కువ అయ్యాయని ఆందోళనకారులు ఆరోపించారు. ఆందోళనకారులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు ఠాణాకు తీసుకువెళ్లారు. వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.

నిందితుడికి కస్టడీ

హుబ్బళ్లి:  కళాశాల ఆవరణతో సహ విద్యార్థిని నేహాను హత్య చేసిన మునవళ్లి నివాసి ఫయాజ్‌ను శుక్రవారం ఉదయం వరకు పోలీసులు విచారించి, ఆపై న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. రెండు వారాలు న్యాయనిర్బంధానికి పంపిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని కోరుతూ హుబ్బళ్లిలో ఏబీవీపీ, భాజపా, ఇతర హిందూ సంఘాల కార్యకర్తలు శుక్రవారం ధర్నాకు దిగారు. కళాశాల వద్ద గట్టి బందోబస్తు కల్పించారు. విద్యార్థులు రహదారులపైకి వచ్చి టైర్లు వేసి కాల్చారు. తనను ప్రేమించాలని వెంట పడుతూ వేధిస్తున్నా నేహా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదని పోలీసులు గుర్తించారని కమిషన్‌ రేణుకా సుకుమార్‌ వివరించారు.

బెళగావి : ధార్వాడ విద్యార్థిని హత్యకు నిరసనగా ప్రదర్శన

ముఖ్యమంత్రిదే బాధ్యత

బెంగళూరు (మల్లేశ్వరం): హుబ్బళ్లి ఘటనకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాధ్యత వహించాలని మాజీ మంత్రి వి.సునీల్‌కుమార్‌ డిమాండు చేశారు. ఒక మతానికి చెందిన వారికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని బెంగళూరులో ఆయన శుక్రవారం దుయ్యబట్టారు.

ఇది లవ్‌ జిహాద్‌ కాదని, తనను ప్రేమించని యువతిని లక్ష్యంగా చేసుకుని నిందితుడు కత్తితో పొడిచి హత్య చేశాడని హోం మంత్రి పరమేశ్వర్‌ స్పష్టం చేశారు. హంతకుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాసనలో తెలిపారు. పరమేశ్వర్‌ వ్యాఖ్యలను విపక్ష నేత అశోక్‌ ఖండించారు. లవ్‌ జిహాద్‌కు పాల్పడేవారికి ప్రభుత్వం పాస్‌పోర్టులు ఇస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో శాంతిభద్రతలను కాపాడడం ప్రభుత్వానికి సాధ్యం కాదని ధ్వజమెత్తారు. ఇటువంటి ఘటనలు సంభవించినప్పుడు ప్రభుత్వం ప్రేక్షకుడి పాత్ర పోషిస్తోందని మాజీ మంత్రి సీటీ రవి ట్వీట్ చేసి విమర్శలు గుప్పించారు. తన కుమార్తె ఎవరినీ ప్రేమించలేదని, ప్రేమను నిరాకరించడంతోనే హత్యకు గురైందని నేహా తండ్రి, ధార్వాడ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ నిరంజన్‌ హీరేమఠ్‌ ఆక్రోశించారు.


నేడు హుబ్బళ్లి బంద్‌

హుబ్బళ్లి: కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ నిరంజన్‌ కుమార్తె నేహాను హత్య చేసిన యువకుడి తల నరికితే రూ.10 లక్షలు ఇస్తామని జయ కర్ణాటక సంఘటన నాయకుడు ఇజారి ప్రకటించడం కలకలం రేపింది. ఆయన శనివారం హుబ్బళ్లి బంద్‌కు ఆయన పిలుపునిచ్చారు. బీవీబీ కళాశాల నుంచి తాము ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిని ఎన్‌కౌంటర్‌ చేసేందుకు చట్టం తీసుకురావాలని మంత్రి సంతోశ్‌లాడ్‌ అభిప్రాయపడ్డారు. కిమ్స్‌ శవాగారంలో హత్యకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులను ఆయన శుక్రవారం పరామర్శించారు. విద్యార్థిని హత్యను ఖండిస్తూ హిందూ సంఘాల ప్రతినిధులు మండ్యలోనూ ధర్నా నిర్వహించారు. తన కుమారుడికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఈ కేసులో నిందితుడు ఫయాజ్‌ తండ్రి బాబాసాహెబ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఆయన ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నారు. తన కుమారుడు ఘోరమైన తప్పు చేసి, తనకు, తమ మునవళ్లి గ్రామానికి చెడ్డపేరు తెచ్చాడని ఆక్రోశించారు. తన కుమారుడ్ని సైనికుడ్ని చేయాలన్న కల ఇప్పుడు కరిగిపోయిందన్నారు. విచారణ వేగంగా పూర్తి చేసి, ఫయాజ్‌కు త్వరగా శిక్ష పడాలని కోరుకుంటున్నానని తెలిపారు. హంతకుడికి జామీను లభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేహా తండ్రి నిరంజన్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఇది వ్యక్తిగత కారణానికి జరిగిన హత్య అంటూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రేమను నిరాకరించినందుకే జరిగిన హత్య అని స్పష్టం చేశారు. తన కుమార్తెకు చెడ్డపేరు తీసుకురావద్దని ముఖ్యమంత్రి, హోం మంత్రిని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని