logo

దక్షిణాదిపైనే కమలదండు గురి

సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

Published : 20 Apr 2024 06:56 IST

ఈసారి అన్నింటా భాజపాదే పైచేయి
‘ఈనాడు’తో యువ నేత విజయేంద్ర

బీవై విజయేంద్ర

ఈనాడు, బెంగళూరు : సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఎంతో కీలకం కావడంతో ఆయన నేతృత్వానికి ఓ సవాలుగా మారింది. ఓ వైపు పార్టీలోని సీనియర్లు వ్యతిరేకిస్తున్నా.. అధిష్ఠానం అందించిన నాయకత్వ బాధ్యతలను లక్ష్య సాధన దిశగా కొనసాగిస్తున్నారు. ఓ వైపు తండ్రి బి.ఎస్‌.యడియూరప్పపై విమర్శలు, మరోవైపు జేడీఎస్‌తో పొత్తుతో అసహనంతో ఉన్న కార్యకర్తలు.. కాంగ్రెస్‌ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని త్వరలో తొలి విడత ఎన్నికలకు సిద్ధమవుతున్న బి.వై.విజయేంద్రతో ఈనాడు ముఖాముఖి..

ప్రశ్న : యడియూరప్పకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందా?

జవాబు : యడియూరప్ప.. ఎప్పటికీ రాష్ట్రంలో ఓ ప్రత్యేక స్థానంలో ఉంటారు. ఆయన సేవలను గుర్తించే అధిష్ఠానం బరువైన బాధ్యతలు అప్పగించింది. బాధ్యతలేవైనా నిబద్ధతతో చేస్తుంటారు. రాజకీయాల్లో చేరిన రోజుల నుంచే ఆయనకు ఈ లక్షణం ఉంది. అదే ఆయనను ఇంత ఎత్తుకు ఎదిగేలా చేసింది.

ప్రశ్న : కేవలం ఉత్తర భారత రాష్ట్రానికే పరిమితమైన పార్టీ అన్న ముద్ర భాజపాపై ఉంది. ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

జవాబు : మీరన్నట్లు భాజపాకు ఉత్తరభారత పార్టీ అనే ముద్ర ఉన్న మాట వాస్తవమే. ఈసారి కర్ణాటకలో ఎలాగూ అత్యధిక స్థానాలతో గెలుస్తుందన్న విశ్వాసం ఉంది. మరోవైపు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ ఊహించని స్థాయిలో గెలుపు సాధిస్తాం. దక్షిణ భారత రాష్ట్రాల్లో భాజపాకు ఐదేళ్ల కాలంలో బలమైన పునాది ఏర్పడింది.

ప్రశ్న : మీ నాయకత్వంపైనా సీనియర్లు వ్యతిరేకత చాటుతున్నారు. మీ పార్టీ తక్కువ సీట్లు సాధిస్తే బాధ్యత వహిస్తారా?

జవాబు : అధిష్ఠానం నా పనితీరును, నాయకత్వ లక్షణాలు చూసే నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. నేను యడియూరప్ప కుమారుడిననో.. ఇంకేదో కారణంతో పట్టం కట్టలేదు. గెలుపోటములే కాదు నాయకత్వ బాధ్యత అంతా సమష్టి కృషే. అది యడియూరప్ప నుంచే నేర్చుకున్నా. మాకు అప్పగించిన బాధ్యత సక్రమంగా నెరవేరిస్తే చాలు ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ప్రస్తుతం నా నాయకత్వంపై వ్యతిరేతక అంతగా లేదు. ఒకరిద్దరు విమర్శించినా అది అంతగా పరిగణించాల్సిన అవసరం లేదు.

ప్రశ్న : ఓటమి భయం, కాంగ్రెస్‌ బలం కారణంగానే జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్నారా?

జవాబు : ఒంటరిగా పోటీ చేసినా భాజపాకు నష్టమేమీ ఉండదు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లోనూ గెలవాలన్న లక్ష్యంతో జేడీఎస్‌తో కలిశాం. ఆ పార్టీతో కలిసి పోటీ చేయటం వల్ల ఎన్‌డీఏ గెలుపు ప్రమాణం వందశాతానికి చేరుతుందనేది మా విశ్వాసం. అధిష్ఠానం తీసుకునే నిర్ణయం కేవలం ఓ ఎన్నికలకు మాత్రమే పరిమితం కాదు. అది సుదీర్ఘకాల లక్ష్యాలతో తీసుకున్న నిర్ణయం. మా నిర్ణయం ఎంతో హేతుబద్దమని ఈ ఎన్నికలతో రుజువు అవుతుంది.

ప్రశ్న : మీరు మళ్లీ అధికారంలోనికి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారన్న విమర్శపై ఏమంటారు?

జవాబు : కాంగ్రెస్‌ పార్టీ ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని సవరించిందో ఓసారి పరిశీలించుకోమని చెప్పండి. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను మేము గౌరవించినంతగా కాంగ్రెస్‌ గౌరవించలేదు. వారు రాజకీయాల కోసమే అంబేడ్కర్‌ పేరును వాడుకున్నారు. మేము గౌరవించాం.

ప్రశ్న : చివరిగా.. ఈ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతున్నారు?

జవాబు : మరోసారి మోదీ ప్రధాని కాకుండా ఎవరూ అడ్డుకోలేరు. భాజపా గెలుపు లాంఛనమే. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లోనే కాదు అన్ని స్థానాల్లోనే మేము గెలిచితీరుతాం. ఇందులో ఎవరికీ అనుమానాలు లేవు. భాజపాతో దేశం ఇంకా చాలా కాలం ప్రయాణం చేయాల్సి ఉంది.

ప్రశ్న : కర్ణాటక మినహా.. ఏ ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ భాజపా రెండంకెల సీట్లు సాధించింది లేదు కదా?

జవాబు : మీరు గమనించారో లేదో.. ఈసారి ఉత్తర భారత రాష్ట్రాల కంటే దక్షిణాదిపైనే పార్టీ ఎక్కువగా దృష్టి సారించింది. అక్కడ (ఉత్తర) మాకు గెలుపు లాంఛనమే. అదే స్థాయి సీట్లను దక్షిణాదిలో సాధించాలని పార్టీ ప్రయత్నిస్తోంది. అధిష్ఠానం లక్ష్యం అదే. గతంలో ఎన్నడూ లేనంతగా దక్షిణాదిలో సత్తా చాటుతాం.

ప్రశ్న: ఎన్నికల తర్వాత భాజపా నాయకత్వంలో మార్పులేవైనా సంభవిస్తాయా?

జవాబు : భాజపాలో చెప్పలేం కానీ కాంగ్రెస్‌లో మాత్రం తప్పకుండా మార్పులు చోటు చేసుకోవచ్చు. ఈ ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ నెమ్మదిగా ఉండే అవకాశమే లేదు. ముఖ్యమంత్రి స్థానం ఆయనకు పుట్టుకతో వచ్చిన హక్కుగా ఇప్పటికే చెబుతున్నారు. కాబట్టి కాంగ్రెస్‌లో మార్పులు కచ్చితం.

ప్రశ్న : మోదీ పేరు మినహా.. పార్టీని మరింత వేగంగా రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే మార్గమేదైనా ఉందా?

జవాబు : మోదీ నాయకత్వం, పేరు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాదు. ప్రపంచ దేశాలు సైతం ఆయనను ఓ ప్రపంచ నేతగా గుర్తించాయి. అలాంటి నేత మా పార్టీకి బలంగా ఉండటంతో తప్పేముంది? ఆయన సేవలు అందుబాటులో ఉన్నంత కాలం ఆయనే మాకు బలం. రాష్ట్రంలో నాయకత్వం, నాయకుల కొరత లేదు. వారందరికీ మోదీ స్ఫూర్తి.


ప్రధాని రాకకు సర్వం సిద్ధం

మైదానంలో విజయేంద్ర, సప్తగిరి గౌడ తదితరులు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగానికి స్పందించే ఓటర్లు ఉత్సాహంతో ముందుకు వచ్చి మాకే ఓట్లు వేస్తారని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర ధీమా వ్యక్తం చేశారు. ప్యాలెస్‌ మైదానంలో శనివారం సాయంత్రం నిర్వహించే మోదీ బహిరంగ సభకు రెండు లక్షల మంది హాజరవుతారని తెలిపారు. వీరిలో 15 వేల మందికి ప్రత్యేకంగా పాసులను జారీ చేశామని చెప్పారు. ప్యాలెస్‌ మైదానంలో ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. గాయత్రి విహార్‌ గేటు నంబరు-4 నుంచి కార్యకర్తలు, ప్రజలు లోపలకు రావాలని సూచించారు. మొత్తం 60 వేల మంది కూర్చుని ప్రసంగాన్ని ఆలకించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అన్ని వైపులా ఎల్‌ఈడీ తెరలు, స్పీకర్ల వ్యవస్థను కల్పించామని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభధ్రలకు భంగం కలుగుతోందని ఆరోపించారు. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో ఎనిమిది హత్యలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కరవైందని ఆక్రోశించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో పార్టీ ప్రముఖులు ఎస్‌.హరీశ్‌, సప్తగిరిగౌడ, సీకే రామమూర్తి తదితరులు ఉన్నారు. మైదానం చుట్టుపక్కల మధ్యాహ్నం నుంచే నిషేధాజ్ఞలు జారీలో ఉంటాయి. మైదానం మొత్తాన్ని నో ఫ్లై జోన్‌గా పోలీసులు ప్రకటించారు. డ్రోను, బాణసంచా వినియోగంపై నిషేధం ఉంటుందని తెలిపారు. ప్రధాని పర్యటించే మార్గంలో వాహనాల రాకపోకలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని