logo

రూ.75 లక్షల నగదు చోరీ

నగర పాలికె కార్యాలయం ఆవరణలో ఉన్న కర్ణాటక వన్‌ కేంద్రంలో రూ.75లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు.

Updated : 01 May 2024 06:47 IST

బళ్లారి: నగర పాలికె కార్యాలయం ఆవరణలో ఉన్న కర్ణాటక వన్‌ కేంద్రంలో రూ.75లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాంధీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. గాంధీనగర్‌లో ఉన్న కర్ణాటక వన్‌ ఉప కేంద్రం, పాత మున్సిపాల్టీలోని కేంద్రం, కౌల్‌బజార్‌లోని కేంద్రాల్లో ఏప్రిల్‌ 26 నుంచి 28 వరకు రూ.93,53,795 నగదును వసూలైంది. రెండు రోజులు బ్యాంకు లేక పోవడంతో పాలికె కార్యాలయ ఆవరణలో ఉన్న సేఫ్టీ లాకర్‌లో భద్రపరిచారు. కేంద్ర కార్యాలయం తాళాలు, సేఫ్టీ లాకర్‌ తాళాలను కార్యాలయ సిబ్బంది కె.మహాలింగప్ప వద్ద ఉన్నాయి. గతనెల 29న ఉదయం తాళాలు మహాలింగప్ప నివాసముందు పడి ఉన్నాయి. అనుమానంతో మహాలింగప్ప, కార్యాలయం సమన్వయాధికారి చౌదరి మంజునాథతో కలిసి కార్యాలయానికి వెళ్లి చూడగా నగదు దోచుకుని వెళ్లినట్లు గుర్తించారు. మొత్తం రూ.93.53 లక్షల నగదు ఉండగా, వాటిలో రూ.75లక్షల నగదు మాయంకావడంతో మహాలింగప్పపై  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం యోజన వ్యవస్థాపకులు ఉదయ అర్కసాలి గాంధీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


బంగారం స్వాధీనం

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : లోదుస్తుల్లో బంగారాన్ని దాచి పెట్టుకుని దుబాయ్‌ నుంచి వస్తున్న ఇద్దరు మహిళలను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అదుపులోనికి తీసుకుని రూ.49.52 లక్షల బంగారాన్ని జప్తు చేసుకున్నారు. ఆ సరకును కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. వీరిద్దరూ లోదుస్తుల్లో 717 గ్రాముల బంగారాన్ని దాచి పెట్టుకుని వస్తూ దొరికిపోయారని పోలీసులు తెలిపారు.


వేటకత్తితో భార్య హత్య

చిక్కమగళూరు, న్యూస్‌టుడే : ఆమెకు పద్దెనిమిదేళ్లు నిండకుండానే చరణ్‌ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. అక్కడి నుంచే ఆమె జీవితం కష్టాలపాలైంది. చివరికి బాధిత మేఘ (19) అనుమానాస్పద రీతిలో మరణించింది. ఇళ్లలో దొంగతనాలు, గంజాయి విక్రయాలు, మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవపడే భర్త చరణ్‌ (24) ఆమెకు నిత్యం నరకం చూపించాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆక్రోశించారు. మేఘ బాలికగా ఉన్నప్పుడు నిందితుడు అత్యాచారానికి పాల్పడడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తాము వివాహం చేసుకున్నామని మేఘ చెప్పడంతో.. మరోసారి ఆమె కుటుంబ సభ్యులు చరణ్‌కు ఇచ్చి ఊళ్లోనే పెళ్లి చేశారు. తరికేరి తాలూకా కురకుచ్చి గ్రామంలో భద్రా కాలువ వద్ద భార్యపై వేటకత్తితో దాడి చేసి చరణ్‌ హత్య చేశాడని బంధువులు ఆరోపించారు. దుస్తులు ఉతుక్కునేందుకు వచ్చిన ఆమెపై వెనుక నుంచి వచ్చి నిందితుడు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలోగా మరణించింది. పరారైన నిందితుడి కోసం లక్కవళ్లి ఠాణా పోలీసులు గాలింపు తీవ్రం చేశారు.


నటులకు తాఖీదులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఓ రియాల్టీ షోలో పాల్గొన్న గగన చేసిన వ్యాఖ్యలు మెకానిక్‌ వర్గాన్ని బాధపెట్టిందని సుబ్రహ్మణ్యనగర ఠాణాలో చిక్కనాయననకహళ్లికి చెందిన ఆర్‌ నాగేశ్‌ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా ఉన్న నటులు ప్రేమ, రమేశ్‌, అనుశ్రీలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని నటులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.


న్యాయ నిర్బంధానికి అనుమానిత తీవ్రవాదులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : రాజధాని నగరంలోని బ్రూక్‌ఫీల్డ్‌ రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనలో అనుమానిత తీవ్రవాదులు అబ్దుల్‌ మతీన్‌ తాహా (29), ముసావిర్‌ హుసేన్‌ శజీబ్‌ (30)ను రెండు వారాలు న్యాయ నిర్బంధానికి పంపిస్తూ ఎన్‌ఐఏ న్యాయస్థానం ఆదేశించింది. ఏప్రిల్‌ 13 నుంచి 17 రోజుల పాటు వీరిని జాతీయ దర్యాప్తు దళం అధికారులు విచారణ కొనసాగించారు. కస్టడీ అవధి పూర్తి కావడంతో ప్రత్యేక న్యాయస్థానం ముందు వీరిని హాజరుపరిచారు. అవసరానికి అనుగుణంగా మరోసారి వారిని తమ అదుపులోనికి తీసుకుంటామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.


కాంతేశ్‌ అప్రమత్తం

శివమొగ్గ, న్యూస్‌టుడే : తనకు పరువు నష్టం కలిగించే వీడియోలు, ఫొటోలను ప్రచురించకుండా భాజపా బహిష్కృత నేత- మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప కుమారుడు కాంతేశ్‌ న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్నారు. ఉన్నట్లుండి ఆయన స్టే తెచ్చుకోవడం పలు అనుమానాలను రేకెత్తించింది. కొద్ది రోజులుగా కాంతేశ్‌ వీడియోలు, చిత్రాల పేరిట ఎవరైనా బెదిరిస్తూ ఉండడంతో ఆయన న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకుని ఉంటారన్న ప్రచారం కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని