logo

జిల్లాలో 50 ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు

లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు ఈనెల 7న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌ శాతం పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా 50కిపైగా ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలను ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ నమూనాల్లో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు.

Published : 05 May 2024 04:28 IST

ఓటర్లను ఆకర్షించేందుకు అధికారుల చర్యలు

బళ్లారి :మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఖీ బూత్‌, బళ్లారి : యువ ఓటర్ల కోసం..

బళ్లారి, న్యూస్‌టుడే: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు ఈనెల 7న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌ శాతం పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా 50కిపైగా ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలను ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ నమూనాల్లో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య పండగ ఓటింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. జిల్లాలో సఖీ పోలింగ్‌, యూత్‌, సంప్రదాయక, థీమ్‌ కేంద్రాలను ప్రత్యేక డిజైన్లలో అలంకరించారు. బళ్లారి జిల్లాలోని ఐదు విధానసభ నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు 50 ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు, పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ప్రతి విధానసభ నియోజకవర్గంలో ఐదు సఖీ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ  కేంద్రాల్లో మహిళా అధికారులు, సిబ్బంది ఎన్నికలు విధులు నిర్వహిస్తారు. ఇదే విధంగా ప్రతి విధానసభ నియోజకవర్గంలో ఒకటి ప్రత్యేక పోలింగ్‌ కేంద్రం, యూత్‌ పోలింగ్‌ కేంద్రం, థీమ్‌ ( స్థానిక చరిత్ర, వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబించే) పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సఖీ పోలింగ్‌ కేంద్రాలకు అలంకరణ

మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఏర్పాటు చేసిన సఖీ పోలింగ్‌ కేంద్రాలను పూలమాల తోరణాలు, రంగువల్లులతో విశేషంగా అలంకరించారు. కంప్లి నియోజకవర్గంలో షామియాచంద్‌ ప్రభుత్వ పీయూసీ కళాశాల, ప్రభుత్వ మోడల్‌ ప్రాథమిక, ఉన్నత పాఠశాల,  ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కురుగోడు పట్టణంలోని ప్రభుత్వ ఉర్దూ ప్రాథమిక పాఠశాల, కంప్లి పట్టణంలోని ప్రభుత్వ మోడల్‌ పాఠశాల, సిరుగుప్ప పట్టణంలోని టౌన్‌ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఉద్యాన శాఖ కార్యాలయం, రారావి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, తెక్కలకోటె అంగన్‌వాడీ కేంద్రం, హళేకోటె ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో సఖీ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బళ్లారి గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని బెణకల్లు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, సిరివార ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సంగనకల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కౌల్‌బజార్‌ రేడియోపార్క్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కోటె ప్రదేశలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, బళ్లారి నగరంలోని తాళూరు రహదారిలోని ప్రథమ పాఠశాల, పటేల్‌ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాల, కప్పగల్లు రహదారిలోని శెట్రె గురుశాంతప్ప పదవీ పూర్వ కళాశాల, రాఘవేంద్ర కాలనీలోని నంది డిగ్రీ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. సండూరు నియోజకవర్గంలోని సండూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కృష్ణనగర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రణజిత్‌పుర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కుడతిని ప్రాథమిక పాఠశాల, తోరణగల్లు ప్రభుత్వ మోడల్‌ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో సఖీ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

యువత, దివ్యాంగుల కోసం..

బళ్లారి జిల్లాలో దివ్యాంగుల కోసం ఐదు విధానసభ నియోజకవర్గాల్లో మొత్తం ఐదు విశేష పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి జిల్లాలో ఐదు యువ పోలింగ్‌ కేంద్రాలు, ఐదు సంప్రదాయక పోలింగ్‌ కేంద్రాలు, ఐదు థీమ్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేసవిలో పగటి ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు ఎక్కువగా ఉండటం వల్ల పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు ఎండలో ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్త నీడ, తాగునీరు, మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. మే 7న ప్రతి ఓటరు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్వీప్‌ సమితి నోడల్‌ అధికారి రాహుల్‌ శరణప్ప సంకనూర తెలిపారు.


కొప్పళలో పోలింగ్‌కు సర్వం సిద్ధం

కొప్పళలో విలేకరులతో మాట్లాడుతున్న పాలనాధికారి నళిన్‌ అతుల్‌

గంగావతి,న్యూస్‌టుడే: కొప్పళలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా పాలనాధికారి నళిన్‌ అతుల్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన ఏర్పాట్లను విలేకరులకు వివరించారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం 9,19,499 మంది పురుషులు, 9,46,763 మంది మహిళలు మొత్తం 18,66,397 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పారు. ఎన్నికల సంఘం సూచనల మేర 2045 పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు. ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో మస్టరింగ్‌, డీమస్టరింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 2,435 మంది పీఆర్‌వోలు, 2,435 పీఆర్‌వోలు, 4,869 పీవోలు, 248 మంది ఎంవోలను నియమించినట్లు చెప్పారు. ఈ నెల 6న సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్తారన్నారు. 4,990 బ్యాలెట్ యూనిట్లు, 2,657 కంట్రోల్‌ యూనిట్లు, 2,755 వీవీప్యాట్లు సమకూర్చినట్లు తెలిపారు. 271 ఆర్టీసీ బస్పులు, 115 క్రూసర్లు, 86 మినీ బస్సులు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 76 కేంద్రాలకు సాయుధ బలగాలు, 248 చోట్ల మైక్రో అబ్జర్వర్లు, 1024 చోట్ల వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. 6 నుంచి 8దాకా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. ఎన్నికల నియమావళి సమయంలో రూ.1,02,42,500లను జప్తు చేశామన్నారు. ఆబ్కారీ శాఖ రూ.2,44,91,000 విలువైన 60,742 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుందన్నారు. ఈవీఎంలను కొప్పళ గవిసిద్ధేశ్వర కళాశాలలో భద్రపరుస్తారన్నారు. ఇక్కడే ఓట్లు లెక్కిస్తామన్నారు. సమావేశంలో ఎస్పీ యశోధా ఒంటిగోడి, జడ్పీ సీఈవో రాహుల్‌రత్నం పాండే పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని