logo

అందరిలోనూ ప్రజ్వల్‌ దడ

విదేశాలకు వెళ్లిన ప్రజ్వల్‌ రేవణ్ణ వ్యవహారం హాసన జిల్లాలో అన్ని వర్గాల్లోనూ భయం నెలకొన్న వేళ.. ఈ కేసులో విచారణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్‌) అధికారులను ఆదేశించారు.

Updated : 05 May 2024 07:49 IST

ప్రజ్వల్‌ ఆచూకీ లభించేనా?

ఈనాడు, బెంగళూరు : విదేశాలకు వెళ్లిన ప్రజ్వల్‌ రేవణ్ణ వ్యవహారం హాసన జిల్లాలో అన్ని వర్గాల్లోనూ భయం నెలకొన్న వేళ.. ఈ కేసులో విచారణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్‌) అధికారులను ఆదేశించారు. ఆయన పోలీసు ఉన్నతాధికారులతో శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీజీపీ అలోక్‌కుమార్‌, సిట్‌ అధికారి బీకే సింగ్‌ తదితరులతో చర్చించారు. ఇప్పటికే జారీ చేసిన నోటీసులకు ప్రజ్వల్‌ స్పందించకుంటే బ్లూకార్నర్‌ నోటీసులను జారీ చేసి తక్షణమే అతనిని బంధించాలని స్పష్టం చేశారు. మహిళలకు న్యాయం జరగాలంటే తక్షణమే నిందితుడిని బంధించాల్సి ఉందన్నారు. ఈ కేసులో అలసత్వం సరికాదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే సిట్‌ అధికారులు హాసన జిల్లా హొళెనర్సీపురలోని పలు ప్రాంతాల్లో ప్రజ్వల్‌కు చెందిన అతిథిగృహాలు, వ్యవసాయ క్షేత్రాల్లో తనిఖీలు చేపట్టారు. కీలక ఆధారాల సేకరణ దిశగా అడుగు ముందుకేశారు.

రాహుల్‌ లేఖ

ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన కేసుపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ స్పందించారు. ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. శనివారం రాసిన ఈ లేఖలో.. ప్రజ్వల్‌కు సంబంధించిన అశ్లీల వీడియోల అంశంపై భాజపా సభ్యులు గతేడాది డిసెంబరులోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు సమాచారం ఇచ్చారని గుర్తుచేశారు. ఆయనకు టికెట్‌ ఇవ్వకూడదని అమిత్‌షాతో పాటు భాజపా అగ్రనేతలకు విన్నవించారని ప్రస్తావించారు. వీరంతా ఆ నేత మనవిని తోసిపుచ్చి ప్రజ్వల్‌కు టికెట్‌ ఇచ్చారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రచారాన్ని చేయించారని తప్పుపట్టారు. ఇంతటి ‘మాస్‌ రేపిస్ట్‌’కు ఓ దేశ ప్రధాని మద్దతివ్వటం ఎక్కడా చూడలేదని నిప్పులు చెరిగారు. నా రెండు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఓ సీనియర్‌ రాజకీయ నేత మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై మౌనంగా ఉండటం, హరియాణ, మణిపూర్‌లోనూ బాధితుల విషయంలో ఉదాసీనత చూపడం వహించటం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున బాధిత మహిళలకు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత గుర్తించాలని సూచించారు. వారి మనుగడకు ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎంను కోరారు. రాష్ట్ర సర్కారు ఇప్పటికే సిట్‌ ఏర్పాటు చేసి విచారణ చేపడుతోందని, కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రజ్వల్‌కు జారీ చేసిన దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ కేసులో మనమంతా కలిసికట్టుగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.

దేవేగౌడకు అస్వస్థత

మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవేగౌడ అస్వస్థతకు గురయ్యారు. కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆయన మరో కుమారుడు- మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు. ఈ సమయంలో మా తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. ఈ కేసులో మా తండ్రి, నా పేర్లను ఎందుకు తెరపైకి తెస్తున్నారని ఆయన ప్రశ్నించారు. డాక్టర్‌ మంజునాథ్‌, మరికొందరు వైద్యులు దేవేగౌడకు వైద్యసేవలు అందించి.. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. టీవీ చూడకూడదని, ఇతరులతో కలిసి చర్చించకుండా ప్రశాంతంగా ఉండాలని కోరారు.


ప్రజ్వల్‌ రేవణ్ణ నేరప్రవృతిని ఖండిస్తూ.. బాధిత మహిళలకు సంఘీభావంగా వివిధ మహిళా సంఘాలు,
ఆప్‌ కార్యకర్తలు బెంగళూరు ఫ్రీడంపార్కులో శనివారం నిర్వహించిన ప్రదర్శన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని