logo

జనతాదళంలో నిర్వేద పర్వం

కీలక నేత హెచ్‌.డి.రేవణ్ణ అరెస్టుతో జనతాదళ్‌(ఎస్‌) శ్రేణుల్లో నిస్తేజం ఆవహించింది. ఓ వైపు అగ్రనేత హెచ్‌.డి.దేవేగౌడను అనారోగ్యం వెన్నాడుతోంది.

Published : 06 May 2024 05:31 IST

ప్రజ్వల్‌ను అరెస్టు చేయాలంటూ బెంగళూరులో ప్రదర్శనకు దిగిన యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : కీలక నేత హెచ్‌.డి.రేవణ్ణ అరెస్టుతో జనతాదళ్‌(ఎస్‌) శ్రేణుల్లో నిస్తేజం ఆవహించింది. ఓ వైపు అగ్రనేత హెచ్‌.డి.దేవేగౌడను అనారోగ్యం వెన్నాడుతోంది. ‘హాసన సెక్స్‌ కుంభకోణం’లో పార్టీకున్న ఒకే ఒకే లోక్‌సభ సభ్యుడు ప్రజ్వల్‌ రేవణ్ణ అరెస్టు ఎంతో దూరం లేదన్న చేదు నిజం జీర్ణించుకోలని పరిస్థితి. తోడుగా ఉంటుందని భావిస్తున్న ఎన్‌డీఏ అగ్రపార్టీ భాజపా నేతలూ అంటీముట్టనట్లు స్పందించడం దళపతులకు జీర్ణించుకోలేని అంశం.

ఇక భవానీ వంతు?

బెంగళూరు (సదాశివనగర): ఒక గృహిణిని అపహరించిన ఆరోపణలపై ఆమె కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ భార్య భవానీని విచారణకు పిలుస్తామని ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అధికారులు తెలిపారు. మైసూరు కేఆర్‌ ఠాణాలో ఇప్పటికే నమోదైన కేసులో ఆమెపై అభియోగం దాఖలైంది. అపహరణకు గురైన గృహిణిని పోలీసులు శనివారం రక్షించి ఇంటికి చేర్చారు. అపహరించిన ఆరోపణలపై భవానీ రేవణ్ణ బంధువు సతీశ్‌బాబును అరెస్టు చేశారు. అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరచగా, రెండు వారాలు న్యాయ నిర్బంధానికి పంపిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. బాధితురాలు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా భవానీని విచారణకు పిలిచే అవకాశం ఉంది.

యువజన కాంగ్రెస్‌ నిరసన

బెంగళూరు (యశ్వంతపుర): హాసన జిల్లాలో మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (జనతాదళ్‌-ఎస్‌)ను తక్షణం అరెస్టు చేయాలని యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆదివారం సాయంత్రం బెంగళూరు చర్చి వీధిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. బాధిత మహిళలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండు చేశారు. విదేశాల్లో దాగున్న ఆ నాయకుడిని తక్షణం అరెస్టు చేసి తీసుకురావాలని యువజన కాంగ్రెస్‌ రాష్ట్రాధ్యక్షుడు మహ్మద్‌ నలపాడ్‌ డిమాండు చేశారు. జాప్యం చేస్తే బాధితులకు రక్షణ కరవవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను పోలీసులు బంధించి, అశోక్‌నగర పోలీసుఠాణాకు తరలించారు.

పొత్తు కొనసాగుతుంది..

శివమొగ్గ: హాసనలో ప్రజ్వల్‌, రేవణ్ణలపై లైంగిక దౌర్జన్యాల కేసులు నమోదు కావడంతో తమ పొత్తుకు వచ్చిన సమస్య ఏమీ లేదని మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప పేర్కొన్నారు. అప్ప శివమొగ్గలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజ్వల్‌పై నమోదైన కేసులతో రెండో దశలో పోటీలో ఉన్న తమ అభ్యర్థులపై ఎటువంటి ప్రభావం పడదన్నారు. తమ కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలతో మాజీ ప్రధాని దేవేగౌడ అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఎన్నికలు, కుటుంబ సమస్యలను పక్కన పెట్టుకుని, విశ్రాంతి తీసుకోవాలని సూచించానని చెప్పారు.

సిట్‌ పనితీరు భేష్‌

బెంగళూరు (సదాశివనగర): అమాయక మహిళలు, ఉద్యోగినులపై లైంగిక దౌర్జన్యాలు, బాధితులను అపహరించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, ఎంపీ ప్రజ్వల్‌ విచారణను సిట్ సమర్థవంతంగా నిర్వహిస్తోందని హోం మంత్రి డాక్టర్‌ పరమేశ్వర్‌ వెల్లడించారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, జాప్యం చేయకుండా ప్రత్యేక దర్యాప్తు దళాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని