logo

ప్రజ్వల్‌ కేసులో కుట్ర కోణం?

కేఆర్‌నగర ఎమ్మెల్యే డాక్టర్‌ రవిశంకర్‌ చేసిన ఆరోపణలతోనే తమ నాయకుడు హెచ్‌డీ రేవణ్ణను సిట్ అరెస్టు చేసిందని జనతాదళ్‌ హాసన జిల్లా శాఖ అధ్యక్షుడు లింగేశ్‌ ఆరోపించారు.

Published : 07 May 2024 03:36 IST

ప్రజ్వల్‌ను అరెస్టు చేయాలంటూ స్వతంత్ర ఉద్యానవనంలో ధర్నా
హాసన, న్యూస్‌టుడే : కేఆర్‌నగర ఎమ్మెల్యే డాక్టర్‌ రవిశంకర్‌ చేసిన ఆరోపణలతోనే తమ నాయకుడు హెచ్‌డీ రేవణ్ణను సిట్ అరెస్టు చేసిందని జనతాదళ్‌ హాసన జిల్లా శాఖ అధ్యక్షుడు లింగేశ్‌ ఆరోపించారు. ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన రోజునే ఉద్దేశపూర్వకంగా రేవణ్ణపై కేసు పెట్టించారని ఆక్రోశించారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ జనతాదళ్‌కు చెడ్డపేరు తీసుకువచ్చేందుకు తెరవెనుక కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆరోపించారు. తనను ఎవరూ అపహరించలేదని బాధిత మహిళ చెప్పినా.. రేవణ్ణను అరెస్టు చేయడం దురదృష్టకరమని వాపోయారు. సమావేశంలో శ్రవణబెళగొళ ఎమ్మెల్యే సీఎన్‌ బాలకృష్ణ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సమాజానికే తలవంపులు

 బెంగళూరు (యశ్వంతపుర): మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను తక్షణం అరెస్ట్‌ చేయాలని వివిధ సంఘాల కార్యకర్తలు సోమవారం ఇక్కడ స్వతంత్ర ఉద్యానవనంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మూల నివాసి మహా ఐక్యవేదిక సంచాలకుడు హెబ్బాళ్‌ వెంకటేశ్‌ మాట్లాడుతూ ప్రజ్వల్‌ రేవణ్ణ విదేశాలకు పరారయ్యేందుకు పాలకులే కారణమని ఆరోపించారు. ఇంటర్‌పోల్‌ సాయంతో అరెస్టు చేసి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. బాధిత మహిళలపై ఒత్తిడి తెస్తున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమాజం తలదించుకునే చర్యలకు పాల్పడిన నేత కేసు విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

 న్యాయవాది అసహనం..

బెంగళూరు (మల్లేశ్వరం): హెచ్‌డీ రేవణ్ణ నివాసంలో మహజరు ప్రక్రియను వీక్షించేందుకు తమకు సిట్ అవకాశం ఇవ్వలేదని ఆయన తరఫు న్యాయవాది గోపాల్‌ ఆరోపించారు. హొళెనరసీపురలోని నివాసంలో మహజరుకు హాజరయ్యానని, బెంగళూరు బసవనగుడిలో అవకాశం ఇవ్వలేదన్నారు. భవానీ రేవణ్ణ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆమె తరఫున తాను వచ్చానని చెప్పినా, సిట్ అధికారులు రానివ్వలేదన్నారు.

జామీను కోసం..

బెంగళూరు (శివాజీనగర): ఒక మహిళను అపహరించిన ఆరోపణలపై అరెస్టయిన మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ తనకు జామీను మంజూరు చేయాలని కోరుతూ సిటీ సివిల్‌ కోర్టులో అర్జీ వేసుకున్నారు. ఇప్పటికే తాను విచారణకు హాజరయ్యానని, పిలిచిన సమయంలో మరోసారి సిట్ ముందు హాజరవుతానని, జామీను ఇవ్వాలని అర్జీలో కోరారు.

సిట్ కష్టడీకి సతీశ్‌..

బెంగళూరు (శివాజీనగర): కేఆర్‌ నగరకు చెందిన ఒక మహిళను అపహరించి, ఫారంహౌస్‌లో బంధించిన ఆరోపణలపై అరెస్టయిన సతీశ్‌ బాబణ్ణను న్యాయమూర్తి రవీంద్ర కుమార్‌ కట్టిమని ముందు సిట్ అధికారులు హాజరుపరిచారు. ఎనిమిది రోజులు అతన్ని సిట్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని