logo

మలివిడతకు ఎండపోటు

కన్నడనాట ఎన్నికల ఘట్టాన్ని సూర్యదేవుడు వెంటాడాడు. తొలి విడతను మించి.. గ్రామీణ ప్రాంతాలున్న ఉత్తర కర్ణాటకలో- మలివిడతలో ఎక్కువ శాతం పోలింగ్‌ నమోదవుతుందనుకుంటే ఏమంత ఆశాజనకంగా లేకపోవడం ప్రస్తావనార్హం.

Published : 08 May 2024 03:07 IST

మందకొడిగా కదలిన ఓటరు
70.03 శాతం పోలింగ్‌ నమోదు

కుటుంబ సభ్యులతో కలిసి సిరా గుర్తు చూపిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, హావేరి- గదగ లోక్‌సభ భాజపా అభ్యర్థి బసవరాజ బొమ్మై

బెంగళూరు, ఈనాడు : కన్నడనాట ఎన్నికల ఘట్టాన్ని సూర్యదేవుడు వెంటాడాడు. తొలి విడతను మించి.. గ్రామీణ ప్రాంతాలున్న ఉత్తర కర్ణాటకలో- మలివిడతలో ఎక్కువ శాతం పోలింగ్‌ నమోదవుతుందనుకుంటే ఏమంత ఆశాజనకంగా లేకపోవడం ప్రస్తావనార్హం. కడపటి వార్తలందేసరికి ఎన్నికలు నిర్వహించిన 14 నియోజకవర్గాల్లో పొద్దుపోయాక పోలైన ఓట్లను కలుపుకొంటే 70.03 శాతానికి చేరుకున్నట్లు అధికారులు లెక్కగట్టారు.

శికారిపురలో తండ్రి యడియూరప్ప, సోదరుడు బీవై విజయేంద్ర, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సిరా గుర్తు చూపిస్తున్న శివమొగ్గ భాజపా అభ్యర్థి బీవై రాఘవేంద్ర

రాష్ట్ర వ్యాప్తంగా 28 లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల సరళిని ఓసారి విశ్లేషిస్తే గరిష్ఠ ఓటింగ్‌ మండ్యలోనే నమోదైంది. తొలి విడత ఎన్నిక జరిగిన మండ్యలో 81.48 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండో విడతలో ఆ ఘనత చిక్కోడి దక్కించుకుంది. మహారాష్ట్ర సరిహద్దులోని ఈ పరిధిలో 76.47 శాతం ఓట్లు పోలయ్యాయి. తొలి విడత తక్కువ పోలైన నియోజకవర్గంగా బెంగళూరు సెంట్రల్‌ (52.81 శాతం), రెండో విడతలో కలబురగి (61.73 శాతం) ఆ స్థానం దక్కించుకోవడం గమనార్హం.

హుబ్బళ్లి చిన్మయ విద్యాలయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

గతనెల 26న తొలివిడత 14 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, మంగళవారం చివరి విడతలో మరో 14స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఓ వైపు వర్షాలు, మరోవైపు ఎండలు మండుతున్నా ఓటర్లు పోలింగ్‌ స్టేషన్లకు ఒక్కొక్కరుగా తరలి వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఏడు గంటలకు అందిన సమాచారం ప్రకారం ఈ మలివిడత 14 స్థానాల్లో 70.03 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఇద్దరూ మహిళలు పోటీ చేసిన దావణగెరెతో పాటు చిక్కోడిలో చివరి సమాచారం ప్రకారం అత్యధిక పోలింగ్‌ నమోదు కాగా జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు పోటీ చేసిన కలబురగిలో అత్యల్ప పోలింగ్‌ నమోదైంది. ఆ తరువాతి స్థానం రాయచూరుకు దక్కింది. చివరి అంచనా ప్రకారం చిక్కోడిలో 76.47 శాతం పోలింగ్‌ నమోదు కాగా కలబురగిలో 61.73 శాతం నమోదయ్యింది.

ధార్వాడలో ఓటేసిన బెళగావి భాజపా అభ్యర్థి,  మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌

శాంతించిన సమరం

రెండు విడతల ఎన్నికల కోసం రాష్ట్రంలో 28 స్థానాల్లో ఎన్నికల హడావుడి మంగళవారం ముగిసింది. 48 రోజుల పాటు ఏకబిగిన నిర్వహించిన ఎన్నికల ప్రచారం. గత రెండు నెలలుగా రాష్ట్రంలో కనీసం 35 నుంచి గరిష్ఠంగా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనా జాతీయ, రాష్ట్ర నేతలు ఎండలను సైతం లెక్కించకుండా ప్రచారంలో పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా కల్యాణ కర్ణాటకలోని యాదగిరి, రాయచూరు, బళ్లారి, కొప్పళ జిల్లాల్లో గత నెల రోజులుగా 40 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్నికలకు రెండు రోజుల ముందుగానే అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. ఈ ఎండలను కూడా లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్‌ స్టేషన్ల వద్దకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నా.. అది అనుకున్న అధిక స్థాయిలో సాధ్యం కాలేదు. రాత్రి 11 గంటలకు వెల్లడించిన సమాచారం ప్రకారం చిక్కోడిలో అత్యధికంగా 76.47 శాతం, కలబురగిలో అత్యల్పంగా 61.73 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తేలింది.

ఓటు హక్కు వినియోగించుకుని సిరా గుర్తు చూపిస్తున్న బసవజయ మృత్యుంజయ స్వామి (బాగలకోటె), బసవ ప్రభు స్వామి (దావణగెరె), డాక్టర్‌ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య (బెళగావి)

నేతల పరుగులు..

ఈ ఎన్నికల్లో ఊపిరి సలపకుండా శ్రమించిన భాజపా, కాంగ్రెస్‌ నేతలు ఈనెల 13న నిర్వహించే నాలుగో విడత ఎన్నికల కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లకు తరలి వెళ్లనున్నారు. ఇందు కోసం కాంగ్రెస్‌ నుంచి డీకే శివకుమార్‌ బృందం, భాజపా నుంచి బి.వై.విజయేంద్ర బృందం గురువారం నుంచి ఆయా రాష్ట్రాలకు ప్రచారం కోసం వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప తదితరులు ప్రచారానికి వెళ్తారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ఎన్నికల్లో కనీసం 15-20 స్థానాలను గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు.

ఖానాపురలో భాజపా పోలింగ్‌ ఏజెంట్లు కాషాయ కండువా, బ్యాడ్జ్‌లు ఉపయోగిస్తున్నారని అధికారికి ఫిర్యాదు చేస్తున్న అంజలి నింబాళ్కర్‌


ఓటు వేయలేని సుక్రిగౌడ

కార్వార, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయానని పద్మశ్రీ పురస్కార గ్రహీత సుక్రిగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం తిరగబెట్టడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరడంతో మొదటిసారి ఓటు వేయలేకపోయానని వాపోయారు. ఇంటి వద్ద ఓటు వేసేందుకు పేరు నమోదు చేయించుకున్న తర్వాత ఆసుపత్రిలో చేరడంతో ఆ అవకాశం కోల్పోయానని, ఆ తర్వాత నేరుగా బూత్‌కు వచ్చే అవకాశం రద్దయిందని ఆమె ఆక్రోశించారు.


మాదే విజయం: ఖర్గే

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : కలబురగిలోని బసవనగర కన్నడ ప్రాథమిక పాఠశాలలోని బూత్‌లో తన భార్య రాధాబాయితో కలిసి వచ్చిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ బూత్‌ వద్దకు వచ్చిన ఖర్గేకు మద్దతుగా స్థానికులు నినాదాలు చేశారు. తమ అభ్యర్థులు ఎక్కువ మంది కర్ణాటకలో విజయం సాధిస్తారని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. తమకు మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆరోపిస్తూ ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజవకర్గంలోని ముండగోడు తాలూకా బసాపుర గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. తమ గ్రామంలో 300కు పైగా ఓట్లు ఉన్నా పోలింగ్‌ బూత్‌ లేకపోవడంతో మూడు కిమీ నడుచుకుని వెళ్లి నందికట్టె గ్రామంలో ఓటు వేయాల్సి వస్తుందని ఆ గ్రామస్థులు ఆరోపించారు. మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ఈసారి ఎన్నికల్లో మీ గ్రామంలోనే బూత్‌ను ఏర్పాటు చేస్తామని తహసీత్దారు శంకర గౌడి భరోసా ఇవ్వడంతో గ్రామస్థులు అందరూ కలిసి నడుచుకుని వచ్చి సాయంత్రం ఓటు హక్కు వినియోగించుకున్నారు. హావేరిలోని బసవేశ్వరనగరకు చెందిన భావనా శివానంద్‌ గత కొద్ది నెలలుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఓటు వేసేందుకు ఆమె సిడ్నీ నుంచి వచ్చి.. సంతోషం వ్యక్తం చేశారు. కార్వారకు చెందిన సుజాత గావ్కర్‌ అనే గృహిణి ఇలానే బ్రిటన్‌ నుంచి వచ్చారు. గంగావతిలోనూ యువ దంపతులు శరణప్ప, ఐశ్వర్య ఓటు హక్కు వినియోగించుకునేందుకు దుబాయ్‌ నుంచి వచ్చారు. దావణగెరెలో బకేశ్వర పాఠశాల ఆవరణలోని ఒకే బూత్‌లో ఒకే కుటుంబానికి చెందిన 38 మంది ఓటు హక్కు వినియోగించుకున్రాను. కె.ఏకాంతప్ప, ఆయన సోదరుడు చంద్రణ్ణ కుటుంబలో 38 మందికి ఓటు హక్కు ఉంది. అందరూ వచ్చి వరుసలో నిలబడి ఓటు వేశారు.


రిషబ్‌శెట్టి జోష్‌

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : ఉడుపి జిల్లా బైందూరు తాలూకా కెరాడి ప్రభుత్వ పాఠశాలలో నటుడు రిషబ్‌శెట్టి (కాంతారా ఫేం) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెల్లని దుస్తులు ధరించి ఆయన పోలింగ్‌ బూత్‌కు వచ్చారు. విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లిలో మరియమ్మనహళ్లిలో తృతీయ లింగ ప్రముఖులు, కళాకారిణి మంజమ్మ జోగతి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దావణగెరె : వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు

బళ్లారిలోని ఓ పోలింగ్‌ బూత్‌ ముంగిట మహిళల వరుస

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు