logo

సిట్‌ నిరుపయోగం: కుమార

అశ్లీల వీడియోల పెన్‌డ్రైవ్‌ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) ఒక్క అడుగూ ముందుకు వేయలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆక్రోశించారు.

Published : 10 May 2024 02:02 IST

రాజభవన్‌లో గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌కు గురువారం ఫిర్యాదుపత్రాన్ని అందిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.
చిత్రంలో మాజీ మంత్రులు జీటీ దేవేగౌడ, సా.రా.మహేశ్‌ తదితరులు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : అశ్లీల వీడియోల పెన్‌డ్రైవ్‌ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) ఒక్క అడుగూ ముందుకు వేయలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆక్రోశించారు. ఈ కేసులో తప్పు చేసిన వారికి శిక్ష పడాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని, జనతాదళ్‌కు మరక అంటించాలనేదే కుట్రగా కనిపిస్తోందని ఆరోపించారు. బెంగళూరులోని దళ్‌ కార్యాలయంలో గురువారం కోర్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌కు సిట్, ప్రభుత్వ పనితీరుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సిట్‌ రక్షించినట్లు చెబుతున్న బాధితురాలిని ఇప్పటి వరకు న్యాయమూర్తి ముందు ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించారు. హెచ్‌డీ రేవణ్ణను కారాగారంలో ఉంచాలని మాత్రమే ప్రభుత్వం కోరుకుంటోందని దుయ్యబట్టారు. ఒక ఫాంహౌస్‌ నుంచి రక్షించిన బాధితురాలిని ప్రభుత్వ గెస్ట్‌ గౌస్‌లో ఉంచి, రేవణ్ణ, ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం అందిందని వివరించారు. కొందరు మంత్రులు నన్నే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని తప్పుబట్టారు. సీబీఐకి.. లేదా సిట్టింగ్‌ జడ్జ్‌కు బాధ్యతలు అప్పగిస్తే దర్యాప్తు చురుకుగా కొనసాగుతుందని కుమార అభిప్రాయపడ్డారు.

  • దర్యాప్తు చురుకుగా కొనసాగుతున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హోం మంత్రి పరమేశ్వర్‌ హాసనలో వ్యాఖ్యానించారు. తాజా ఘటనలో భాజపా, దళ్‌ పొత్తుకు వచ్చిన ముప్పు ఏమీ లేదని మాజీ మంత్రి జీటీ దేవేగౌడ ధీమా వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలోనే దర్యాప్తు కొనసాగుతోందని ఆరోపించారు. ప్రజ్వల్‌ కోసం బ్లూకార్నర్‌ నోటీసులు జారీ చేసి 194 దేశాల్లో ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదు అంటూ, ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

‘కుమార బెదిరింపు ధోరణి’

బెంగళూరు (యశ్వంతపుర): హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దౌర్జన్య సంఘటనలకు సంబంధించి బాధితులను బెదిరించడం, దర్యాప్తును దారి తప్పించే విధంగా ప్రకటనలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండు చేశారు. కేపీసీసీ ప్రధాన కార్యదర్శి మనోహర్‌ నేతృత్వంలో ఆపార్టీ ప్రతినిధులు గురువారం సీఓడీ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. లైంగిక దౌర్జన్యాలకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌ తన వద్ద ఉన్నట్లు భాజపా నేత దేవరాజేగౌడ ప్రకటించారని, వాస్తవాలను పక్కన పెట్టి అవాస్తవాలను మాజీ ముఖ్యమంత్రి ప్రచారం చేస్తూ కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. బాధితులను పరోక్షంగా బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆయన చేసే ప్రకటనలు వల్ల బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్‌)పై అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు నిందితులను రక్షించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని