logo

ముంపు గాయానికి మందు

రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో లోతట్టు ప్రదేశాలను ముంపు నుంచి సంరక్షించేందుకు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె చేపట్టే పథకాలకు ప్రపంచ బ్యాంకు రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేయడానికి ముందుకొచ్చింది.

Published : 10 May 2024 02:04 IST

ప్రపంచ బ్యాంకు సాయం

వానొచ్చిన ప్రతిసారీ జనావాసాలను ముంచేస్తున్న రాజకాలువ

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో లోతట్టు ప్రదేశాలను ముంపు నుంచి సంరక్షించేందుకు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె చేపట్టే పథకాలకు ప్రపంచ బ్యాంకు రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేయడానికి ముందుకొచ్చింది. ఏడాది కిందట రుణం కోసం పాలికె చేసిన ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల శాఖ అనుమతించింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో పాలికె ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. ఒప్పందంపై సంతకాలు చేసిన తరువాత నిధులు విడుదల చేస్తారు. అందులో రూ.2 వేల కోట్లు పాలికె, రూ.వెయ్యి కోట్లు బెంగళూరు జలమండలికి అందిస్తారు. ప్రపంచ బ్యాంకు రుణంతో నగరంలోని చిన్నవానకు ముంపునకు గురవుతున్న ప్రదేశాల్లోని 173 కిలోమీటర్ల రాజకాలువలకు ఇరువైపులా ముంపు నియంత్రణ గోడలు నిర్మిస్తారు. కోరమంగల రాజకాలువలో ప్రవహించే నీటిని దక్షిణ పినాకిని నదికి మళ్లిస్తారు. ఈ పథకాల బ్లూప్రింట్‌ ఇప్పటికే సిద్ధం చేశారు. పనులన్నీ కొలిక్కివస్తే నగర వలయ వర్తుల రహదారి (అవుటర్‌ రింగ్‌ రోడ్డు)లోని ఐటీ, బీటీ ప్రదేశాలను ముంపు నుంచి తప్పించవచ్చు. రెండేళ్ల కిందట ఆ ప్రదేశాలు వాననీటి ముంపులో ఉండిపోయాయి. అప్పటి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో వాననీటి ముంపు నియంత్రణ చర్యలు చేపడతామని ప్రకటించింది. ఇప్పుడు కార్యక్రమం దాల్చనుంది. పాలికె తొలిసారిగా ప్రపంచ బ్యాంకు నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించుకోనుంది. బెంగళూరు జలమండలి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నిధులతో కావేరి నీరు సరఫరా పనులు చేపట్టిన విషయం తెల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని