logo

మూలకణ మార్పిడిలో అద్భుతం

భారతదేశం- జర్మనీ దేశాల వాతావరణం, రెండు దేశాల ప్రజల జన్యు నిర్మాణాలకు అంతులేని వ్యత్యాసం ఉంటుంది. సృష్టిలో మానవులంతా ఒక్కటే అంటూ నిరూపించింది ఓ మూలకణ మార్పిడి సంఘటన.

Published : 10 May 2024 02:12 IST

థలసీమియా బాధితుడికి జర్మన్‌ యువకుడి సాయం

స్వీకర్త చిరాగ్‌తో దాత రోమన్‌

ఈనాడు, బెంగళూరు : భారతదేశం- జర్మనీ దేశాల వాతావరణం, రెండు దేశాల ప్రజల జన్యు నిర్మాణాలకు అంతులేని వ్యత్యాసం ఉంటుంది. సృష్టిలో మానవులంతా ఒక్కటే అంటూ నిరూపించింది ఓ మూలకణ మార్పిడి సంఘటన. బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల బాలుడు చిరాగ్‌ పుట్టుకతోనే థలసీమియా (రక్తహీనత) బాధితుడు. వయసు పెరిగే కొద్దీ అతని శరీరం పట్టుతప్పుతూ చదువులు, క్రీడల కంటే ఆస్పత్రుల వెంటే తిరిగేవాడు. వైద్యులు మూలకణ మార్పిడితోనే అతని సమస్యకు పరిష్కారమని తేల్చారు. దేశంలో మూలకణ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న థలసీమియా రోగులు లక్షల్లో ఉంటే వారికి తగిన మూలకణం కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే అందుబాటులో ఉంటుందని చిరాగ్‌ తల్లిదండ్రులకు నారాయణ ఆస్పత్రి చిన్నపిల్లల వైద్య విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ భట్‌ వివరించారు. ఆయన మాటలు విన్నాక.. ఆశలు లేకున్నా చివరి ప్రయత్నంగా అంతర్జాతీయ స్థాయిలో మూలకణ మార్పిడి చికిత్సలపై అవగాహన కల్పించే బెంగళూరు మెడికల్‌ సర్వీసెస్‌ ట్రస్ట్‌ (బీఎంఎస్‌టీ) స్వచ్ఛంద సంస్థలో పేరు నమోదు చేసుకున్నారు. అదృష్ట వశాత్తు చిరాగ్‌ మూలకణానికి సరిపడేలా జర్మనీ దేశానికి చెందిన 29 ఏళ్ల ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు రోమన్‌ సిమ్నిజ్కి మూలకణం దొరికింది. అలా 2016లో చిరాగ్‌కు మూలకణ మార్పిడి చికిత్స చేశారు. గురువారం ప్రపంచ థలసీమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎంఎస్‌టీ సంస్థ మూలకణ దాత, స్వీకర్తలను ఒకే వేదికపై పరిచయం చేసింది. తనకు రోమన్‌ కేవలం దాతగా కాకుండా ఓ దేవుడిలా కనిపించాడని చిరాగ్‌ భావోద్వేగంతో చెప్పాడు. ఇలాంటి చికిత్సలకు విదేశాల్లో రూ.3 కోట్ల వ్యయం కానుండగా భారత్‌లో పీఎం కేర్స్‌, సీఎం ఫండ్స్‌, ఇతర సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా బాధితులకు రూ.లక్షల వ్యయంతోనే చికిత్స నిర్వహించే వీలుందని బీఎంఎస్‌టీ దాతల నిర్వహణ విభాగాధిపతి నితిన్‌ అగర్వాల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని