logo

కారాగారంలో కునుకే కరవాయె

కిడ్నాప్‌ కేసులో అరెస్టై.. పరప్పన అగ్రహార కారాగారంలో ప్రత్యేక బ్యారక్‌లో ఉన్న మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణకు 4567 నంబరును కేటాయించారు.

Published : 10 May 2024 02:14 IST

హెచ్‌డీ రేవణ్ణ

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : కిడ్నాప్‌ కేసులో అరెస్టై.. పరప్పన అగ్రహార కారాగారంలో ప్రత్యేక బ్యారక్‌లో ఉన్న మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణకు 4567 నంబరును కేటాయించారు. మానసిక వ్యధతో ఆయన బుధవారం రాత్రి నిద్రకు దూరమయ్యారు. బుధవారం రాత్రి ఆయనకు చపాతి, వేపుడు, రాగి సంగటి, అన్నం, సాంబారు ఇచ్చారు. భోజనం ఇచ్చినా.. అర్ధరాత్రి వరకు కంచాన్ని దగ్గరకు తీసుకోలేదని సంబంధిత వర్గాల నుంచి అందిన సమాచారం. నీరు తాగుతూ గడిపిన ఆయన అర్ధరాత్రి అనంతరం కొంత రాగిసంకటి, చపాతి, సాంబారు అన్నం తిన్నారు. ఇంటి నుంచి వచ్చిన దుస్తులు తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా లేకపోవడంతో బ్యారెక్‌ వద్ద అదనపు సిబ్బందితో నిఘా పెట్టారు. తెల్లవారు జామున కొంత సమయం నిద్రపోయారు. ఉదయం 5.30కి ఆయనకు కాఫీ ఇచ్చారు. చదువుకునేందుకు కన్నడ, ఆంగ్ల దినపత్రికలను అందుబాటులోకి తెచ్చారు. కాసేపు వాటిని చూసిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్నారు. అల్పాహారంగా పులియోగెరె అందించారు. తనకు కడుపు నొప్పి అని చెప్పడంతో కారాగారంలోని ఆసుపత్రిలో చికిత్స అందించారు. మధ్యాహ్నం కొంత ఆహారాన్ని తీసుకున్నాక.. నిద్రలోకి జారుకున్నారు.

విచారణ వాయిదా

బెంగళూరు (సదాశివనగర): ఒక మహిళను అపహరించి, బంధించిన ఆరోపణలతో అరెస్టయిన మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ జామీను కోసం వేసుకున్న అర్జీ విచారణ సోమవారానికి వాయిదా పడింది. రేవణ్ణ తరపు న్యాయవాది సీవీ నాగేశ్‌, సిట్ తరపు న్యాయవాది జయ్నా కొఠారి రెండు గంటల పాటు చేసిన వాదనలను న్యాయమూర్తి సంతోష గజానన భట్ ఆలకించారు. జామీను అర్జీపై ఆక్షేపణలు చెప్పేందుకు తమకు సమయం కావాలని సిట్ కోరడంతో తదుపరి విచారణను వాయిదా వేస్తున్నామని న్యాయమూర్తి ప్రకటించారు. తనను రేవణ్ణ అపహరించారని బాధిత మహిళ ఇప్పటి వరకు ఫిర్యాదులో పేర్కొనకపోయినా, రేవణ్ణను నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం సరికాదని సీవీ నాగేశ్‌ తన వాదనలలో పేర్కొన్నారు. బాధితురాలిని రక్షించామని సిట్ ఇప్పటికే ప్రకటించినా, విచారణకు సంబంధించి ఇప్పటి వరకు వివరాలను న్యాయస్థానానికి దాఖలు చేయలేదని తెలిపారు. రేవణ్ణకు జామీను మంజూరు చేస్తే తన కుమారుడు ప్రజ్వల్‌కు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని జయ్నా కొఠారి వాదించారు.

సిట్ అదుపులో నలుగురు

మైసూరు: కేఆర్‌ నగరకు చెందిన ఒక మహిళను అపహరించి, నిర్బంధించిన ఆరోపణలపై నలుగురు నిందితులను సిట్ అదుపులోనికి తీసుకుంది. సుజయ్‌, కీర్తి, తిమ్మప్ప, మను అనే జనతాదళ్‌ కార్యకర్తలను నిందితులుగా గుర్తించారు. అపహరణ ఘటనలో ఇప్పటికే అరెస్టయిన రేవణ్ణ ఆప్త సహాయకుడు సతీశ్‌ బాబణ్ణతో కలిసి వీరు పని చేశారని దర్యాప్తు బృందం ఇప్పటికే గుర్తించింది. సతీశ్‌ అరెస్టు అనంతరం పరారైన వీరిని గాలింపు చేపట్టి బంధించారు.

భవానీకి నోటీసులు

బెంగళూరు (మల్లేశ్వరం): తమ ముందు విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ భార్య భవానీకి సిట్ నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీసులకు ఆమె బదులిచ్చారు. తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని ఉండడంతో విచారణకు హాజరు కాలేనని మౌఖికంగా చెప్పారు. వాట్సప్‌ ద్వారా పంపించిన నోటీసులకు ఆమె స్పందించలేదు. దానికీ స్పందించకపోతే మూడో నోటీసును ఇచ్చి, ఆమెను అదుపులోనికి తీసుకుంటామని సిట్ అధికారులు తెలిపారు.


ప్రజ్వల్‌ ఎప్పుడొస్తారో..

ప్రజ్వల్‌ రేవణ్ణ

హాసన, న్యూస్‌టుడే : లైంగిక దౌర్జన్యాల కేసులో ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ, ఆ వ్యవహారాల వీడియోలను పెన్‌డ్రైవ్‌ ద్వారా బహిర్గతం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కారు డ్రైవరు కార్తిక్‌ అలియాస్‌ పుట్ట అలియాస్‌ పుట్టరాజ్‌, అతని సన్నిహితులు నవీన్‌ గౌడ, చేతన్‌ల కోసం పోలీసులు గాలింపు తీవ్రం చేశారు. తమకు ముందస్తు జామీను మంజూరు చేయాలని కోరుతూ కార్తిక్‌ మిత్రులు హాసనలోని మూడో అదనపు జిల్లా, ఫాస్ట్‌ట్రాక్‌ న్యాయస్థానంలో అర్జీ వేసుకున్నారు. అర్జీని న్యాయమూర్తి గురువారం తోసిపుచ్చారు.

  • ఎన్నికలు జరిగిన వెంటనే జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్‌ ఆ తరువాత ఎక్కడకు వెళ్లాడో సిట్ అధికారులు ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. దుబాయ్‌ వెళ్లి అక్కడే తలదాచుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. బ్లూకార్నర్‌ నోటీసులు జారీ చేసినా ప్రజ్వల్‌ ఆచూకీ తెలియరాలేదు. ఆయన ఈనెల 15న వస్తారని అంచనా వేస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని