logo

దశదిశలా బాలల సంబరమే

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్‌ ఆరు వరకు 2,750 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 73.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే బాలికలు ఎక్కువ మంది ముందడుగు వేశారు.

Published : 10 May 2024 02:21 IST

పదిలో 73.40 శాతం ఉత్తీర్ణత
బాగలకోటె బాలిక ‘శత గణోత్సవం’
ఎప్పటిలాగే బాలికలదే ఈసారీ పైచేయి

ఫలితాలను ప్రకటిస్తున్న మంజుశ్రీ

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : రాష్ట్రవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్‌ ఆరు వరకు 2,750 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 73.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే బాలికలు ఎక్కువ మంది ముందడుగు వేశారు. బాగలకోటె మెళ్లిగేరి మొరార్జీ దేశాయి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అంకిత బసప్ప 625కు 625 మార్కులతో ఓ మెరుపు మెరిసింది. హర్షిత (మధుగిరి), సిద్ధాంత్‌ (చిక్కోడి), చిన్మయ్‌ (దక్షిణ కన్నడ), సహన (ఉడుపి), దర్శన్‌ (సిరసి), శ్రీరామ్‌ (సిరసి), వేదా పి శెట్టి (బెంగళూరు) రెండో ర్యాంకు దక్కించుకున్నారు. వారి తరువాతి ర్యాంకుల్లో సౌరవ్‌ కౌశిక్‌, తృప్తి రామచంద్రగౌడ, చైతన్య గణపతి హెగ్డే, మాన్యత మయ్య అనే విద్యార్థులు సత్తా చాటారు.

ఈ ఏడాది బాలికలు 81.11 శాతం, బాలురు 65.90 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 83.89 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది 10.4 శాతం ఫలితాలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది 14వ స్థానంలో నిలిచిన ఉడుపి జిల్లా విద్యార్థులు ఈ ఏడాది మొదటి స్థానానికి రాగా.. గతేడాది లాగే ఇప్పుడూ యాదగిరి చివరిస్థానంలో నిలిచింది. మొత్తం 78 పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించాయని పరీక్ష మండలి అధ్యక్షురాలు మంజుశ్రీ ప్రకటించారు. ఈ ఏడాది 8,69,968 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 6,31,204 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటిసారిగా వెబ్‌కాస్టింగ్‌ విధానాన్ని అమలు చేయడంతో 20 శాతం వెయిటేజ్‌ మార్కులను కేటాయించామన్నారు. వచ్చే ఏడాది నుంచి వెయిటేజ్‌ మార్కులు ఉండవన్నారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ‘ఫెయిల్‌’ బదులుగా ‘ఇన్‌ కంప్లీట్’ అని మార్కుల జాబితాపై ముద్రించి ఇస్తామని తెలిపారు.

బెంగళూరు : సర్దార్‌ పటేల్‌ పాఠశాలలో ర్యాంకర్లకు మిఠాయి తినిపిస్తున్న ఉపాధ్యాయురాలు

గ్రామీణులే భళా..

నగర ప్రాంతానికి చెందిన విద్యార్థులు 72.83 శాతం, గ్రామీణ విద్యార్థులు 74.17 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలు 72.46 శాతం, ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న పాఠశాలలు 72.22 శాతం, ప్రైవేటు పాఠశాలలు 86.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మూడు ప్రభుత్వ, 13 గ్రాంటెడ్‌, గ్రాంటులు అందుకోని 62 పాఠశాలలు జీరో ఫలితాలు పొందాయి. గత ఏడాది 14వ స్థానంలో నిలిచిన ఉడుపి ఈ ఏడాది మొదటి స్థానానికి చేరగా, గత ఏడాది మొదటిస్థానంలో నిలిచిన చిత్రదుర్గ విద్యార్థులు ఈ ఏడాది 21వ స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. సిరసికి చెందిన దర్శన్‌ భట్, చిన్మయ హెగ్డే, కేఎం శ్రీరామ రెండో ర్యాంకు, తృప్తి గౌడ మూడో ర్యాంకు దక్కించుకున్నారు.

ప్రథమ ర్యాంకర్‌ అంకిత బసప్పను సత్కరిస్తున్న బాగల్‌కోటె జిల్లా అధికారులు


చదువులకే అంకితం

బాగలకోటెలో తల్లిదండ్రులు బసప్ప, గీతతో మొదటి ర్యాంకర్‌ విద్యార్థిని అంకిత

బాగలకోటె, న్యూస్‌టుడే : చక్కగా చదువుకుని ఐఏఎస్‌ అధికారినై తన ప్రాంతానికి సేవలు చేయాలన్నది తన కల అని ప్రభుత్వ పాఠశాలలో చదివి వంద శాతం మార్కులు పొందిన అంకిత బసప్ప వివరించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వజ్జరమట్టిలో ఆమె చదివారు. ఆరో తరగతి నుంచి మెళ్లిగేరి మొరార్జీ దేశాయి ప్రభుత్వ పాఠశాలలో, హాస్టల్‌లో ఉంటూ చదువుకుంది. మొరార్జీ దేశాయి హాస్టల్‌లో చేరేందుకు రాసిన ప్రవేశ పరీక్షల్లోనూ 98 శాతం మార్కులు పొందింది. బాగలకోటె జిల్లా వజ్జరమట్టికి చెందిన ఆమె తండ్రి బసప్పకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ పొలంలో పని చేస్తేనే వారికి పూట గడుస్తుంది. తల్లిదండ్రులు గుడిసెలోనే ఉంటున్నారని ఆమె వివరించారు. ‘నాకన్నా అమ్మానాన్న, నాకు పాఠాలు చెప్పిన గురువులు సంతోషంగా ఉన్నారు. పీయూసీలో సైన్స్‌ విభాగంలో చేరతాను’ అని అంకిత చెప్పారు. ‘కష్టమైనా కుమార్తె ఆశ పడినట్లు చదివిస్తాను’ అని బసప్ప తెలిపారు. మంత్రి ఆర్‌బీ తిమ్మాపుర వజ్జరమట్టి గ్రామానికి వచ్చి అంకితను సత్కరించారు. జిల్లాధికారి కేఎం జానకి, జిల్లా పంచాయతీ సీఈఓ శశిధర కురేర కూడా ఆమెను సత్కరించారు. అంకిత బసప్ప తదుపరి విద్యాభ్యాసానికి తమ సహకారం ఉంటుందని మంత్రి, జిల్లాధికారి భరోసా ఇచ్చారు.


సమాధాన పత్రాలు..

తమ సమాధాన పత్రాలను స్కానింగ్‌ చేసి అందుకునేందుకు 16వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. రీవాల్యుయేషన్‌కు మే 13-22 మధ్యలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు జూన్‌ 7-14 వరకు పరీక్షలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని