logo

నీ గెలుపు దేశానికి మలుపు

సమాజ గతిని మార్చగలిగే శక్తి ఒక్క యువతకే సొంతం. జనాభాలో.. ముఖ్యంగా పనిచేసే వారిలో వారి పాత్రే కీలకం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఓ నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగేవారే ఉన్నత జీవన ప్రమాణాలను

Published : 12 Aug 2022 02:01 IST

కొత్తగూడెం కలెక్టరేట్‌, ఖమ్మం విద్యావిభాగం, ఖమ్మం సారథినగర్‌, న్యూస్‌టుడే

సమాజ గతిని మార్చగలిగే శక్తి ఒక్క యువతకే సొంతం. జనాభాలో.. ముఖ్యంగా పనిచేసే వారిలో వారి పాత్రే కీలకం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఓ నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగేవారే ఉన్నత జీవన ప్రమాణాలను అందుకోవడంలో  ముందుంటారు. ఇలాంటి వారే జాతిని బలోపేతం చేయగలరన్నది మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్‌కలాం ఓ సందర్భంలో ఊటంకించారు. ఆధునిక, సాంకేతిక రంగాల్లో పోటీ ఎలా ఉన్నా.. ఎన్ని అవరోధాలు ఎదురైనా.. చిన్ననాటి నుంచే లక్ష్యం ఏర్పరుచుకున్న వారు విజయం సాధించగలరని ఉభయ జిల్లాలకు చెందిన కొందరు యువత నిరూపిస్తున్నారు.


‘‘ ఒక దేశానికి బలం.. నిర్దిష్ట లక్ష్యం ఉన్న యువత. బలహీనత కూడా ఎలాంటి లక్ష్యం లేని ఆ యువతే’’.
-  మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్‌కలాం


నేటి యువతకు జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో ముందే ఓ స్పష్టత ఉండాలి. దానికనుగుణంగా విద్యలో రాణించాలి. నైపుణ్యాభివృద్ధికి కృషిచేయాలి. ఈ దృక్పథంతోనే ఉభయ జిల్లాల యువత విజయ పథకంలో సాగాలి. వచ్చే పాతికేళ్లూ యువత ప్రతిభాపాటవాలకు పెద్దపీట వేస్తాయన్నది నిపుణుల మాట. కన్న కలలు సాకారం చేసుకునేందుకు స్వాతంత్య్ర వజ్రోత్సవాలే స్ఫూర్తి కావాలి. యువత గెలుపు.. దేశానికి మలుపు కావాలని ఆకాంక్షిద్దాం.  
స్వాతంత్య్రం తరువాత ఉమ్మడి ఖమ్మంలో పారిశ్రామికంగా అంచెలంచెలుగా ఎదిగింది కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం ప్రాంతాలే. అక్కడ నిక్షిప్తమైన సహజ వనరులు, స్థల లభ్యత, సుదూర గోదావరి పరీవాహక ప్రాంతం ఇందుకు ఎంతో దోహదపడింది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో పరిశ్రమల విస్తరణతో పాటు నైపుణ్య యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే సంస్థలున్నాయి. వీటిని ఒడిసిపట్టి వ్యక్తిగతంగా, తద్వారా దేశాభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలి.


దృక్పథం మారితే సరైన దారి

విద్య, సాంకేతిక అర్హతలున్న వారికి స్థానికంగా చిరుస్థాయి ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ కొందరు వాటిల్లో చేరేందుకు ఇష్టపడటం లేదు. మంచి ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ కొలువు.. లేదంటే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ప్రభుత్వ కొలువుల కోసం కుస్తీపడుతూ కొందరు కాలం వృథా చేస్తున్నారు. దరిదాపుల్లో ఉన్న అవకాశాలను వదిలేస్తున్నారు. ఆ తర్వాత సమయం మించిపోతుండటంతో పూర్తిస్థాయి నిరుద్యోగులు మారుతున్నారు. స్వయం ఉపాధి కోణంలోనూ దృష్టి మరల్చాలన్నది నిపుణుల సూచన. ఉదాహరణకు ఓ ఏసీ మెకానిక్‌ ఆదాయం సీజన్‌లో రూ.2 నుంచి రూ.3 లక్షలు ఉంటోంది. లేదా వ్యవసాయ మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఉద్యాన పంటల సాగు, ఎగుమతులతో ఏటా రూ.లక్షల్లో సంపాదిస్తున్న చదువరులు చాలామందే ఉన్నారు. మారాల్సిందల్సా ఆలోచనా ధోరణే.


కలలుగన్నారు.. సాధించారు..

టేకులపల్లి మండలం ముత్యాలంపాడుకు చెందిన తంగేళ్లపల్లి ఈశ్వరాచారి, అనితా లక్ష్మి కుమారుడు నిఖిల్‌ 21 ఏళ్లకే క్యాంపస్‌ ఇంటర్వ్యూలో అమెజాన్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. ఆయన వేతనం ఏడాదికి రూ.64 లక్షలు. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లోని కార్యాలయంలో విధుల్లో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. చిన్ననాటి నుంచే తనకు గణితం ఇష్టమన్నారు నిఖిల్‌. ఎప్పటికైనా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కలలుగన్నట్లు చెప్పారు. ఆ ఇష్టమే బాసర ట్రిపుల్‌ ఐటీ సీఎస్‌ఈలో సీటు సాధించేలా చేసిందన్నారు. యువత అనుకున్న సాధించాలంటే చిన్నతనం నుంచే ఓ లక్ష్యమంటూ ఏర్పరుచుకోవాలని ఈ విజేత చెబుతున్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ, చదివిన కాస్త సమయమైనా ఏకాగ్రతతో చదవాలన్నారు. తాము ఎంచుకున్న రంగంలో ఎప్పటికప్పుడు తాజా సమాచారం సేకరించడమూ మరింత ఉన్నతస్థానానికి బాటలు వేస్తుందన్నారు.


ఉద్యోగావకాశాలకు మార్గాలెన్నో...

కొలువుల గని: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సింగరేణి యువత ఉపాధి అవకాశాలకు నెలవుగా నిలుస్తోంది. కొలువుల భర్తీలో 95% స్థానికులకే పెద్దపీట వేస్తుండటంతో అత్యధిక విభాగాల్లో ఇక్కడి వారే ఉద్యోగాలు పొందుతున్నారు. 2014 నుంచి కారుణ్య నియామకాలు, కొత్త నోటిఫికేషన్ల ద్వారా అధిక పోస్టులు భర్తీ చేయగా.. ఇప్పటి వరకు 14 వేల మంది కొలువులు దక్కించుకోవడం విశేషం. వారసత్వ నియామకాల్లో 6 వేల మంది అవకాశాలు దక్కించుకున్నారు. వీరే కాకుండా 25 వేల మంది ఒప్పంద కార్మికులుగా పనిచేస్తుండగా.. వీరిలో 8 వేల మంది యువతే ఉన్నారు. ఏటా 1300 మంది ట్రైనీ అప్రెంటీస్‌లు శిక్షణ పొంది ఉపాధి అవకాశాలకు బాటలు పరుచుకుంటున్నారు.
ఐటీ హబ్‌: ఒకప్పుడు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి మహా నగరాలకే పరిమితమైన సాఫ్ట్‌వేర్‌ కొలువులు ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌ లాంటి ద్వితీయ శ్రేణ నగరాలకూ అందిస్తుండటం కలిసి వచ్చే అంశం. ఐటీ హబ్‌ను 2020లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. 19 కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించగా.. తొలిదశలో 450 మంది యువతకు ఉపాధి అవకాశాలు దక్కాయి. రెండో హబ్‌కు గతేడాది శంకుస్థాపన జరపగా.. త్వరలో మరో 550 మందికి కొలువులు దక్కేలా చూడాలని నిర్ణయించారు. జిల్లాకు చెందిన ఇంజినీరింగ్‌ యువత సాంకేతిక నైపుణ్యాలు అవర్చుకుంటే ఇలాంటి అవకాశాలెన్నో దరిచేరతాయి.

ట ఇవే కాకుండా ఒక స్పష్టమైన లక్ష్యంతో సన్నద్ధమైతే ఐటీసీ పీఎస్‌పీడీ (సారపాక), కేటీపీఎస్‌, నవభారత్‌ (పాల్వంచ), బీటీపీఎస్‌ (మణుగూరు), మణుగూరు భారజల కర్మాగారం (అశ్వాపురం) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లోనూ కొలువులు సాధించవచ్చు.

ఉమ్మడి ఖమ్మంలో.. విశేషాలు..
66% జనాభాలో 35 ఏళ్ల లోపు వయస్కులు
3,00,000 డిగ్రీ, ఇంజినీరింగ్‌ పట్టభద్రులైన యువత
7,50,000 ప్రైవేటు ఉద్యోగాల్లో కొనసాగుతున్నవారు (పనిచేస్తూ ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు శ్రమిస్తున్నవారు..)
1,70,000 ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ఉపాధి కల్పనా కార్యాలయాల్లో నమోదైన నిరుద్యోగులు
64 ఉపాధి కల్పన స్థాయిలో పేరున్న చిన్నతరహా పరిశ్రమలు
450 ఖమ్మంలో ఖ్యాతిగాంచిన గ్రానైట్‌ పరిశ్రమలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని