logo

రాములోరి పట్టాభిషేకం... చూతమురారండి

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో పన్నెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న అతి పెద్ద క్రతువు శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం.

Published : 07 Feb 2023 04:44 IST

భద్రాచలం, న్యూస్‌టుడే

సీతారాముల వారి పట్టాభిషేకం (పాత చిత్రం)

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో పన్నెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న అతి పెద్ద క్రతువు శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం. మార్చి 31న నిర్వహించేందుకు వైదిక కమిటీ ప్రకటించిన నేపథ్యంలో దీన్ని భక్తులు మురిసేలా నిర్వహించాల్సి ఉంది. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా శ్రీరామ నవమిని ప్రధాన పండుగగా భావించి ఏర్పాట్లు చేస్తుంటారు. ఈసారి నవమితో పాటు ఆ తర్వాత రోజు వచ్చే పట్టాభిషేకానికి ప్రాధాన్యతనిస్తూ ఈవో శివాజీ చర్యలు చేపట్టారు.

నలుదిక్కులకు వైదిక బృందం

ఈ ఏడాది రాములోరి కల్యాణానికి 150 క్వింటాళ్లకు పైగా బియ్యం, ఒక క్వింటాకు పైగా ముత్యాలతో తలంబ్రాలను సిద్ధం చేయనున్నారు. తలంబ్రాలను కలిపే తేదీ అధికారికంగా ఖరారు కానప్పటికీ మార్చి 7న ఈ ఉత్సవం ఉంటుందని సమాచారం. ఆరోజు నుంచి ఎంపిక చేసిన పది మంది వైదిక సిబ్బంది దేశంలోని నలు దిక్కులకు పర్యటించి పుణ్య జలాలను సేకరించి పట్టాభిషేకానికి తేవాల్సి ఉంది. వీరంతా మార్చి 18కి భద్రాచలం చేరుకుంటారు. ఏ నది జలాన్ని ఎక్కడ నుంచి సేకరించాలన్నది ఆగమ శాస్త్రం ప్రకారం నిర్ణయించారు. గోదావరి, గంగాధర, శ్వేత పుష్కరిణి, నర్మద, పూరిలోని సముద్రం తీర్థాన్ని తూర్పు దిక్కు నుంచి తీసుకురానున్నారు. పశ్చిమాన ఉన్న గోపీ తలాబ్‌, పుష్కర్‌, చంద్రభాగ జలాన్ని పాత్రల్లో తేవాల్సి ఉంది. ఉత్తరంలోని గంగ, యమున, సరస్వతి, సరయు, గోమతి నదులను గుర్తించారు. దక్షిణంలోని కావేరి, తామ్రపర్ణి, పినాకిని, కపిల తీర్థం, తిరుమల స్వామి పుష్కరిణి, పద్మ పుష్కరిణి, అనంత పుష్కరిణి, కల్యాణ పుష్కరిణి, ఇంద్ర పుష్కరిణి, శ్రీరామ పుష్కరిణి వంటి చోట్లకు వెళ్లనున్నారు. రూ.కోటితో స్వామివారికి 12 వాహనాలను సమకూర్చుతున్నారు. వీటిలోనే తిరువీధి సేవ ఉంటుంది.

అంతర్గత సమస్యలూ పరిష్కరించుకోవాలి

ఉత్సవాల నేపథ్యంలో అంతర్గత సమస్యలనూ పరిష్కరించుకోవాలి. ప్రస్తుతం ఐదుగురు కీలక సిబ్బందితో వైదిక కమిటీ పని చేస్తోంది. వీరు తీసుకునే నిర్ణయాలకు ప్రాధాన్యత ఉంటుంది. రామాలయంలో ఇద్దరు ప్రధానార్చకులు ఉన్నా ఈ కమిటీలో ఒక్కరే పనిచేస్తున్నారు. ఇందులో మరో ప్రధానార్చకుడికి అవకాశం కల్పించి ఆరుగురితో కమిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ బలంగా ఉంది.


ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి తీసుకొచ్చే సంప్రదాయం ఉన్నందున ఆహ్వాన పత్రికలను సిద్ధం చేయాలి. ముత్యాల తలంబ్రాలకు పట్టు వస్త్రాలకు అధికారిక లాంఛనాల మొత్తాన్ని పెంచాలి. కల్యాణం-పట్టాభిషేకం సెక్టార్‌లో 20 వేల మందికి ప్రవేశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచాలి.


ఘనంగా నిర్వహిస్తాం: శివాజీ, ఈవో

ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎవరెవర్ని ఆహ్వానించాలన్నది త్వరలో స్పష్టత వస్తుంది. మరో ప్రధానార్చకుడ్ని వైదిక కమిటీలో తీసుకునే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని