logo

దోచుకునేందుకు అడ్డదారులు

హైదరాబాద్‌కు దీటుగా సకల హంగులతో దూసుకుపోతున్న ఖమ్మం నగరంలో.. నేర స్వభావం గల కొందరు యువకులు పేట్రేగిపోతున్నారు.

Published : 14 Mar 2023 03:08 IST

వైరా, ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే

హైదరాబాద్‌కు దీటుగా సకల హంగులతో దూసుకుపోతున్న ఖమ్మం నగరంలో.. నేర స్వభావం గల కొందరు యువకులు పేట్రేగిపోతున్నారు. నగరం చుట్టూ నిర్మానుష్య ప్రాంతాల వైపు వెళ్తున్న ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని దోచుకుంటున్నారు. రెండు, మూడు నెలల వ్యవధిలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే భయం ముంగిట నిల్చున్నామా అనే భావన ప్రస్ఫుటమవుతోంది.

* రఘునాథపాలెం సమీపంలో, ప్రధాన రహదారికి కొద్దిదూరంలో పగటిపూట కారులో వెళ్లిన ఓ జంటను గమనించిన యువకుడు వెంటనే తమ ముఠాను రప్పించాడు. మూడు వాహనాల్లో వెళ్లి జంటపై దాడి చేసి బంగారం, నగదు దోచుకున్నారు.

* ఖమ్మం నుంచి ఇల్లెందు వెళ్లే మార్గంలో ఓ పార్కు సమీపంలోకి యువజంట వెళ్లింది. కొద్ది క్షణాల్లోనే ఆకతాయిలు వచ్చి వారి నుంచి నగదు, బంగారం దోచుకుని వెళ్లిపోయారు. అడిగింది ఇవ్వకుంటే ఏమైనా చేస్తామని బెదిరించారు.

పగలూ పెట్రోలింగ్‌

ప్రేమ జంటలపై దాడుల నేపథ్యంలో కొద్దిరోజులుగా పోలీసులు పగటిపూట పెట్రోలింగ్‌పై దృష్టి సారించారు. నగర పరిధిలోని ఓ మామిడితోట సమీపంలో జంటను బెదిరించేందుకు వెళ్తున్న ఆకతాయిలను గుర్తించి హెచ్చరించారు. జంటకు కౌన్సెలింగ్‌ చేశారు.

వామ్మో.. ఎంత విలువో..?

ఇటీవల హైదరాబాద్‌ వెళ్తున్న ఓవాహనాన్ని ఖమ్మం రూరల్‌ పరిధిలో సదరు ముఠా అడ్డగించింది. వాహన యజమానిని బయటకు లాగి గొడవపడింది. అంతలోనే ఇంకొందరు వచ్చి దాడికి పాల్పడ్డారు. రూ.లక్షల్లో నగదు అపహరించారు. రోజుల వ్యవధిలోనే ప్రేమజంటల నుంచి కిలోకు పైగా బంగారం, రూ.లక్షల్లో నగదు తస్కరించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. విద్యనభ్యసిస్తున్న ప్రేమ జంటలే ఎక్కువ మంది బాధితులు. వీరిలో కొందరి వివరాలు తెలుసుకుని పోలీసులు సంప్రదించినా ఫిర్యాదు చేసే ధైర్యం బాధితులకు చాలటం లేదు. ఇంకొందరు బిక్కుబిక్కుమంటూ పోలీసులను ఆశ్రయించి గోప్యత పాటించాలని కోరుతున్నారు.

ఎక్కడెక్కడంటే..?

ఖమ్మం వెలుగుమట్లతోపాటు ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ నుంచి ఇల్లెందు రహదారికి వెళ్లే బైపాస్‌, ఖమ్మం రూరల్‌ ప్రాంతం,   రఘునాథపాలెం పరిసరాలు, అల్లీపురం, బోనకల్లు మార్గాల్లోని ప్రత్యేక ప్రాంతాలపై ఆకతాయిలు దృష్టి సారిస్తున్నారు.

తస్మాత్‌ జాగ్రత్త..

* యువత ఏకాంతం కోసం నిర్జన ప్రదేశాలకు వెళ్లాలనుకోవటం ప్రమాదం, అనైతికమని గుర్తించాలి.
* దుండగులు ఒక్కొక్కరు ఒక్కోచోట ఉంటున్నారు. ఎక్కడైనా కారు లేదా బైకుపై నిర్జన ప్రదేశానికి వెళ్తున్న జంట కనిపిస్తే తమ ముఠాను రప్పిస్తున్నారు.
* బంగారం, నగదు దోచుకునే క్రమంలో ప్రతిఘటిస్తే దాడి చేస్తున్నారు. మహిళలపై అకృత్యాలకూ వెనకాడటం లేదు.
* నగరంలో ఎన్నో ప్రజాపార్కులున్నాయి. నిర్దేశిత సమయంలో ఉల్లాస వాతావరణం ఉంటుంది.


ఉపేక్షించే ప్రసక్తే లేదు

విష్ణు ఎస్‌ వారియర్‌, సీపీ

నగర శివార్లలో ప్రేమికులు, అమాయకులను బెదిరించి చోరీలకు పాల్పడే వారిని ఉపేక్షించబోం. ఇటీవల ఖమ్మం గ్రామీణ మండలంలో ఎనిమిది మందితో కూడిన ముఠాను అరెస్టు చేశాం. లకారం ట్యాంకుబండ్‌, బైపాస్‌రోడ్డు వెంట వివిధ ప్రాంతాల్లో అమాయకులను బెదిరించి బంగారం, నగదు దోచుకున్నారు. పెట్రోలింగ్‌ను పెంచుతున్నాం. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని