logo

సీతారాముల వారి పట్టువస్త్రాలు మాయం?

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి సమర్పించిన పట్టు వస్త్రాల్లో కొన్ని మాయమైనట్లు తెలిసింది. శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఉత్సవాల తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా బయటకు పొక్కింది.

Updated : 02 Jun 2023 05:23 IST

భద్రాచలం, న్యూస్‌టుడే

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి సమర్పించిన పట్టు వస్త్రాల్లో కొన్ని మాయమైనట్లు తెలిసింది. శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఉత్సవాల తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా బయటకు పొక్కింది. వాస్తవాలను తెలుసుకునేందుకు ఈఓ రమాదేవి అంతర్గతంగా విచారణ చేపట్టారు. కొద్దిరోజుల నుంచి లెక్కలను తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. మార్చి 30న శ్రీరామనవమి, 31న శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులు కానుకలు సమర్పించారు. వేర్వేరు ఆలయాలు, పీఠాలు, మఠాల నుంచి రాములవారికి బహుమతులు అందాయి. ఇందులో ఓ ప్రముఖ మఠం నుంచి వచ్చిన సుమారు రూ.లక్ష విలువైన వస్త్రాలు ఇప్పుడు కనిపించటం లేవన్నది సంచలంగా మారింది.

సంచిలో తీసుకెళ్లినవి డ్రైఫ్రూట్స్‌ కాదు..

ఎందుకు అనుమానం కలిగిందో కానీ తాము సమర్పించిన వస్త్రాలను చూపించాలని ఓ ప్రముఖ మఠం ప్రతినిధి ఇటీవల ఆలయ సిబ్బందిని కోరారు. సంబంధిత విభాగంలో పరిశీలించటంతో సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామికి సమర్పించిన వస్త్రాలు కనిపించలేదు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఈఓ.. వారం క్రితం ఓ ఉద్యోగికి విచారణ బాధ్యతలు అప్పగించారు. ఒకరి తీరుపై అనుమానం వచ్చి నిగ్గదీసి అడిగారు. మార్చి 30న శ్రీరామనవమి రోజు డ్రైఫ్రూట్స్‌ తీసుకెళ్లినట్లు అతడు సమాధానమిచ్చారు. తీసుకున్నవి అప్పగిస్తే చర్యలు ఉండబోవని భరోసా కల్పించడంతో సదరు ఉద్యోగి.. తన బంధువులతో మార్చి 30న మామూలు వస్త్రాలను సంచిలో పెట్టి పంపించినట్లు ఒప్పుకొన్నారు. వీటిని రెండ్రోజుల క్రితం ఆలయానికి తిరిగి అప్పగించినట్లు తెలిసింది.


31న ఏం జరిగిందో తేలాలి..?

రాములవారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను.. హక్కులు పొందిన గుత్తేదారు సేకరిస్తారు. వీటిని ప్రత్యేక కౌంటర్‌లో తిరిగి విక్రయిస్తుంటారు. గవర్నర్‌, ముఖ్యమంత్రి, పీఠాధిపతులు, మఠాధిపతులు వంటివారు సమర్పించినవి గుత్తేదారుకు ఇవ్వరు. వీటిని ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో దేవుడి అలంకరణకు భద్రపర్చుతుంటారు. ఈ విభాగంపై పర్యవేక్షణ కొరవడటంతో పుస్తకాల్లో నమోదు ప్రక్రియ గందరగోళంగా మారింది. దాతలు సమర్పించిన వాటినే భద్రపరిచారా..? వాటి స్థానంలో సాధారణ వస్త్రాలను ఉంచుతున్నారా అనే అనుమానం తెరపైకి వచ్చింది. 31న మాయమైన పట్టుచీరలు, పంచెలు, కండువాల గురించి ఆరా తీయడంతో 30న చోటుచేసుకున్న తంతు బయట పడింది. 31న సమర్పించిన పట్టువస్త్రాలు ఏమయ్యాయో తేలాలి. విచారణ పూర్తయ్యేసరికి ఇంకా ఎన్ని విచిత్రాలు వెలుగులోకి వస్తాయోనని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మామూలు వస్త్రాలను తీసుకెళ్లినవారు వాటిని అప్పగించారు. పట్టువస్త్రాలు మాయం కాలేదు. ఇప్పటికే ఇందులో ఒక చీర లభించింది. మిగతావి ఎక్కడ భద్రపరిచారో పరిశీలిస్తున్నాం. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతాం.

రమాదేవి, ఈఓ


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని