logo

అభ్యర్థులు వారే.. గుర్తులు మారె..!

2018 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడినవారే ఈసారీ పోటీపడుతున్నారు. అభ్యర్థులు వారే అయినప్పటికీ గుర్తులు మారిపోయాయి. గత ఎన్నికల్లో ఒక గుర్తుతో ఓట్లు అభ్యర్థించిన నేతలు.. ఈసారి తమ గుర్తు మారిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

Updated : 09 Nov 2023 06:53 IST

ఈటీవీ- ఖమ్మం, న్యూస్‌టుడే, పాల్వంచ: 2018 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడినవారే ఈసారీ పోటీపడుతున్నారు. అభ్యర్థులు వారే అయినప్పటికీ గుర్తులు మారిపోయాయి. గత ఎన్నికల్లో ఒక గుర్తుతో ఓట్లు అభ్యర్థించిన నేతలు.. ఈసారి తమ గుర్తు మారిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయంపై ప్రత్యేక కథనం.

  •  ఇల్లెందు నియోజకవర్గంలో ప్రస్తుతం పోటీపడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ గత ఎన్నికల్లో ప్రత్యర్థులే. 2018లో తెరాస తరఫున కోరం కనకయ్య బరిలో నిలవగా.. కాంగ్రెస్‌ నుంచి బానోత్‌ హరిప్రియనాయక్‌ పోటీ చేశారు. హరిప్రియనాయక్‌ గెలుపొందారు. తదనంతరం కోరం కనకయ్య భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. నాలుగున్నరేళ్ల తర్వాత నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఈసారి హరిప్రియనాయక్‌ భారాస అభ్యర్థిగా, కాంగ్రెస్‌ తరఫున కోరం కనకయ్య బరిలో నిలుస్తున్నారు.
  •  పినపాక నియోజకవర్గంలోనూ ఇలాంటి రాజకీయ చిత్రమే కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు పాత వారే అయినా.. ఈసారి కొత్త గుర్తులతో ప్రజల్లోకి వెళ్తున్నారు. గత ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా రేగా కాంతారావు బరిలో నిలిచారు. రేగా కాంతారావు విజయం సాధించారు. ఈసారి భారాస అభ్యర్థిగా రేగా కాంతారావు, కాంగ్రెస్‌ తరఫున పాయం వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు.

మిగతా చోట్లా ఇంతే..

2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కందాళ ఉపేందర్‌రెడ్డి బరిలో దిగారు. భారాస అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొంది ఆతర్వాత గులాబీ గూటికి చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచే భారాస అభ్యర్థిగా బరిలో నిలిచిన కందాళ ఉపేందర్‌రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. గత ఎన్నికల్లో కారు గుర్తుతో పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావు.. ఈసారి ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. హస్తం గుర్తుకు ఓటేయాలంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

  • సత్తుపల్లి నియోజకవర్గంలో తెదేపా నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందిన సండ్ర వెంకటవీరయ్య ఈసారి కారు గుర్తుతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
  •  గత ఎన్నికల్లో అశ్వారావుపేటలో తెదేపా తరఫున మెచ్చా నాగేశ్వరరావు గెలుపొందారు. తదనంతరం భారాసలో చేరి ఈసారి కారు గుర్తుతో బరిలో నిలుస్తున్నారు.
  • ప్రస్తుతం కొత్తగూడెం భారాస అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలుపొందారు. తదనంతరం గులాబీ గూటికి చేరిన వనమా.. ఈసారి కారు గుర్తుతో ప్రజల్లోకి వెళ్తుండటం గమనార్హం.

పోలింగ్‌ కేంద్రాలపై చరవాణి నంబర్లు

శాసనసభ ఎన్నికలు ఈ నెల 30న జరగనుండటంతో అధికారులు పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పోలింగ్‌ రోజు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లు తమ పోలింగ్‌ కేంద్రం ఎక్కడుందో తెలియక ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఎన్నికల అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. అందరికీ తెలిసేలా కేంద్రం ఎదుట పోలింగ్‌ స్టేషన్‌ సంఖ్యతో పాటు బీఎల్‌ఓల ఫోన్‌ నెంబర్లు సైతం రాస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 1,455 పోలింగ్‌ కేంద్రాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,095 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల అన్నింటి వద్ద పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన పూర్తి వివరాలు రాస్తున్నారు.
రీ గతంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద నియోజకవర్గం, పోలింగ్‌ కేంద్రం సంఖ్యలు మాత్రమే కనిపించేవి. తాజాగా ఈ సంఖ్యలతో పాటు ఆ పోలింగ్‌ కేంద్రానికి నియమితులైన బూత్‌ స్థాయి అధికారి(బీఎల్‌ఓ) చరవాణి నంబర్‌ను అందరికీ కనిపించే విధంగా రాస్తున్నారు. ఓటర్లు ఎన్నికలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడనుంది.    

చింతకాని, న్యూస్‌టుడే


ఏకగ్రీవం ‘కొమరం’కే సాధ్యం
ఉమ్మడి జిల్లాలో ఈ ఘనత ఒక్కరిదే

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించిన నాయకుడు ఒక్కరే ఉండటం విశేషం. ఆయన పేరే కొమరం రామయ్య. 1968లో జరిగిన బూర్గంపాడు ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. మళ్లీ ఇంత వరకు ఆ ఘనత సాధించిన నాయకుడు లేకపోవడం గమనార్హం. 1967లో కొమరం రామయ్య కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి చీమల పండయ్యపై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1968లో ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు చెప్పింది. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవంగా శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. తిరిగి 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి గొగ్గల సీతయ్యపై గెలిచారు. ఇలా మొత్తం మూడు పర్యాయాలు విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధించిన నేతగా పేరు తెచ్చుకున్నారు. 1962లో ఏర్పాటైన బూర్గంపాడు నియోజకవర్గం 2009లో రద్దయింది. ఈ నియోజకవర్గానికి మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌, కాంగ్రెస్‌(ఐ) నాలుగు సార్లు, సీపీఐ ఐదు సార్లు, తెదేపా ఒకసారి, స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలిచారు.
 ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే


నాన్నా దీవించు..
నీలా విజయం వరించాలని ఆకాంక్షించు

శాసనసభ ఎన్నికల్లో భాగంగా భద్రాద్రి జిల్లా ఇల్లెందు స్థానానికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె, ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గుమ్మడి అనురాధ స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం తన నామపత్రాన్ని దాఖలు చేశారు. అంతకుముందు ఆమె తన తండ్రి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ తన తండ్రిని ఆదరించినట్లే నియోజకవర్గ ప్రజలు తననూ ఆదరించాలని కోరారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థి అనురాధకు మద్దతు ఇవ్వాలని సీపీఐ ఎం.ఎల్‌. న్యూడెమోక్రసీ ప్రజాపంథా నిర్ణయించటంతో గుమ్మడి నర్సయ్య పోటీకి దూరంగా ఉన్నారు. విప్లవ పార్టీ తరఫున అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన వరుసగా గత తొమ్మిదిసార్లుగా న్యూడెమోక్రసీ తరఫున బరిలో నిలుస్తూ వస్తున్నారు.
ఇల్లెందు, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని