logo

ఆక్రమణల చెరలోనే సాగర్‌ కాల్వలు

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ మధిర బ్రాంచి కెనాల్‌ పరిధిలో ఉన్న ఊటుకూరు, మధిర మేజర్‌ కాల్వలు కబ్జాకు గురయ్యాయి.

Published : 28 Mar 2024 01:37 IST

వంగవీడు-సిరిపురం గ్రామాల మధ్య పూడ్చివేసిన సాగర్‌ కాల్వ

మధిర, మధిర పట్టణం, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ మధిర బ్రాంచి కెనాల్‌ పరిధిలో ఉన్న ఊటుకూరు, మధిర మేజర్‌ కాల్వలు కబ్జాకు గురయ్యాయి. దీంతో నీరు ప్రవహించక ఆయకట్టుకు నీరందడంలేదు. మరోవైపు పొలాలపై నీరు ప్రవహించడంతో ముంపునకు గురవుతున్నాయి. అయినా సంబంధిత అధికారులు మొక్కుబడిగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత భూమి అత్యంత విలువైనది.


వైరానది పాలవుతున్న సాగు నీరు

ఊటుకూరు మేజర్‌ 17వ కి.మీ. నుంచి 19వ కి.మీ. వరకు అసలు కాలువే లేకుండా పూడ్చివేసి రైతులు సాగుచేస్తున్నారు. దీంతో అడపాదడపా వచ్చే సాగునీరు వంగవీడు చెరువుకు చేరకుండా పంట పొలాలపై నుంచి ప్రవహించి వైరానది పాలవుతోంది. ఇలా ఏటా సాగునీరు వృథా అవుతోంది. అంతేకాకుండా పంట పొలాలపై నీరు ప్రవహించటం వల్ల రైతులు నష్టాలపాలవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని వంగవీడు, వెంకటాపురం, సిరిపురం గ్రామాలకు చెందిన పలువురు ఆయకట్టు, కౌలు రైతులు స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు కలెక్టర్‌కు ప్రజావాణిలో విజ్ఞప్తులు చేశారు.


నిధులు మంజూరైనా పునర్నిర్మాణంపై నిర్లక్ష్యం

రైతులు ఆక్రమించిన దాదాపు కిలోమీటరు నిడివిలో ఊటుకూరు మేజర్‌ను తిరిగి కాల్వగా తవ్వేందుకు ప్రభుత్వం రూ.9.93 లక్షల నిధులు మంజూరు చేసింది. పరిపాలనా అనుమతులు ఇచ్చి ఏడాది అవుతున్నా పనులు ప్రారంభించటం లేదు. ప్రస్తుతం పంటలు చేతికి వచ్చి పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ సమయంలో అధికారులు చొరవచూపి ఆక్రమణకు గురైన కాల్వను తిరిగి తవ్వితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. కాలువ ఆక్రమణతో 22 మంది రైతులకు చెందిన 250 ఎకరాల్లో పంట నష్టం జరుగుతోంది. సమస్య తీవ్రతను గుర్తించి నీటిపారుదలశాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాల్సి ఉంది.


కానరాని ఆనవాళ్లు..

మధిర మేజర్‌ కాలువ చివరిలో ఉన్న దిడుగుపాడు సమీపంలో ఆక్రమణకు గురైంది. కొంత కాలువను ఆనవాళ్లు లేకుండా చేసి రియల్టర్లు ప్లాట్లుగా మార్చి విక్రయించారు. ఈ తంతు దశాబ్దంన్నర క్రితం జరిగింది. దీనిపై పలు సందర్భాల్లో ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఈ ప్రాంత భూమి ఎకరం రూ.75 లక్షల నుంచి రూ.కోటి పలుకుతోంది. ఎన్నెస్పీని నీటిపారుదల శాఖ పరిధిలో విలీనం చేశారే కానీ అందుకు సంబంధించిన దస్త్రాలు, సమాచారాన్ని తమకు ఇవ్వలేదనే వాదన అధికారుల నుంచి వస్తోంది.
ఊటుకూరు మేజర్‌ చివరిలో కొంత ఆక్రమణకు గురైంది. దీన్ని పునర్నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. గతేడాది పనులు ప్రారంభించబోతే పైర్లు పాడవుతాయని రైతుల అభ్యర్థన మేరకు చేపట్టలేదు. ఎన్నికల కోడ్‌ తొలగాక పనులు ప్రారంభిస్తాం. తొలకరిలో పంటలు సాగుచేయవద్దని ఇప్పటికే రైతులకు తెలియజేశాం. మధిర మేజర్‌ కబ్జాకు గురైన ప్రాంతాన్ని గుర్తించాం. అందరికి నోటీసులు ఇచ్చాం. ఓ రైతు హైకోర్టుకు వెళ్లినందున తీర్పు వచ్చాకనే తదుపరి చర్యలు తీసుకుంటాం.

నాగబ్రహ్మం, డీఈఈ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని