logo

గెలిపిస్తే.. రాష్ట్ర గొంతుకగా నిలుస్తా: నామా

లోక్‌సభలో భారాస పక్షనేతగా తెలంగాణ రాష్ట్ర గొంతుకను వినిపిస్తున్న తనను త్వరలో జరిగే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని ఆ పార్టీ ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు.

Published : 16 Apr 2024 02:04 IST

మాట్లాడుతున్న ఎంపీ నామా నాగేశ్వరరావు

పాల్వంచ, న్యూస్‌టుడే: లోక్‌సభలో భారాస పక్షనేతగా తెలంగాణ రాష్ట్ర గొంతుకను వినిపిస్తున్న తనను త్వరలో జరిగే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని ఆ పార్టీ ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. పాల్వంచలోని లారీ ఓనర్స్‌     అసోసియేషన్‌ హాలులో భారాస పట్టణాధ్యక్షుడు మంతపూరి రాజుగౌడ్‌ అధ్యక్షతన భారాస కార్యకర్తల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. నామా మాట్లాడుతూ ‘420’ హామీలతో ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో నమ్మొద్దన్నారు. మోసపూరిత హామీలతో ఆపార్టీ మరోసారి బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. భారాస  విజయానికి బూత్‌ స్థాయి కార్యకర్తల నుంచి  మండల నాయకుల వరకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ‘గూడెం’ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు వచ్చేలా కృషిచేయాలని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో భారాస అత్యధిక ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. కార్యకర్తలు ఈనెల రోజులు పార్టీకోసం శ్రమించి నామాను గెలిపించాలన్నారు. గత శాసనసభ   ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ 100 రోజుల్లో ఆరు హామీలు నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసగించిందని విమర్శించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. కార్యకర్తలు పోరాడే తత్వంతో ముందుకు సాగాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యుడు బరపటి   వాసుదేవరావు, ఎంపీపీలు సరస్వతి, సోనా, ఎంపీటీసీ సభ్యులు పద్మ, కిలారు నాగేశ్వరరావు, మల్లెల రవిచంద్ర, భారాస మండలాధ్యక్షుడు మల్లెల శ్రీరామ్మూర్తి, హనుమంతరావు, ఆచార్యులు పాల్గొన్నారు.

ముఖ్య నాయకుల గైర్హాజరు?

నియోజకవర్గ సమావేశానికి పార్టీ ముఖ్య నాయకుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) గైర్హాజరయ్యారు. సమావేశ నిర్వహణపై సమాచారం లేక రాలేదా? లేక ఇంకేదైనా కారణం ఉందా? అని దిగువశ్రేణి నాయకులు చర్చించుకున్నారు. ఆయనతో పాటు భారాస జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొత్తగూడెం పుర ఛైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, రాష్ట్ర నాయకుడు ఎడవల్లి కృష్ణ తదితర ముఖ్య నాయకులు గైర్హాజరుకావడం చర్చనీయాంశమైంది. మరోవైపు వనమా తనయుడు రాఘవేంద్రరావుపై గతంలో పార్టీ విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సభా వేదికపై పలువురు స్థానిక నాయకులు ఒత్తిడి తీసుకురావటం కొసమెరుపు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని