logo

నీటి సంపులో పడి బాలుడి మృతి

ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన వైరా మండలం సిరిపురంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం...

Published : 16 Apr 2024 02:06 IST

యశ్వంత్‌

వైరా, న్యూస్‌టుడే: ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన వైరా మండలం సిరిపురంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... కూరాకుల గోపి, భవాని దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మణికంఠ, చిన్న కుమారుడు యశ్వంత్‌(2). భవాని వారం రోజుల నుంచి వైరాలోని ప్రైవేటు దుకాణంలో గుమస్తాగా వెళ్తుండగా, గోపి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఇంటి వద్ద చిన్నారులను చూసేందుకు అమ్మమ్మ ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం యశ్వంత్‌ ఆడుకుంటూ ఇంటి ఆవరణలో ఉన్న నీటిసంపులో పడిపోయాడు. దీనిని ఎవరూ గమనించలేదు. బాబు కోసం వెతుకుతుండగా నీటి సంపులో తెలియాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అక్కడున్నవారిని కలచివేసింది.


కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

పాల్వంచ పట్టణం: మణుగూరులో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పాల్వంచ ఎస్సై బి.రాము వివరాల ప్రకారం.. మణుగూరులో పనిచేసే కానిస్టేబుల్‌ నరేశ్‌ పాల్వంచ పోలీస్‌ క్వార్టర్స్‌ లో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఆయన కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన నరేశ్‌ సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ను పాల్వంచ సామాజిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.


వివాహిత బలవన్మరణం

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: భర్తతో వివాదాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్యహత్యకు పాల్పడ్డ ఘటన ఆటోనగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అల్లిక పున్నారావు, కవిత(28) దంపతులు ఆటోనగర్‌లో నివాసం ఉంటున్నారు. పున్నారావు ఆర్‌ఎంపీ వైద్యునిగా పనిచేస్తున్నాడు. అతను వివాహేతర సంబంధాలు పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తరచూ కవిత ఘర్షణపడేది. ఆదివారం రాత్రి కూడా దంపతులిద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో వివాహిత బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు పెట్టుకొని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోని హాల్లో నిద్రించిన పున్నారావు, కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూసేసరికి ఫ్యాన్‌కి ఉరేసుకొని కన్పించింది. శిక్షణ ఐపీఎస్‌ అధికారి మౌనిక, ఎస్‌ఐ రామారావు ఘటనా స్థలిని సందర్శించారు. భర్త, అత్త ఇద్దరూ కలిసి శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడంతోనే తన సోదరి మృతిచెందినట్లు మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామారావు తెలిపారు.


వడదెబ్బతో వ్యక్తి మృతి

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురైన వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన చేబ్రోలు బాబూరావు(48) సోమవారం మృతి చెందారు. బాబూరావుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఐదేళ్ల క్రితం మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని