logo

భక్తుల సేవే భగవంతుడి సేవ

శ్రీరామనవమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ ప్రియాంక అల తెలిపారు.

Published : 16 Apr 2024 02:16 IST

దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు

శ్రీరామనవమి ఉత్సవ పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఐటీడీఏ పీఓ ప్రతీక్‌ జైన్‌, కలెక్టర్‌ ప్రియాంక, దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, ఎస్పీ రోహిత్‌రాజ్‌

భద్రాచలం, భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: శ్రీరామనవమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ ప్రియాంక అల తెలిపారు. ఉత్సవ వివరాల ప్రచార కరపత్రాలను భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించి విధులు నిర్వర్తించే ఉద్యోగులంతా వేడుకలను విజయవంతం చేయాలన్నారు. తలంబ్రాల పంపిణీకి 60 కౌంటర్లు, ప్రసాదాలకు 19 కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్టీసీ ద్వారా మినీ బస్సులను బ్రిడ్జి, బస్టాండ్‌ నుంచి నడపనున్నట్లు వెల్లడించారు. 17న కల్యాణం, 18న పట్టాభిషేకం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లను పరిశీలించి భక్తులతో ముచ్చటించారు. అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఏస్పీ రోహిత్‌రాజు, ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌, రామాలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ దామోదర్‌రావు, ఏఈఓ శ్రవణ్‌కుమార్‌, ఈఈ రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు.  

2వేల మంది పోలీసులతో బందోబస్తు

శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకలకు 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఏస్పీ రోహిత్‌రాజు తెలిపారు. భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కల్యాణ మండపంలోని సెక్టార్‌ ఇన్‌ఛార్జిలు తమ పరిధిలోని సిబ్బందికి అందుబాటులో ఉంటూ రద్దీకి అనుగుణంగా అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఉత్సవాల ఏర్పాట్లను భక్తులు తెలుసుకోవచ్చునని చెప్పారు. ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ పాల్గొన్నారు.

క్యూఆర్‌ కోడ్‌


ఉచిత దర్శనాలు

శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం ఆలయం  తెరిచినప్పటి నుంచి రాత్రి మూసే వరకు ఉచితంగా మూలవిరాట్‌ను దర్శించుకునే అవకాశం అధికారులు కల్పించారు. ప్రధాన ఆలయంలో టికెట్‌పై పూజలకు అవకాశం కల్పిస్తే రద్దీ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.


18న గవర్నర్‌ రాక!

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఈసారి శ్రీరామనవమి వేడుకలకు ముత్యాల తలంబ్రాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తీసుకొస్తారనే ప్రచారం సాగుతోంది. పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్‌  రాధాకృష్ణన్‌ గురువారం హాజరవుతారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని