logo

గిరిజనులకు అండ.. కాషాయ జెండా

కాషాయ జెండా గిరిజనులకు అండగా నిలుస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం మైదానంలో సోమవారం నిర్వహించిన భాజపా జన సభలో ఆయన ప్రసంగించారు.

Published : 30 Apr 2024 05:07 IST

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

కొత్తగూడెంలో అభివాదం చేస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, చిత్రంలో ప్రేమేందర్‌రెడ్డి, ధర్మారావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, తాండ్ర వినోద్‌రావు, కేవీ రంగాకిరణ్‌, న్యాయవాది రమణారెడ్డి తదితరులు

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం: కాషాయ జెండా గిరిజనులకు అండగా నిలుస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం మైదానంలో సోమవారం నిర్వహించిన భాజపా జన సభలో ఆయన ప్రసంగించారు. గిరిజనుల అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తమపై అభిమానంతో ఎండను లెక్కచేయక ప్రజలు సభకు తరలివచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో భాజపా అభ్యర్థులు తాండ్ర వినోద్‌రావు, అజ్మీరా సీతారాంనాయక్‌ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తనపై పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులు ప్రధాని మోదీని విమర్శిస్తున్నారంటూ పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఓటమి భయంతోనే భాజపాపై బురద జల్లుతోందని, అందులో భాగంగానే రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తోందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్క అసెంబ్లీ సీటు కోసం సీపీఐ నాయకులు తమ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్‌ పార్టీకి కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు. వియ్యంకుడి హోదాలో కాంగ్రెస్‌ టికెట్‌ తెచ్చుకొని ఓట్లు అడగటానికి వచ్చే వలసవాదుల చేతిలో ప్రజలు మోసపోవద్దని ఖమ్మం లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర  వినోద్‌రావు కోరారు. గతంలో ఎందరో నాయకులు పాలించినా చెప్పుకోదగిన విద్య, వైద్యసంస్థలు రాలేదని తెలిపారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి సీతారాంనాయక్‌ మాట్లాడుతూ కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి మార్తినేని ధర్మారావు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల అధ్యక్షులు రంగాకిరణ్‌, గల్లా సత్యనారాయణ, నంబూరి రామలింగేశ్వరరావు, ఉప్పల శారద తదితరులు పాల్గొన్నారు.

భాజపా జనసభకు తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని