logo

ఓట్లు భద్రం.. తీర్పు సుస్పష్టం..!

దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈవీఎంలలో ఓటు భద్రమేనా అనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

Published : 02 May 2024 06:48 IST

దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈవీఎంలలో ఓటు భద్రమేనా అనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటికే ముగిసిన మొదటి, రెండో విడత పోలింగ్‌ శాతాల వెల్లడిలో జాప్యంపై వివిధ పార్టీలు ఈసీఐ విధానాన్ని ప్రశ్నించాయి. తొలి విడత (ఏప్రిల్‌ 19), రెండో విడత (ఏప్రిల్‌ 26) పోలింగ్‌ శాతం వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా మంగళవారం ప్రకటించింది. తొలి విడత పోలింగ్‌ ముగిసిన పదకొండు రోజుల తర్వాత తుది వివరాలు వెల్లడించటంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది అధికార భాజపాకు మేలు చేసేందుకేనని పరోక్షంగా విమర్శిస్తున్నాయి. ఎన్నికల అధికారులు మాత్రం ఈవీఎంలలో పొరపాట్లు జరగటానికి ఆస్కారమే లేదంటున్నారు. పోలింగ్‌ శాతం వెల్లడిలో ఆలస్యమైనంత మాత్రాన పోలైన ఓట్లపై ప్రభావం ఉండబోదని చెబుతున్నారు.

ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు ప్రతి ఓటూ కీలకం. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌)లపై పలుమార్లు రాజకీయ పార్టీలు సందేహాలు వ్యక్తం చేశాయి. వాటి పనితీరుపై తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈవీఎంలు పారదర్శకంగా పనిచేస్తాయని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఓటేసేందుకు వినియోగించే ఈవీఎంలను అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు సమక్షంలో వివిధ దఫాల్లో పరిశీలిస్తామంటున్నారు. పోలింగ్‌ ముగిశాక కట్టుదిట్టమైన భద్రత నడుమ వాటిని స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలిస్తామని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పటిష్ఠ బందోబస్తు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, భద్రత సిబ్బంది కనుసన్నల్లో స్ట్రాంగ్‌ రూమ్‌లు ఉన్నప్పుడు అవకతవకలకు ఆస్కారం లేదని చెబుతున్నారు.

 పారదర్శకంగా వీవీప్యాట్‌ చీటీల లెక్కింపు

ఈవీఎంలపై అపోహలు తొలగించేందుకు కంట్రోల్‌ యూనిట్‌లో నమోదైన ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్‌లతో సరిపోల్చే విధానాన్ని ఈసీ అనుసరిస్తోంది. లోక్‌సభ స్థానం పరిధిలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలోని ఏదైనా ఒక కంట్రోల్‌ యూనిట్‌ను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. వీటిని లెక్కించటానికి ప్రత్యేక టేబుల్‌ సమకూర్చుతారు. లెక్కింపు ప్రక్రియ సంబంధిత ఆర్‌ఓ లేదా ఏఆర్‌ఓ పర్యవేక్షణలో జరుగుతుంది. సీయూలోని ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్‌ల మధ్య వ్యత్యాసం ఉంటే వీవీప్యాట్లను ఒకటికి రెండుసార్లు లెక్కిస్తారు. చివరికి వీవీప్యాట్‌ స్లిప్‌లనే ప్రామాణికంగా తీసుకుని తుది ఫలితాలను ఆర్‌ఓ వెల్లడిస్తారు. ఒకదాని తర్వాత మరొక వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కిస్తారు.

వ్యత్యాసం ఉండదు

పోలింగ్‌ ముగిశాక ప్రిసైడింగ్‌ అధికారి చట్టబద్ధమైన ఫాం-17(సీ)లో పోలైన ఓట్ల వివరాలను నమోదుచేస్తారు. ఫాం-17(సీ) రెండు భాగాలను కలిగి ఉంటుంది. మొత్తం పోలైన ఓట్లను లెక్కించి ఫాం-17(సీ)లోని మొదటి పార్టులో పొందుపరుస్తారు. రెండో పార్టును ఓట్ల లెక్కింపు రోజు వినియోగిస్తారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌ ఏజెంట్‌ సదరు పోలింగ్‌ కేంద్రంలో నమోదైన ఓట్ల వివరాలతో కూడిన ఫాం-17(సీ) ఒరిజినల్‌ కాపీ పొందవచ్చు. ఇది ఓట్ల లెక్కింపు రోజు అభ్యర్థికి ఉపయోగపడుతుంది. అంతకుముందు ఫాం-17ఏ (ఓటర్ల రిజిస్టర్‌)లో నమోదైన ఓట్లు, ఫాం-17(సీ)లో ప్రస్తావించిన వివరాలు సరిపోలితేనే ఏజెంట్లు పీఓ ఇచ్చే ధ్రువపత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. పోలింగ్‌ ముగిశాక ఈవీఎంలకు ఫాం-17(ఏ), 17(సీ) కాపీలు జతపరిచి సీల్‌ వేసి స్ట్రాంగ్‌ రూంలో భద్రపరుస్తామని అధికారులు చెబుతున్నారు. తద్వారా పోలైన ఓట్లకు ఈవీఎంలోని ఓట్లకు వ్యత్యాసం వచ్చే అవకాశం లేదంటున్నారు. టెండర్‌ ఓట్లను ఫాం-17(బీ)లో నమోదుచేస్తారు.

ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌

పోలింగ్‌ ప్రారంభానికి ముందు పోలింగ్‌ కేంద్రంలో ఉపయోగిస్తున్న బ్యాలెట్‌ బాక్స్‌ ఖాళీగా ఉందని ప్రిసైడింగ్‌ అధికారి అక్కడి ఏజెంట్లకు చూపిస్తారు. ఈవీఎంలలో అంతకుముందు ఓట్లు దాగిలేవని ఏజెంట్లను పీఓ సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత పోలింగ్‌ కేంద్రానికి కేటాయించిన సీయూ(కంట్రోల్‌ యూనిట్‌)లో రిజల్ట్‌ బటన్‌ నొక్కటం ద్వారా అందులో ఇదివరకే నమోదైన ఓట్లు ఏమీ లేవని ధ్రువీకరిస్తూ ఏజెంట్ల ముందు ప్రదర్శిస్తారు. ఆతర్వాతే ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని